Pawan Kalyan: తీర ప్రాంత డబ్బంతా పెద్దిరెడ్డి కంపెనీలకే

దివీస్‌ను సముద్రంలో కలిపేస్తానన్న ముఖ్యమంత్రి.. దాంతోపాటు ఇప్పుడు అరబిందోను కూడా తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఈ పరిశ్రమలతో మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయన్నారు.

Updated : 20 Jun 2023 08:41 IST

దివీస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారుగా..
ఆ మాట మర్చిపోయిన సీఎం అరబిందోనూ తెచ్చారు
ఆ పరిశ్రమలతో మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, కాకినాడ: దివీస్‌ను సముద్రంలో కలిపేస్తానన్న ముఖ్యమంత్రి.. దాంతోపాటు ఇప్పుడు అరబిందోను కూడా తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఈ పరిశ్రమలతో మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయన్నారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని.. కానీ మీ అభివృద్ధి, వృత్తి దెబ్బతీయకుండా కృషి చేస్తాను, మీరంతా సమష్టిగా ఉండకపోతే రోడ్డున పడిపోతారని మత్స్యకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు మాకు అండగా ఉంటే.. జనసేన మీ కోసం పోరాడుతుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ సోమవారం సాయంత్రం కాకినాడ బోట్‌ జెట్టీ నుంచి మోటారు బోటులో ఉప్పుటేరులో పర్యటించి మత్స్యకార ప్రాంతాలను పరిశీలించారు. ఏటిమొగలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు.  తొండంగి మండలంలో దివీస్‌, అరబిందో పరిశ్రమలు వస్తే మత్స్యకారుల జీవనం అతలాకుతలం అవుతుందన్నారు. ఓఎన్‌జీసీతో సమస్య ఉందని, చమురుతట్టు సముద్రంలోకి వెళ్లడంతో మత్స్యకారులు నష్టపోతున్నారన్నారు. మరి ఇంతమంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, ఇతర సంస్థలతో మాట్లాడతానన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దగ్గర మూడు కంపెనీలు ఉన్నాయని.. ఈ తీరప్రాంతానికి చెందిన డబ్బంతా వాటికే పోతోందని ఆరోపించారు. ఇసుక ఉచితం చేస్తే దానిపై ఆధారపడే బీసీ కులాలతోపాటు.. మత్స్యకారులూ బతుకుతారన్నారు. కష్టపడేవారి దగ్గరే పెట్టుబడి ఉండాలన్నారు. మీరు నన్ను గెలిపిస్తే.. ఆ పెట్టుబడి ఇవ్వగలనని పవన్‌ అన్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ తీర ప్రాంతంలో తాగునీటి సమస్యనూ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ ఎంపీ తోట నర్సింహం కుటుంబసభ్యులు ఎం.ఎస్‌.ఎన్‌.ఛారిటీస్‌కు చెందిన 248 ఎకరాలను గుప్పిట పెట్టుకున్నారని ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మల్లాడి రాజు ఆరోపించారు. ఛారిటీస్‌కు 1,800 ఎకరాల భూమి ఉండేదని.. కబ్జాలతో 1,258 ఎకరాలే మిగిలిందన్నారు.

నేరగాళ్లు రాజ్యమేలితే శాంతిభద్రతలు క్షీణిస్తాయి

‘సాక్షాత్తూ ఎంపీ కుటుంబానికే రాష్ట్రంలో రక్షణ లేదు. తన అక్కను వేధిస్తున్నారని నిలదీస్తే 14 ఏళ్ల బాలుడిని పెట్రోలు పోసి తగలబెట్టేశారు. నేరగాళ్లు రాజ్యమేలితే శాంతిభద్రతలు ఇలాగే క్షీణిస్తాయి’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. కాకినాడలో జనసేన వీర మహిళలతో ఆయన సమావేశమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ రైల్వే వినియోగదారుల సంఘం సభ్యుడు వైడీ రామారావు మాట్లాడుతూ అన్నవరం నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు, కాకినాడ పోర్టు, కోటిపల్లి, నరసాపురం మీదుగా రేపల్లె వరకు రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పవన్‌ స్పందిస్తూ కోస్తా రైలు మార్గం అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్‌, పంతం నానాజీ, బొమ్మిడి నాయకర్‌, నగర అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

* వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన తరుణంలో మంగళవారం నుంచి పవన్‌ కల్యాణ్‌ ఉపవాస దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగిస్తారు.


వైకాపా వల్లే వ్యవస్థ గాడి తప్పుతోంది

‘పాలకులు బాధ్యతగా వ్యవహరించకపోతే.. యంత్రాంగం కూడా సక్రమంగా పనిచేయదు. చిన్న పరిశ్రమ ఏర్పాటుకూ ఏళ్ల తరబడి అనుమతులు రావు. ప్రతికూల పరిస్థితులతో ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ  ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను పూర్తిగా చంపేసింది’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా సోమవారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ప్రముఖులు, మేధావులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిలా నోటికొచ్చిన హామీ ఇచ్చి వదిలేయనని.. జనసేన సుపరిపాలన ప్రతి వర్గానికి జవాబుదారీగా ఉంటుందన్నారు. మన ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి ప్రజల సమస్యలపై ఒక్క మాటా మాట్లాడరని.. టిఫిన్లు తినేసి వచ్చేస్తారని విమర్శించారు. వైకాపా రాజకీయాలు చూసి ఇలాంటి కుళ్లు రాజకీయాలు మాకెందుకని వైద్యులు, న్యాయవాదులు, మేధావులు దూరంగా ఉండిపోతున్నారన్నారు. కాకినాడ వంటి నగరాల్లోనూ ప్రజలు ఓటేయడానికి రాకపోవడానికి కారణం ఇదేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని