Siliconandhra University: ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని 5వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Published : 06 Jun 2023 20:11 IST

మిల్పిటాస్‌: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని 5వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ హెడ్ హర్షుల్ అస్నానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడు సంవత్సరాలుగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భరతనాట్యం, కూచిపూడి, కర్ణాటక సంగీతం, హిందూస్తానీ, తెలుగు, సంస్కృత విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, మాస్టర్స్ కోర్సులను అందజేస్తోంది. ఇందులో భాగంగా 2022-23 విద్యాసంవత్సరంలో 65 మంది విద్యార్థులు తమ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు.

తొలుత మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారి వేదపఠనంతో సభ మొదలయింది. కుమారి ఈషా తనుగుల అమెరికా జాతీయ గీతాలాపన అనంతరం విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల అధ్యక్షోపన్యాసం చేశారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల చరిత్రల్లో అతి తక్కువ కాలంలోనే WASC గుర్తింపు పొందిన ఏకైక విశ్వవిద్యాలయం తమదేనని  గుర్తుచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్‌ కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రారంభిస్తున్నామని, ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థులు అమెరికాకు వచ్చి చదువుకోవడానికి వీలుగా I -20 లు మంజూరు చేయడానికి తమ సంస్థకు అమెరికా నుంచి అనుమతి లభించిందని అన్నారు. వైద్య, ఆయుర్వేద, యోగా, నర్సింగ్ తదితర శాఖలు యూనివర్సిటీలో అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, ఎప్పటిలాగే వాటికీ అందరి సహాయ సహకారాలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విశ్వవిద్యాలయ బోర్డు ఛైర్మన్ డా.పప్పు వేణుగోపాలరావు మాట్లాడుతూ ఏడేళ్ళ క్రితం ఒక గొప్ప ఆశయం, లక్ష్యంతో మొదలైన ఈ కల, భారతీయ భాషలు, కళలకే పరిమితం కాకుండా అమెరికన్ విశ్వవిద్యాలయాలకు దీటుగా సమీప భవిష్యత్తులో ట్రేసీ నగరంలో 67 ఎకరాల్లో నిర్మింపబోయే సొంత ప్రాంగణంలో అన్ని రంగాల్లో విద్యాబోధన చేస్తుందని ప్రకటించారు.

ముఖ్య అతిథి హర్షుల్ అస్నానీ స్నాతకోపన్యాసం చేశారు. తాను సాంకేతిక రంగం నించి వచ్చినందున భాషా, కళా రంగాల్లో పట్టభద్రులైన వారికి ఆ రంగానికి సంబంధించిన సలహాలు ఇవ్వలేకపోయినా ఏ రంగంలోనైనా రాణించడానికి, తను అవలంబించే ఐదు సూత్రాల ప్రణాళికను విద్యార్థులతో పంచుకున్నారు. జీవితంలో ఎప్పటికీ నిత్య విద్యార్థిగా ఉండాలని, ఎవరేమి చెప్పినా స్వశక్తి మీద నమ్మకం కోల్పోవద్దని, కృతజ్ఞతా భావంతో అందరిపట్ల దయతో ఉండాలని చెప్పారు. విశ్వవిద్యాలయ ప్రోవోస్ట్ చమర్తి రాజు ముఖ్య సంపాదకులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో బోర్డు మెంబర్ డాక్టర్ జ్ఞానదేవ్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ జర్నల్ శాస్త్రను విడుదల చేశారు. 

విశ్వవిద్యాలయ ప్రధాన విద్యాధికారి రాజు చమర్తి మాట్లాడుతూ, ఈ సంవత్సరం పట్టాలు పొందిన వారిలో హైస్కూల్ స్థాయి విద్యార్థుల నుంచి విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వారు కూడా ఉండటం విశేషమన్నారు. కేవలం అమెరికా నుంచి మాత్రమే కాకుండా భారత్‌, సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ బోర్డు కీలక సభ్యులు రిచర్డ్ ఆస్బోర్న్ ముగింపు ఉపన్యాసం చేశారు. భారతీయ కళలు ఒక ఆదర్శ జీవిత విధానాన్ని ఎలా అవలంబించాలో అన్యాపదేశంగా నేర్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగాన్ని చాట్ జీపీటీ తయారు చేసిందని, తన సొంతది కాదని చమత్కరిస్తూ సాంకేతిక రంగంలో వచ్చే మార్పులను  స్వీకరిస్తూ పురాతన శాస్త్రీయ వైభవాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

బోర్డు సభ్యులు, కల్వచెర్ల  ప్రభాకర్, డాక్టర్ బారీ రాయన్, ఏమీ కాట్లిన్, ఎలిజబెత్ షూమేకర్, మరియు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ మృణాళిని చుండూరి, సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ వసంతలక్ష్మి, కూచిపూడి భరతనాట్య విభాగాల నుంచి డా.యశోద ఠాకూర్, డా.కరుణ విజయేంద్రన్, డా.అనుపమ కౌశిక్‌లు వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి విశేషంగా కృషి చేసిన విశ్వ విద్యాలయ సిబ్బంది డా. కార్తీక్ పటేల్, మమతా కూచిభొట్ల, సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం లకు ఆనంద్ కూచిభొట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరూ తమ కుటుంబాలతో, స్నేహితులతో ఫోటోలు తీసుకుంటూ యాజమాన్యం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ సందడిగా గడిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని