ఓటు లేని విద్యార్థుల విజ్ఞప్తులు వినాలని.. ‘డయల్ యువర్ విలేజ్‌’ పోస్టుకార్డు ప్రచారం

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. ఓటు వేసే వారికే విలువ ఉంటుందని.. మరి, హక్కు లేని విద్యార్థుల సమస్యలు ఎవరు పట్టించుకోవాలని "డయల్ యువర్ విలేజ్‌" అనే ఎన్నారై సంస్థ ప్రశ్నించింది.

Updated : 05 Feb 2024 12:52 IST

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. ఓటు వేసే వారికే విలువ ఉంటుందని.. మరి, హక్కు లేని విద్యార్థుల సమస్యలు ఎవరు పట్టించుకోవాలని "డయల్ యువర్ విలేజ్‌" అనే ఎన్నారై సంస్థ ప్రశ్నించింది.

"నేటి బాలలే రేపటి పౌరులు" అంటారు. రేపు పౌరులుగా ఎదగాల్సిన వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. గత ఏడు దశాబ్దాల స్వతంత్ర దేశంలో ఇంకా గ్రామీణ ప్రాంత పిల్లలకు సరైన విద్య అందడం లేదు. ప్రభుత్వ విద్యపై నమ్మకం కోల్పోయిన ప్రజలు ప్రైవేట్‌లో వేల, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి మారాలని, నూతన ప్రభుత్వం విద్యను ఒక ప్రాధాన్యతగా తీసుకొని, భారీగా బడ్జెట్ కేటాయించాలని "డయల్ యువర్ విలేజ్‌" అనే ఎన్నారై సంస్థ "పోస్టుకార్డు ప్రచారం" మొదలుపెట్టింది. వేలాదిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు ముందుకొచ్చారు. ఇరవై వేలకు పైగా విద్యార్థులు తమ బడులలో సమస్యలను రాసి, ముఖ్యమంత్రికి నేరుగా పోస్ట్ కార్డు ద్వారా పంపించారు.

"ఇది పోస్ట్ కార్డు కాదు, విద్యార్థుల ఆవేదన! ఉపాధ్యాయుల విజ్ఞప్తి! సమస్త గ్రామీణ ప్రజల ఆకాంక్ష! కేవలం మాకు నాణ్యమైన విద్య ఇస్తే చాలు, ఏ ఉచితాలు మాకు అక్కర్లేదు, మా భవిష్యత్తు మేము నిర్మించుకోగల్గుతాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఉచితాల పేరిట మమ్మల్ని నిర్వీర్యులను చేయకండి. మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి" అని వాళ్ల మనసులు ఘోషిస్తున్నాయని "డయల్ యువర్ విలేజ్‌" సంస్థ పేర్కొంది.

‘‘ఉచితాలు ఇస్తే తీసుకుంటున్నారుగా అని అనకండి. అది కేవలం మాకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మేము మా పిల్లలకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాం. మా ఖర్చులు తగ్గించుకుని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు బీద ప్రజలను న్యూనత భావనలోకి నెడుతున్నాయి. వారిని కేవలం ఓటు, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. చదువు రాని వాళ్లను అట్లాగే ఉంచేసి, ఒక బానిస సమాజాన్ని తయారు చేస్తున్నారు. దానితో, తమ డబ్బుతో చదువు ‘కొనే’ వారికే అన్ని అవకాశాలు, ప్రయోజనాలు చేకూరుతున్నాయి. బీద, గ్రామీణ సమాజానికి, ధనిక, పట్టణ వాసులకు అంతరం రోజు రోజుకి పెరుగుతుంది. మంచి విద్య లేకపోతే, స్వావలంబన, సృజనాత్మకత ఎలా వస్తుంది? ఈ అర కోర చదువుల వల్లే యువత ప్రభుత్వ ఉద్యోగాలపై అనవసర ఆశలు పెట్టుకొని తమ సమయాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం. ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య బీదలకు, గ్రామీణులకు, పట్టణాల్లో ఉన్న పేదలకు అందించడం’’ అని ఆ సంస్థ సూచించింది.

‘‘పరిపాలనలో దక్షత, సుపరిపాలన అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల ప్రణాళికలు, వాటి ఫలితాలు ప్రజలకు చేరే విధంగా చూడటం. కేవలం డబ్బులు పంచడం విజ్ఞత కాదు. అది పరిపాలన అనిపించుకోదు. ప్రభుత్వ విధానాలు సంస్కరించడానికి మొదటి చర్య విద్య కావాలి. ఎన్నారైలుగా మాకు విద్య విలువ తెలుసు. కేవలం విద్య ఉండటం వల్లే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా ఈ స్థాయికి రాగలిగాం. ప్రతి పేద, గ్రామీణ విద్యార్థికి ఆ అవకాశం ఉంది. కేవలం మంచి విద్య ఇవ్వండి చాలు. అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని నిలబెడుతుంది. మేము అనేక రకాలుగా మాకు అవకాశం ఉన్నంతవరకు అనేక విద్యార్థులకు, బడులకు సాయం చేస్తున్నాం. కానీ, మా సాయం పరిమితం. అక్కడి అవసరాలు పరిమితం’’ అని ఆ సంస్థ తెలిపింది.  బడులను బాగు చేయాలని.. విద్యా వ్యవస్థను కాపాడాలని అందరి విద్యార్థుల తరఫున తాము విజ్ఞప్తి చేస్తున్నామని "డయల్ యువర్ విలేజ్‌" కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు