వైరస్‌ పెరుగుతోంటే స్టేడియాల్లోకి ఫ్యాన్స్‌

ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడలను నిర్వహించడమే కత్తిమీద సాము. ఇక బయో బుడగను సృష్టించడం అంతకు మించి కష్టం. అలాంటి ఓ పక్కన వైరస్‌ కేసులు పెరుగుతోంటే స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తామని షాకిచ్చారు ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు. అంతేకాకుండా అంతర్జాతీయ సర్క్యూట్‌..

Published : 09 Sep 2020 01:11 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులపై విమర్శలు

ప్యారిస్‌: ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడలను నిర్వహించడమే కత్తిమీద సాము. ఇక బయో బుడగను సృష్టించడం అంతకు మించి కష్టం. అలాంటి ఓ పక్కన వైరస్‌ కేసులు పెరుగుతోంటే స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తామని షాకిచ్చారు ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు. అంతేకాకుండా అంతర్జాతీయ సర్క్యూట్‌ ఆరంభమయ్యాక అభిమానులను అనుమతించిన మొదటి టోర్నీ తమదేనని గొప్పగా చెబుతున్నారు. క్రీడాకారులు సహా అనేక మంది ఈ నిర్ణయాన్ని విమర్శిస్తుండటం గమనార్హం.

కరోనా వైరస్‌ కారణంగానే మే నెల్లో జరగాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడటంతో సెప్టెంబర్‌ 27 నుంచి టోర్నీ ఆరంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే అభిమానులను అనుమతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రఫెల్‌ నాదల్‌, రోజర్‌ ఫెదరర్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు గ్రాండ్‌స్లామ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్నారు. యూఎస్‌ ఓపెన్లో చాలామంది ఆడలేదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆష్‌ బార్టీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడనని ప్రకటించేసింది.

‘యూఎస్‌ ఓపెన్‌ ముగిసిన కొన్నాళ్లకే ఎర్రమట్టి కోర్టుల్లో సమరాలు మొదలవ్వనున్నాయి. అంతర్జాతీయ సర్క్యూట్‌ ఆరంభమైన తర్వాత అభిమానులను అనుమతించిన తొలి టోర్నీ రొలాండ్‌ గ్యారోస్‌ మాత్రమే’ అని ఫ్రెంచ్‌ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్‌ గిడిసెల్లి సోమవారం ప్రకటించారు. అయితే సమాఖ్య నిర్ణయంలో అర్థం లేదని గ్రీక్‌ టెన్నిక్‌ క్రీడాకారిణి మరియా సక్కారి విమర్శించింది. అభిమానులతో బయో బుడగ ఎలా సృష్టిస్తారని ప్రశ్నించింది.

స్టేడియం సామర్థ్యంలో 50-60 శాతం మందిని అనుమతించాలని నిర్వాహకులు తొలుత భావించారు. అంటే రోజుకు దాదాపుగా 20 వేల మంది అన్నమాట. అయితే ఫ్రాన్స్‌ ప్రభుత్వం కేవలం 5000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో ప్రణాళికల్లో మార్పు చేశారు. మొత్తం మూడు జోన్లుగా విభజించారు. ప్రధాన కోర్టులున్న ఫిలిఫ్‌ ఛాట్‌రూయిర్‌, సుజన్‌ లెగ్లెన్‌ ప్రాంగణాల్లో 5000 చొప్పున అనుమతిస్తారు. ఆ తర్వాత పెద్దదైన మూడో కోర్టులో 1500 మందికే ప్రవేశం కల్పిస్తున్నారు. అభిమానులకు కచ్చితంగా మాస్క్ ధరించాలని, వైరస్‌ టెస్టులు చేయించుకోవాలని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని