HongKong: హాంకాంగ్‌లో భోగి సంబరాలు.. బుజ్జాయిల సందడి

తెలుగు ప్రజలంతా ఎక్కడున్నా జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. భోగి, మకర సంక్రమణం, కనుమ.. ఈ మూడు రోజులూ పెద్ద పండగే. ప్రత్యేకంగా భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే.

Updated : 15 Jan 2024 23:52 IST

హాంకాంగ్‌: తెలుగు ప్రజలంతా ఎక్కడున్నా జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. భోగి, మకర సంక్రమణం, కనుమ.. ఈ మూడు రోజులూ పెద్ద పండగే. ప్రత్యేకంగా భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. హాంకాంగ్‌లో నివసిస్తున్న తెలుగు వారు కూడా ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ స్థాపించక ముందు నుంచే భోగిని వేడుకగా జరుపుకుంటున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తెలిపారు. తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సరం నిర్వహించిన భోగిపండ్ల సరదాల విశేషాలను ఆమె పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక యునెస్కో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తిరునాచ్ దంపతులు, బాలవిహార్ గురువు చిత్ర జికేవీ దంపతులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. తర్వాత పిల్లలంతా కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ వేడుకలో కొందరు తొలిసారిగా పాల్గొన్నారు. తమ పిల్లలకు అందరితో కలిసి భోగి పండ్లు పోయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.   

కార్యవర్గ సభ్యులు రమాదేవి, రమేష్, రాజశేఖర్, మాధురి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వేడుకకు విచ్చేసిన సభ్యులు సైతం తమ వంతు సహాయాన్ని అందించారు. ఈ విశేషాలను రవికాంత్ కెమెరాలో బంధించారు. వచ్చే వారం వార్షిక తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించనున్నారని, పిల్లలు తమ సంగీత నాట్య కళలను ప్రదర్శించనున్నట్లు జయ పీసపాటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ ఆత్మీయ పాఠకులందరికి హాంకాంగ్ తెలుగు సమాఖ్య తరఫున జయ పీసపాటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని