Virat Kohli: డీప్‌ఫేక్‌ బారిన విరాట్‌ కోహ్లీ.. వైరల్‌ అవుతున్న వీడియో

Virat Kohli: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ డీప్‌ఫేక్‌ బారిన పడ్డాడు. ఓ బెట్టింగ్‌ యాప్‌ను అతడు ప్రచారం చేస్తున్నట్లు నెట్టింట ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

Updated : 20 Feb 2024 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డీప్‌ఫేక్‌ (Deepfake) ఫొటోలు, వీడియోల కట్టడికి ఓ వైపు కేంద్రం, మరోవైపు సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు చేపడుతున్నా.. నకిలీల బెడద తప్పట్లేదు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ సారథి, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)కి సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ బెట్టింగ్‌ యాప్‌ను అతడు ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉండటం గమనార్హం.

ప్రముఖ టీవీ ఛానల్‌ లైవ్‌ న్యూస్‌ కార్యక్రమంలో కోహ్లీ యాడ్‌ను ప్రసారం చేసినట్లు సైబర్‌ కేటుగాళ్లు ఈ వీడియోను సృష్టించారు. గతంలో కోహ్లీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మార్ఫింగ్‌ చేసి.. బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు రూపొందించారు. తక్కువ పెట్టుబడితో సులువుగా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించవచ్చో క్రికెటర్‌ చెబుతున్నట్లుగా అందులో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుండగా.. అది నకిలీదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై కోహ్లీ ఇంకా స్పందించలేదు.

వాట్సప్‌ చెయ్‌.. డీప్‌ఫేక్‌ను పట్టెయ్‌!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూడా ఓ గేమింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు నకిలీ వీడియో వైరల్‌ అవగా, దాన్ని ఆయన ఖండించారు.  వీడియోలో ఉన్నది తాను కాదంటూ స్పష్టతనిచ్చారు. ‘‘టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయండి. సామాజిక మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరం’’ అని సచిన్‌ పోస్ట్‌ చేశారు.

అంతకుముందు సచిన్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ డీప్‌ఫేక్‌ ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇక సినీ తారలు రష్మిక, కత్రినాకైఫ్‌ మార్ఫింగ్‌ వీడియోలు కలకలం సృష్టించాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అవసరమైతే ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు