ఖతార్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

‘ఆంధ్ర కళావేదిక’ ఆధ్వర్యంలో ఖతార్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Published : 27 Feb 2022 11:22 IST

ఖతార్‌: ‘ఆంధ్ర కళావేదిక’ ఆధ్వర్యంలో ఖతార్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ధి, పరిరక్షణలో భాగంగా ఏటా ఫిబ్రవరి 21న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఖతార్‌లోని ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఐసీసీ) అశోకా హాల్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలుగువారి నుంచి అపూర్వ స్పందన లభించిందని.. మాతృభాష పట్ల అభిమానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంగా తమ కార్యవర్గం చేసిన కృషి ఫలించిందని చెప్పారు. యువత, పెద్దల్లో మాతృభాష పట్ల స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసేలా మూడు రోజుల పాటు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో రెండున్నర సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసున్న అభ్యర్థులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా మలిచారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో చిన్నారుల ఏకపాత్రాభినయం, నృత్యాలు, పాటలతో పాటు తెలుగు భాషను బోధిస్తున్న ఉపాధ్యాయులు, న్యాయ నిర్ణేతలను వేదికపై సన్మానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసినందుకు ఐసీసీ అధ్యక్షులు పీఎన్‌ బాబు రాజన్‌, ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్‌ ఛైర్మన్‌ కేఎస్‌ ప్రసాద్‌, ఐసీబీఎఫ్‌ నుంచి రజనీమూర్తితో పాటు ఇతర ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ‘ఆంధ్ర కళావేదిక’ కార్యవర్గాన్ని అభినందించారు. వ్యాఖ్యాతలుగా శిరీష, సుధ వ్యవహరించారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి సుఖవాసి ముగింపు సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకునేందుకు సహకరించిన దాతలకు.. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులు, వాలంటీర్లు, ప్రత్యక్షంగా.. పరోక్షంగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ‘ఆంధ్ర కళావేదిక’ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని