Minister Peddireddy: పుంగనూరు పెద్దిరెడ్డి జాగీరా?

పుంగనూరు ఏమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాగీరా? అక్కడ ఎవరూ అడుగుపెట్టకూడదా? వైకాపా మినహా ఇతర ఏ పార్టీ జెండా ఎగరకూడదా? ఏంటీ దాష్టీకం? పుంగనూరు ప్రత్యేక దేశమా? అక్కడకు వెళ్లాలంటే పెద్దిరెడ్డి నుంచి పాస్‌పోర్టు, వీసా తీసుకోవాలా?

Updated : 23 Oct 2023 08:28 IST

తెదేపా జెండా పట్టుకున్నందుకు దాష్టీకమా?
బట్టలు విప్పించి.. బూతులతో విరుచుకుపడతారా?
ఇది ‘గూండా రాజ్‌’ కాకపోతే మరేంటి?

ఈనాడు-చిత్తూరు, అమరావతి: పుంగనూరు ఏమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాగీరా? అక్కడ ఎవరూ అడుగుపెట్టకూడదా? వైకాపా మినహా ఇతర ఏ పార్టీ జెండా ఎగరకూడదా? ఏంటీ దాష్టీకం? పుంగనూరు ప్రత్యేక దేశమా? అక్కడకు వెళ్లాలంటే పెద్దిరెడ్డి నుంచి పాస్‌పోర్టు, వీసా తీసుకోవాలా? తమ అభిమాన నాయకుడైన చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్‌ యాత్ర చేస్తున్న సామాన్య తెదేపా కార్యకర్తలపై పుంగనూరులో వైకాపా కార్యకర్తల దాష్టీకానికి పాల్పడిన ఘటన ఒకప్పటి ఆటవిక రాజ్యాల్లోని పరిస్థితులను తలపించింది. సైకిల్‌ యాత్రికులు ధరించిన పసుపు చొక్కాలను విప్పించి, తెదేపా జెండాలు, పసుపు కండువాలు తీసేయించి.. అసభ్య పదజాలంతో దూషించడం అక్కడ గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న అరాచకానికి ఓ తార్కాణం మాత్రమే. ‘ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం. ఇక్కడ తెదేపా జెండా ఎగరకూడదు. మిమ్మల్ని కొట్టకుండా పంపిస్తున్నాం సంతోషించండి. పుంగనూరులో అడుగు పెట్టి వెనక్కి వెళ్లగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. తెదేపా జెండాలతో ఇక్కడి మీరెలా వస్తారు?’ అంటూ అధికారమదంతో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోవడం బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో ఒకప్పుడు చూసిన ‘‘గూండా రాజ్‌’’ను గుర్తు చేసింది. పుంగనూరులో ప్రతిపక్ష పార్టీలకు, సామన్య పౌరులకు హక్కులు లేవా? ప్రతిపక్ష పార్టీల జెండాలు కనిపించకూడదా? ఇది నియంత పాలన కాకపోతే మరేంటి?

బట్టలు విప్పించి.. బండబూతులతో విరుచుకుపడి

‘రేయ్‌.. తెదేపా జెండాలు పట్టుకుని ఎవడ్రా ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నాడు. ఆ జెండాలు పీకేసి వెంటనే పారిపోండి. లేదంటే ఎస్సై, సీఐ, డీఎస్పీకి ఫోన్‌ చేసి పిలిపించి బొక్కలో వేయిస్తాం.. మీ అమ్మా అబ్బలు జగన్‌ ఇస్తున్న పింఛను, మీ పెళ్లాలు అమ్మఒడి డబ్బులు తీసుకుంటున్నారు కదరా’ అంటూ చెంగలాపురం సూరి, ఇతర వైకాపా కార్యకర్తలు తమను దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన సైకిల్‌ యాత్రికులు మాజీ సర్పంచి రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేష్‌లు వాపోయారు.

పసుపు రంగు దుస్తులు కొనటమే నేరం

‘చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ నెల 2న మా గ్రామం నుంచి కుప్పం సైకిల్‌పై బయల్దేరాం. 20వ తేదీ సాయంత్రం పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీ తాగేందుకు ఆగగా.. చెంగలాపురం సూరి, నీరుగట్టి శివప్ప, వినయ్‌కుమార్‌ మరికొందరు వైకాపా కార్యకర్తలు కార్లలో వచ్చారు. వెంటనే మాపై బండబూతులతో విరుచుకుపడ్డారు. మేము కూర్చొని టీ తాగుతుంటే.. మమ్మల్ని లేచి నిలబడమంటూ హుకుం జారీ చేశారు. సైకిళ్లపై ఉన్న తెదేపా జెండాలు తీసేయాలన్నారు. మా శరీరంపై పసుపు దుస్తులే ఉండకూడదని బెదిరించారు. మా దగ్గర పసుపు చొక్కాలే ఉన్నాయి. వేరేవి లేవని చెప్పగా.. ‘పసుపు రంగు దుస్తులు కొనడమే మీరు చేసిన అతి పెద్ద నేరం’ అంటూ దుర్భాషలాడారు. మమ్మల్ని వరుసగా నిలబెట్టి జెండాలు, కర్రలు తీసేంతవరకూ ముందుకు కదలనీయలేదు. జెండా కర్రలు విరిచేశారు. పసుపు చొక్కాలు తీస్తారా? తన్నమంటారా అంటూ రెచ్చిపోయారు. మేము వేసుకున్న పసుపు టీ షర్టులు విప్పించి.. వేరే రంగు షర్టులు వేసుకునే వరకూ మమ్మల్ని బూతులు తిడుతూనే ఉన్నారు. దాదాపు గంట పాటు హింసించారు. జెండాలు తీసేసిన తర్వాత కూడా మాపై భౌతికదాడికి యత్నించారు. చివరికి స్థానికంగా ఉన్న గ్రామస్థులు జోక్యం చేసుకుని జెండాలు తీసేశారు కదా.. వారిని పంపించేయండని చెప్పడంతో విడిచిపెట్టారు. మా పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తించారు.  తెదేపా అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు కుప్పం వెళ్తున్నామని చెప్పగా.. ‘వాడికెందుకురా సంఘీభావం’’ అంటూ బండబూతులు మాట్లాడారు. తెదేపా జెండాలను వైకాపా కార్యకర్తలు కాళ్లతో తొక్కిన తర్వాతే మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు’ అని రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేష్‌లు చెప్పారు.

పెద్దాయన.. నోరు విప్పరేం?

జగన్‌ మంత్రివర్గంలో అత్యంత సీనియర్‌ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ ప్రాంతంలోని వైకాపా నాయకులు ‘‘పెద్దాయన’’ అని పిలుస్తారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఆయన అనుచరుడు, వైకాపా నాయకుడు చెంగలాపురం సూరి అలియాస్‌ సురతోటి సురేష్‌ సైకిల్‌ యాత్రికులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన జరిగి మూడు రోజులవుతోంది. అయినా సరే ఇప్పటివరకూ ఈ అరాచకాన్ని ఆ పెద్దాయన ఖండించలేదు.

బెయిలబుల్‌ సెక్షన్లతో సరిపెడతారా..?

పుంగనూరులో వైకాపా అరాచకంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు రావటంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేసినప్పటికీ బెయిల్‌కు వీలైన సెక్షన్ల మాత్రమే పెట్టి మమ అనిపించేశారు. దీంతో వారు గంటల వ్యవధిలోనే బయటకు వచ్చేశారు. ప్రతిపక్ష కార్యాకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపినా హత్యాయత్నం తదితర తీవ్రమైన సెక్షన్లకింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఈ వ్యవహరంలో తేలికపాటి సెక్షన్లతో కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. కేసును నీరుగార్చేందుకే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. పెద్దిరెడ్డి అండదండలతోనే  చెంగలాపురం సూరి రెచ్చిపోయారని,  అధికార పార్టీ నాయకుడు కావడం వల్లే పోలీసులు మొక్కుబడి సెక్షన్లతో సరిపెట్టేశారన్న విమర్శలున్నాయి.


అలా అరెస్టు.. ఇలా బెయిలు.!

శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పానికి సైకిల్‌ యాత్రగా వస్తున్న తెదేపా కార్యకర్తలను  పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద దూషించి, దుస్తులు విప్పించిన ఘటనలో నమోదైన కేసులో నిందితులైన వైకాపా కార్యకర్తలు చెంగలాపురం సూరి, శివప్పకు పలమనేరు కోర్టు ఆదివారం రాత్రి బెయిల్‌ మంజూరు చేసింది. 15 రోజుల్లోగా ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని