IPL 2024: సీఎస్‌కే వైపు రోహిత్ పయనం? చూడాలని ఉందన్న మాజీ క్రికెటర్

ఐపీఎల్‌ సందడి (IPL 2024) మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. కానీ, రోహిత్ శర్మ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ముంబయికే ప్రాతినిధ్యం వహిస్తాడా? మరో జట్టుకు వెళ్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

Published : 11 Mar 2024 15:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma) సారథ్య బాధ్యతల నుంచి ముంబయి ఇండియన్స్‌ తప్పించిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన అతడిని కాదని.. హార్దిక్‌ పాండ్యను నాయకుడిగా నియమించింది. మరో పది రోజుల్లోనే ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌ ప్రారంభం కానుంది. హార్దిక్‌ నాయకత్వంలో రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.  హిట్‌మ్యాన్ ఇతర జట్టులోకి వెళ్తాడని కొందరు చెబుతున్నారు. తాజాగా రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) టీమ్‌లోకి వెళ్తాడనే వార్తలు వస్తున్నాయి. వీటిపై సీఎస్‌కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) స్పందించాడు. 

‘‘చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తరఫున రోహిత్ ఆడటం చూడాలని ఉంది. ఇప్పటికే ముంబయి తరఫున చాలా కాలంపాటు ఆడాడు. ఇప్పుడు సీఎస్‌కేకు ఆడి విజయాల్లో పాలుపంచుకుంటే బాగుంటుంది. కెప్టెన్సీ కూడా దక్కే అవకాశం లేకపోలేదు. రోహిత్‌కు సరైన పిలుపు వస్తుందని భావిస్తున్నా. అయితే, అతడు తీసుకుంటాడో.. లేదో వేచి చూడాలి’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. రోహిత్ సీఎస్‌కేకు ఆడతాడని గతంలోనే అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

రోహిత్‌ వస్తాడా?

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మూడో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి దిగలేదు. వెన్ను నొప్పి కారణంగా డగౌట్‌కే పరిమితమయ్యాడు. విజయం సాధించిన అనంతరం ట్రోఫీ అందుకొన్నాడు. యువ ప్లేయర్లతో ఫొటోలు తీసుకున్నాడు. అయితే, అతడి గాయం పరిస్థితిపై ఇంతవరకు అప్‌డేట్‌ లేదు. ఒకవేళ ముంబయి కెప్టెన్సీ మార్పుతో రోహిత్ ఈ సీజన్‌లో ఆడకుండా ఉండిపోతాడా? అనే ప్రశ్న తలెత్తడం సహజమే. ఈ మెగా లీగ్‌ ముగిసిన తర్వాత.. టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ కోసం అమెరికా-విండీస్‌ వెళ్లనుంది. పొట్టి కప్‌లో భారత్‌ను రోహితే నడిపిస్తాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో గాయం విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోకుండా ఉండాలంటే.. ఐపీఎల్‌ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండి.. పూర్తి ఫిట్‌నెస్ సాధించాక బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని