అధికార పార్టీకి రూ.వందల కోట్ల అనుచిత లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖలో కీలక స్థానంలో ఉన్న కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, మరో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అధికార వైకాపాకు అనుచిత లబ్ధి కలిగిస్తున్నారు.

Updated : 21 Mar 2024 06:23 IST

వైకాపా అనుయాయులకే బిల్లుల చెల్లింపులు
ఎన్నికల కోడ్‌ వచ్చినా అదే పరిస్థితి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖలో కీలక స్థానంలో ఉన్న కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, మరో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అధికార వైకాపాకు అనుచిత లబ్ధి కలిగిస్తున్నారు. ఈ ఎన్నికల వేళ ఆర్థికశాఖలో రూ.వేల కోట్లు అధికారపార్టీ అనుయాయులకే చెల్లింపులు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌ (ఫిఫో) విధానం అనుసరించడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ వచ్చినా ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు ప్రస్తుత నెలలో మార్చి 6 నుంచి 15 వరకు రూ. 6,500 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఎన్నికల కోడ్‌ వచ్చాక రూ.500 కోట్లు చెల్లించారు. ఇవన్నీ అధికార పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా సాగిన చెల్లింపులే. ఆర్థికశాఖలో ఈ ఉన్నతాధికారిని, ఆపైన ఉన్న మరో ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను మార్చకపోతే పోలింగు లోపు వైకాపాకు రూ.వేలకోట్ల అనుచిత లబ్ధి కలిగించేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. ఆ సొమ్ములన్నీ తిరిగి ఎన్నికల అవసరాలకే ఉపయోగపడతాయి. ఎప్పటినుంచో వైకాపా పెద్దలతో అంటకాగుతున్న సీఎంఓలోని ఉన్నతాధికారి, సచివాలయంలో ఒక అత్యున్నతస్థాయి అధికారులను ఆ స్థానాల నుంచి మారిస్తేనే ఈ అక్రమాలకు తెరపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖలో బడ్జెట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఫైనాన్స్‌ కార్యదర్శి పోస్టు ఎంతో కీలకం. ఆ స్థానంలో ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి హోదాలో కె.వి.వి.సత్యనారాయణ ఉన్నారు. ఫిఫో విధానానికి తిలోదకాలిచ్చి 5 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా బిల్లుల చెల్లింపు సాగిపోయింది. ఇందులో ఆర్థికశాఖలో బిల్లుల చెల్లింపు వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కె.వి.వి.సత్యనారాయణ కీలకం. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ వచ్చినా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా రూ.వేల కోట్ల చెల్లింపులు జరిగిపోతున్నాయి.

కొత్త అప్పులు అనుయాయులకు కట్టబెట్టే యోచన?

ఏప్రిల్‌లో కొత్త ఆర్థిక సంవత్సరం వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల అప్పులు తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇస్తుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5% మేర నికర రుణపరిమితిగా లెక్కించి కొన్నింటిని మినహాయించి, మరికొన్నింటిని జత చేసి ఈ రుణపరిమితి ఎంతో కేంద్ర ఆర్థికశాఖ తేలుస్తుంది. తొలి 9 నెలలకు రూ.55 వేల కోట్ల వరకు రుణపరిమితి వచ్చే ఆస్కారం ఉంది. అంటే నెలకు సగటున రూ.5,500 కోట్లు మాత్రమే రుణం తీసుకోవాలి. కానీ మే 13 వరకు దాదాపు రూ.20వేల కోట్లకు పైగా కొత్త అప్పులు పుట్టించి అధికారపార్టీ అనుయాయులకే చెల్లింపులు చేసే వ్యూహాలు సాగుతున్నాయని సమాచారం. అవన్నీ వైకాపాకు ఈ ఎన్నికల్లో ఉపయోగపడబోతున్నాయి. ఆర్థిక శాఖలో, ఆపైన అత్యంత ఉన్నత స్థానంలో వైకాపా పెద్దలకు ఎప్పటి నుంచో అండగా ఉంటున్న అధికారులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల కోడ్‌ వచ్చినా వారే ఆ పోస్టులో ఉన్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ బిల్లుల చెల్లింపు రూపంలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇద్దరు ఉన్నతాధికారులనూ మారిస్తే తప్ప ఈ వ్యవహారానికి చెక్‌ పెట్టడం సాధ్యం కాదనే చర్చ ఆర్థికశాఖలో అంతర్గతంగా సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు