మహాత్ముడి విగ్రహానికి ఒహైయో సెనేటర్‌ నీరజ్‌ పుష్పాంజలి

భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఒహైయో సెనేటర్ నీరజ్ అంటానీ మంగళవారం పుష్పాంజలి ఘటించారు. యావత్‌ ప్రపంచానికి మహాత్ముడు ఆదర్శవంతమైన నాయకుడని .......

Published : 05 Aug 2021 20:59 IST

డాలస్‌/టెక్సాస్‌: భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఒహైయో సెనేటర్ నీరజ్  ఆంటానీ పుష్పాంజలి ఘటించారు. యావత్‌ ప్రపంచానికి మహాత్ముడు ఆదర్శవంతమైన నాయకుడని కొనియాడారు. ఆయన చూపిన శాంతి మార్గం సకల మానవాళికి ఆచరణీయమన్నారు. కేవలం ప్రవాస భారతీయులనే కాకుండా స్థానిక అమెరికన్లతో మమేకమై అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి అమెరికాలోనే అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని డాలస్‌లో ఏర్పాటు చేయడంలో డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర కృషిని ఆయన ప్రశంసించారు. ఈ స్మారక కట్టడానికి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. భారత సంతతికి చెందిన రెండో తరం వారు అమెరికా రాజకీయాల్లో ముందంజలో ఉన్నారనేందుకు గుజరాత్ మూలాలున్న నీరజ్ ఆంటానీయే ఉదాహరణగా నిలుస్తారన్నారు. 23 ఏళ్ల వయసులోనే ఒహైయో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి రిపబ్లిక్ పార్టీ తరపున మూడు సార్లు ఒహైయో రాష్ట్ర ప్రతినిధిగా ఎన్నికయ్యారని చెప్పారు. అలాగే ఆరేళ్ల పాటు ఆ పదవిలో పనిచేసి, ఇటీవలే ఒహైయో సెనేట్‌కు కూడా ఎన్నికై రికార్డు సృష్టించారని ప్రశంసించారు. ఒహైయో రాష్ట్ర సెనేటర్‌ పదవిలో నీరజ్‌ డిసెంబర్ 31, 2024 వరకు కొనసాగుతారని, అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న ప్రవాస భారతీయుల్లో అతి పిన్న వయస్కుడు ఆయనే కావడం గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత్‌-అమెరికా మిత్రమండలి ఉపాధ్యక్షుడు, మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వాల, బోర్డు అఫ్ డైరెక్టర్ రాంకీ చేబ్రోలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని