Updated : 24/11/2021 10:21 IST

స్వదేశంలో బీటెక్‌.. విదేశాల్లో ఎంఎస్‌

రాష్ట్రంలో ఎంటెక్‌ చదివేది 4వేల మంది.. విదేశాల్లో ఎంఎస్‌లో చేరుతోంది 25వేల మంది

ఇంజినీరింగ్‌లో పీజీ ఎక్కడ చదువుతావని బీటెక్‌ విద్యార్థులను అడిగే పరిస్థితి ఇక రాకపోవచ్చు.. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో ఎంటెక్‌ చదివే వారి సంఖ్య నామమాత్రంగా మారుతోంది. బీటెక్‌ తర్వాత ఏం చేస్తావని అడిగితే.. ఉద్యోగం వస్తే ఇక్కడే ఉంటా.. లేకుంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఎక్కడోచోట ఎంఎస్‌ చేస్తా అని ఎక్కువ మంది యువత బదులిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం కొలువులు వచ్చినా వాటిని వదిలి.. పీజీ ఇంజినీరింగ్‌కు విదేశాలకు వెళ్లేవారే అధికంగా కనిపిస్తున్నారు.

నాలుగింతలు అధికం

రాష్ట్రంలో ఎంటెక్‌లో చేరుతున్న వారు ఏటా సరాసరి 4వేల మందే. బీటెక్‌ పూర్తయినవారు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌) రాసి ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఎంటెక్‌ చేసేవారు మరో రెండు, మూడువేల మంది ఉంటారన్నది అంచనా. ఆ మొత్తం కలిపినా ఆరేడు వేలకు మించదు. అదే సమయంలో రాష్ట్రం నుంచి ఏటా  10-12వేల మంది  ఎంఎస్‌ చేసేందుకు అమెరికాకు వెళుతున్నారని అంచనా. ఇక కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో పీజీ చేసేందుకు వెళ్తున్నవారు మరో 10-15వేల మంది ఉంటారు. ఇలా మొత్తంగా రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య 25వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే ఇక్కడ కంటే విదేశాల్లో ఎంఎస్‌ చేసేవారే నాలుగింతల మంది ఎక్కువగా ఉంటుండటం గమనార్హం.


అందుకే ఎంటెక్‌ చేయడం లేదు

ఉద్యోగ ఇంటర్వ్యూలకు కనీసం పిలవాలని కోరినా అనేక కంపెనీలు ఎంటెక్‌ వాళ్లు అవసరం లేదంటున్నాయి. అలాంటి ఆ డిగ్రీతో మాకేం ప్రయోజనం అంటూ విద్యార్థులు ఎంటెక్‌ చేయడం లేదు’ అని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.రవీంద్ర అభిప్రాయపడ్డారు.


ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నందుకే

బోధన, పరిశోధన వైపు వెళ్లాలనుకునేవారే ఎక్కువగా ఎంటెక్‌ చేస్తున్నారు. మిగిలినవారు ఆ పట్టాతో భారత్‌లో తమ కెరీర్‌కు ఉపయోగం లేదంటూ విదేశాలకు వెళుతున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహమూ ఉంటోందన్నారు. మెండుగా ఉద్యోగావకాశాలు లభిస్తాయనే యువత అటువైపు దృష్టిపెడుతోందని వివరించారు.


* ఆర్థిక స్థోమత లేనివారు విద్యా రుణాలు తీసుకొంటున్నారు. ఆ మొత్తాన్నీ డ్రా చేయడం లేదు. మొదటి సెమిస్టర్‌ నుంచే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ వసతి, భోజనాది ఖర్చులతో పాటు కొంత ఫీజునూ విద్యార్థులే చెల్లిస్తున్నారని ఐఎఫ్‌ఎంఎస్‌ విదేశీ కన్సల్టెన్సీ సంచాలకుడు అజయ్‌కుమార్‌ చెప్పారు.


ఎందుకీ పరిస్థితి..?

‘ఎంటెక్‌లో కూడా సైబర్‌ సెక్యూరిటీ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, డిజైన్‌ ఇంజినీరింగ్‌ లాంటి కొన్ని బ్రాంచీల వారికే ఉద్యోగాల్లో కాస్త ప్రాధాన్యం ఉంటుంది. దానివల్ల పీజీ చదివేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు’ అని జేఎన్‌టీయూహెచ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యుడు కామాక్షిప్రసాద్‌ చెప్పారు. వైద్యరంగంలో పీజీకి, ఫార్మాలో ఎంఫార్మసీ, న్యాయరంగంలో ఎంఎల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండగా.. ఇంజినీరింగ్‌లో తద్భిన్న పరిస్థితి కొనసాగుతోంది. అదే అమెరికాలో అయితే ఎంఎస్‌ ఆధారంగానే ఉద్యోగాలిస్తున్నారు. అందువల్ల మన యువత ఆ దేశం వైపు చూస్తోంది అన్నారాయన.- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని