సింగపూర్‌: అలరించిన భాగవత పద్యాల పోటీ

భాగవతం ఆణిముత్యాలు.ఆర్గ్ వారి ‘రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ - 2021’ కార్యక్రమం అంతర్జాలంలో అద్భుతంగా జరిగింది. సింగపూర్

Published : 18 Jul 2021 19:32 IST

భాగవతం ఆణిముత్యాలు.ఆర్గ్ వారి ‘రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ - 2021’ కార్యక్రమం అంతర్జాలంలో అద్భుతంగా జరిగింది. సింగపూర్ నుంచి కూడా 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతన భాగవతంలోని పద్యాలను పాడి వినిపించారు. అంతేకాదు, వాటి తాత్పర్యాన్ని కూడా వర్ణించి చెప్పి పలువురు పెద్దల ప్రశంసలు అందుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ భాగవత పద్యపఠన పోటీలలో భాగంగా సింగపూర్ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఈ వారాంతంలో తొలిదశ పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్ లోని ప్రధాన సంస్థలైన ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘సింగపూర్ తెలుగు సమాజం’ కలిసి అంతర్జాల వేదికపై చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా అమెరికా నుంచి ‘భాగవత ఆణిముత్యాలు’ సంస్థ అధ్యక్షులు మల్లిక్ పుచ్చా, నిర్వాహకులు సాయి రాచకొండ, ప్రముఖ గాయకులు నేమాని పార్థసారథి విచ్చేసి చిన్నారులకు ఆశీస్సులను అందించారు.

న్యాయనిర్ణేతలుగా లంక దుర్గాప్రసాద్ , పాతూరి రాంబాబు,   దొర్నాల రాధాకృష్ణ శర్మ  విచ్చేసి చిన్నారుల పద్య పఠనానికి వారి స్పందనలను ఆశీస్సులను తెలియజేశారు. కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు ఊలపల్లి భాస్కర్ మాట్లాడుతూ  భాగవతం వంటి ఆధ్యాత్మిక నిధిని మన భావి తరాలకు అందజేయడం ఎంతో అవసరమని, అందుకు IBAM వంటి సంస్థలు ఇటువంటి పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలలో ముఖ్యంగా భాగవతంపై ఆసక్తి పెరిగేందుకు తోడ్పడుతుందని, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో సింగపూర్ నుంచి తమ చిన్నారులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేక బహుమతిగా నేమాని పార్థసారథి నెల రోజుల పాటు భాగవత పద్యాల శిక్షణ ఇస్తారు. అలాగే కార్యక్రమం నుంచి ఎంపికైన చిన్నారులు సెప్టెంబరులో జరుగనున్న రెండో దశ పోటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర రెడ్డి, కాకతీయ సాంస్కృతిక పరివారం ఉపాధ్యక్షుడు సుబ్బు పాలకుర్తి , శ్రీ సాంస్కృతిక  కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ తదితరులు పాల్గొని చిన్నారులకు చక్కటి ప్రోత్సాహాన్ని, అభినందనలని అందజేశారు.

ఈ కార్యక్రమానికి  నమోదు చేసుకున్న పిల్లలకి రాధ పింగళి గత ఆరు వారాలుగా తర్ఫీదునిచ్చి పోటీకి వన్నె తెచ్చారు. రామాంజనేయులు చామిరాజ్ వ్యాఖ్యాతగా, సమన్వయకర్తగా చేసారు. గణేశ్న రాధా కృష్ణ సాంకేతిక సమన్వయం అందించగా చివుకుల సురేష్ , జాహ్నవి వేమూరి, రాధికా మంగిపూడి  తదితరులు సాంకేతిక సహకారం అందించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని