IRE vs IND: తొలి పేసర్‌గా అర్ష్‌దీప్‌.. ధోనీ నుంచే ‘కెప్టెన్సీ’ సలహాలు.. ఆరో స్థానంలో రింకు పర్‌ఫెక్ట్‌!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో (IRE vs IND) భారత యువ ఆటగాళ్లు అదరగొట్టేస్తున్నారు. ఈ క్రమంలో అర్ష్‌దీప్‌ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్, రింకు సింగ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

Published : 21 Aug 2023 12:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో (IRE vs IND) భారత్ యువ పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో కెప్టెన్ బుమ్రా (Bumrah) రికార్డును అధిగమించడం విశేషం. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ను మాత్రమే తీసిన అర్ష్‌దీప్‌ టీ20ల్లో 50 వికెట్లు పడగొట్టిన జాబితాలో చేరాడు. అయితే, అతి తక్కువ మ్యాచుల్లో ఈ మార్క్‌ను తాకిన భారత పేసర్‌గా అవతరించాడు. అర్ష్‌దీప్‌ 33 మ్యాచుల్లో 50 వికెట్లు తీశాడు. అంతకుముందు బుమ్రా ఈ మైలురాయిని చేరుకొనేందుకు 41 మ్యాచ్‌లను తీసుకున్నాడు. అయితే, ఓవరాల్‌గా భారత రెండో బౌలర్‌గా అర్ష్‌దీప్ కొనసాగుతున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్ కేవలం 30 మ్యాచుల్లోనే 50 వికెట్లు తీశాడు. 


కెప్టెన్సీ చేపట్టడంపై రుతురాజ్‌

ఆసియా గేమ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రను నడిపించిన రుతురాజ్‌ తొలిసారి భారత జట్టుకు కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అయితే మాజీ సారథి ఎంఎస్ ధోనీ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నట్లు గైక్వాడ్ తెలిపాడు. నాయకత్వం గురించి ధోనీ కీలక సూచనలు చేసినట్లు వెల్లడించాడు. 

రుతురాజ్‌ క్లాస్.. రింకు సింగ్‌ ఊరమాస్‌.. వీడియోలు అదుర్స్‌

‘‘కెప్టెన్సీ బాధ్యతలు చాలా క్లిష్టంగా ఉంటాయి. మాహీ భాయ్‌ ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటాడు. ఎప్పుడైనా సరే ఒక్కసారి ఒకే మ్యాచ్‌ గురించి ఆలోచించాలని సూచించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చాలా ముఖ్యం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కంగారు పడకూడదు. ప్రతి ఒక్కరూ అంచనాలను పెంచేస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోకూడదు. అందుకే, నేను ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో కాను. నా గురించి ఏం మాట్లాడుకున్నా వినను. ఇదే సీఎస్‌కే నుంచి నేర్చుకున్న కీలక విషయం. మైదానంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఒక్కసారి ఇంటికి వచ్చేస్తే స్నేహితులతో కలిసి సేదతీరుతా. నా దృష్టిలో నాయకత్వమంటే మిగతా పది మందిలో ఆత్మవిశ్వాసం నింపి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే’’ అని గైక్వాడ్ తెలిపాడు.


రింకు సుదీర్ఘకాలం ఆడతాడు: కిరణ్‌ మోరె

భారత యువ బ్యాటర్ రింకు సింగ్ ఐర్లాండ్‌పై వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. తాను బ్యాటింగ్‌ చేసిన తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రింకుపై భారత మాజీ క్రికెటర్ కిరణ్‌ మోరె ప్రశంసలు కురిపించాడు. ‘‘టీమ్‌ఇండియా తరఫున సుదీర్ఘకాలం ఆడే ఆటగాళ్లలో రింకు సింగ్‌ తప్పక ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆరో స్థానంలో ఆడేందుకు సరిగ్గా సరిపోతాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన రింకు సింగ్‌ను జట్టులోకి తీసుకోవడం మేనేజ్‌మెంట్ మంచి నిర్ణయం’’ అని మోరె వ్యాఖ్యానించాడు.


పాండ్య ఫామ్‌ ఆందోళనకరం: సంజయ్ మంజ్రేకర్

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో గొప్ప ప్రదర్శన ఇవ్వడంలో భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ విఫలమయ్యాడు. జట్టును నడిపించడంలోనూ విమర్శలు ఎదుర్కొన్నాడు. మెగా టోర్నీల్లో యువరాజ్‌ సింగ్, సురేశ్‌ రైనా లోటును తీరుస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే, హార్దిక్‌ ఫామ్‌లేమి ఆందోళనకరంగా మారిందని మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ‘‘వరల్డ్‌ కప్‌లో హార్దిక్‌పై చాలా బాధ్యతలు ఉన్నాయి. కేవలం బ్యాటర్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషించాలి. కానీ, హార్దిక్‌ ఫామ్‌ కాస్త కలవరానికి గురి చేస్తోంది. కనీసం ఆరేడు ఓవర్లు బౌలింగ్‌ చేయాలి. భారత్ 2011 వరల్డ్‌ కప్‌లో విజయం సాధించడానికి ప్రధాన కారకుల్లో యువీ, సురేశ్‌ రైనా ఉంటారు. వారు బ్యాటింగ్‌లో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచారు’’ అని మంజ్రేకర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని