NTR: ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా న్యూజెర్సీలో ఘన నివాళి

ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా అమెరికాలోని ఎన్నారైలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Published : 21 Jan 2024 20:05 IST

న్యూజెర్సీ: ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా అమెరికాలోని ఎన్నారైలు ఘనంగా నివాళులర్పించారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో యూబ్లడ్‌ యాప్‌ అధినేత డాక్టర్‌ జై యలమంచిలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఆన్‌లైన్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి.. పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. 

ప్రముఖ క్యాన్సర్‌ చికిత్స నిపుణుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ సతీమణి అనారోగ్యం కారణంగా అమెరికా వస్తే తానే చికిత్స చేసినట్లు చెప్పారు. ‘మేమైతే అమెరికా వచ్చి చికిత్స చేయించుకున్నాం.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి?’అని అప్పుడే ఎన్టీఆర్‌ ఆలోచించి తన భార్య పేరిట హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తి అని డాక్టర్‌ నూరి కొనియాడారు. 

కార్యక్రమ నిర్వాహకులు జై యలమంచిలి మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్‌ శాశ్వతంగా నిలిచిపోయారని, సినిమాలు ఉన్నంత కాలం.. తారకరాముడి నామం నిలిచే ఉంటుందన్నారు. రాజేందర్‌ డిచ్‌పల్లి, ప్రదీప్‌ సాముల, నాగేశ్వర్‌ చెరుకుపల్లి, టి.పి రావు, శ్రీనివాస్‌ నాదెళ్ల, తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన్నవ మోహన్‌కృష్ణ, మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. యుగపురుషులు అరుదుగా జన్మిస్తారని, అందులో ఎన్టీఆర్‌ ఒకరని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కీర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని