ముగ్గురు మిత్రుల ఆత్మీయ ఆలోచన.. అనాథలకు పంచె, ఓణీల పండగ

సేవ అంటే అండగా ఉండటం కాదు.. ఆసరాగా నిలవడం కాదు.. అభాగ్యుల జీవితంలో ఆత్మీయులుగా మమేకమవ్వటం అని నిరూపించారు ముగ్గురు స్నేహితులు. అమ్మనాన్నలు ఉన్న పిల్లలకు అందే సంతోషాలు అనాథలకు కూడా అందాలన్న సంకల్పంతో...

Published : 21 Aug 2022 23:22 IST


తానా ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహణ

గుంటూరు: ‘సేవ అంటే అండగా ఉండటం కాదు.. ఆసరాగా నిలవడం కాదు.. అభాగ్యుల జీవితంలో ఆత్మీయులుగా మమేకమవ్వటం’ అని అంటున్నారు ముగ్గురు స్నేహితులు. అమ్మనాన్నలు ఉన్న పిల్లలకు అందే సంతోషాలు అనాథలకు కూడా అందాలన్న సంకల్పంతో 20 మంది చిన్నారులకు పంచె, ఓణీల కార్యక్రమం నిర్వహించారు. ఆ స్నేహితులే శశికాంత్‌ వల్లేపల్లి, రామచౌదరి ఉప్పుటూరి, వెంకట్‌ జల్లెలమూడి. ప్రవాస భారతీయులుగా తానా ఆధ్వర్యంలో గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర, మాజీ జెడ్పీటీసీ ఉప్పుటూరు సీతామహాలక్ష్మి, ఆమె భర్త చిన్న రాములు ఆధ్వర్యంలో ఆదివారం పుల్లడిగుంటలో 20 మంది అనాథలకు (10మంది బాలికలు 10మంది బాలురు )పంచెలు, ఓణీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ చిన్నారులకు పంచెలు, ఓణీలతో పాటు సంప్రదాయబద్ధంగా అందించే బంగారు నగలు, వెండి వస్తువులను అందజేశారు. తమ జీవితంలో ఇంతటి అత్యంత వేడుక జరగటంపై ఆ చిన్నారుల కళ్లు ఆనందంతో చమర్చాయి. అయినవారు లేకపోయినా వారి స్థానంలో కుటుంబ సభ్యులుగా నిలిచి తమని ఆదిరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ, అనాథలకు ఆత్మీయులుగా నిలబడి ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆ ముగ్గురు స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. ఇవ్వటంలో ఉన్న సంతృప్తిని ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని వారు సూచించారు. సేవా కార్యక్రమాలు అంటే నామమాత్రంగా ఉండకూడదని ఆత్మీయులు లేని వారికి కుటుంబ సభ్యులుగా నిలబడాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని