డా.చంద్రమోహన్‌కు బ్రిటిష్‌ సీబీఈ పురస్కారం

నిజామాబాద్‌ జిల్లాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్‌ ప్రతిష్ఠాత్మక బ్రిటిష్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated : 02 Jan 2024 16:55 IST

ఈనాడు, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్‌ ప్రతిష్ఠాత్మక బ్రిటిష్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. బ్రిటన్‌లో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా ‘కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ)’ పురస్కారాన్ని అందిస్తారు. 2023 ఏడాదికి గానూ వైద్యరంగంలో చంద్రమోహన్‌ చేసిన సేవలకు ఈ పురస్కారం ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఆ దేశంలో స్థిరపడి ఈ పురస్కారం పొందిన తొలి వ్యక్తి చంద్రమోహన్‌ కావడం విశేషం. నిజామాబాద్‌ జిల్లా కోటగిరికి చెందిన దామోదర్‌రావు- సరోజిని దంపతుల కుమారుడైన ఈయన జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మారం గ్రామంలో జన్మించారు. స్థానిక నిర్మల్‌లో రెండో తరగతి, ఆ తర్వాత ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లో విద్యనభ్యసించారు. అనంతరం గుంటూరు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ చేశారు. 2002లో లండన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జనరల్‌ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూ.. ఆ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం బ్రిటన్‌లో వైద్యుల సంఘానికి అధ్యక్షుడి ఉన్నారు. చంద్రమోహన్‌ బ్రిటన్‌లో స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆయనకు వచ్చిన ఆదరణ చూసి అక్కడ వచ్చే ఏడాదిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఆ దేశ ప్రధాని రిషిసునాక్‌తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని