Singapore Telugu Samajam: సింగపూర్‌లో ఉత్సాహంగా ‘నారీ-2022’

సింగపూర్‌లో నివసించే తెలుగు వనితల కోసం ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో ‘నారీ-2022’ పేరుతో లేడీస్‌ నైట్‌ కార్యక్రమాన్ని

Updated : 30 Aug 2022 14:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సింగపూర్‌లో నివసించే తెలుగు వనితల కోసం ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో ‘నారీ-2022’ పేరుతో లేడీస్‌ నైట్‌ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. సింగపూర్‌లోని ఆర్చర్డ్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నటి హరితేజ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముఖ్యఅతిథిగా ఏపీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ప్రముఖ గాయని సునీత తన పాటలతో ఉర్రూతలూగించారు. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ ఈవెంట్‌కు సుమారు 500 మంది మహిళలు హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా మిస్‌ అండ్‌ మిసెస్‌ ఎస్‌టీఎస్‌ పోటీలు, ఫాస్టెస్ట్‌ ఫింగర్స్‌, వేషభాషల అనుకరణ, స్టెప్స్‌ ఛాలెంజ్‌, తల్లీకూతుళ్ల సరదా సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంప్రదాయబద్ధంగా వివిధ రకాల చీరలతో నిర్వహంచిన ప్రదర్శన సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం.. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తనను ఆహ్వానించడంపై ఆనందం వ్యక్తం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ఈ కార్యక్రమం చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఆహూతులను అలరింపజేసిన గాయని సునీత, వ్యాఖ్యాత హరితేజకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిజీ షెడ్యూల్‌ను సైతం పక్కనపెట్టి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి రోజాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, విజేతలు, సింగపూర్‌లోని పలు మహిళా సంఘాలు, లక్కీ డ్రా విజేతలు, హాజరైన మహిళలకు నిర్వాహకురాలు విజయారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని