CSK vs GT: ఫైనల్‌ చేరేదెవరో?

మార్చి 31న గుజరాత్‌, చెన్నై మ్యాచ్‌తో ఐపీఎల్‌- 16 ఆరంభమైంది. ఇప్పుడు మే 23న అదే జట్ల మధ్య పోరుతో ప్లేఆఫ్స్‌కు తెరలేవనుంది.

Updated : 23 May 2023 07:10 IST

నేడే తొలి క్వాలిఫయర్‌
గుజరాత్‌తో చెన్నై ఢీ
ఓడిన జట్టుకు మరో ఛాన్స్‌  
రాత్రి 7.30 నుంచి వేదిక చెన్నై

రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్‌-16లో మరింత వినోదాన్ని అందించే ప్లేఆఫ్స్‌కు సమయం ఆసన్నమైంది. మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీకొంటుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోన్న టైటాన్స్‌ రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్‌లో చెన్నైపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోను ఆ జట్టు నెగ్గడం విశేషం. మరోవైపు.. సొంతగడ్డపై ధోనీకి ఇదే చివరి మ్యాచ్‌ అని భావిస్తుండడంతో భావోద్వేగ వాతావరణంలో చెన్నై బరిలోకి దిగుతోంది. అతని కోసం టైటిల్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉంది సూపర్‌కింగ్స్‌. టైటాన్స్‌ లాగే చెన్నై కూడా బలంగానే ఉంది. మరి సమవుజ్జీల పోరులో గెలిచి ఫైనల్‌ చేరేదెవరో? ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్‌ రూపంలో మరో అవకాశముంది.


చెన్నై

మార్చి 31న గుజరాత్‌, చెన్నై మ్యాచ్‌తో ఐపీఎల్‌- 16 ఆరంభమైంది. ఇప్పుడు మే 23న అదే జట్ల మధ్య పోరుతో ప్లేఆఫ్స్‌కు తెరలేవనుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మంగళవారం తొలి క్వాలిఫయర్‌ పోరాటం హోరాహోరీగా సాగడం ఖాయమని భావిస్తున్నారు. గెలిచిన జట్టు ఫైనల్‌ చేరుతుంది కాబట్టి రెండు జట్లు గట్టిగా పోరాడతాయనడంలో సందేహం లేదు. ఫామ్‌, గణాంకాల పరంగా చూసుకుంటే చెన్నైపై గుజరాత్‌దే కాస్త పైచేయి. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో చెన్నైతో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టైటాన్స్‌ గెలిచింది. నిరుడు రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఆ జట్టు.. ఈ సారి లీగ్‌ మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. అయితే సొంతగడ్డ చెపాక్‌లో ఆడుతున్న సీఎస్కేను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం.


ప్లేఆఫ్స్‌ చేరాయిలా..

అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌. లీగ్‌ దశలో నిలకడ కొనసాగించి 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించగా.. ఓ మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఆ జట్టు 17 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తన చివరి మ్యాచ్‌లో దిల్లీని ఓడించి చెన్నై ప్లేఆఫ్స్‌ చేరింది. లఖ్‌నవూ కూడా 17 పాయింట్లతోనే నిలిచినప్పటికీ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా చెన్నై రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.


పటిష్టంగా టైటాన్స్‌

నిరుడు ఐపీఎల్‌లో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ ఈసారీ అదే జోరు కొనసాగిస్తోంది. బలమైన జట్టుతో, తిరుగులేని ప్రదర్శనతో మైదానంలో టైటాన్స్‌ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారింది. బ్యాటింగ్‌ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకూ హిట్టింగ్‌ చేసే ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ ఆ జట్టుకు పెద్ద బలం. అతడు వరుసగా రెండు సెంచరీలు బాదేశాడు. 14 మ్యాచ్‌ల్లో 680 పరుగులు సాధించాడు. గిల్‌ క్రీజులో నిలబడితే బౌలర్లకు చుక్కలే. విజయ్‌ శంకర్‌ కూడా జోరుమీదున్నాడు. సాహా, హార్దిక్‌, మిల్లర్‌, తెవాతియా.. ఇలా అందరూ కీలక ఆటగాళ్లే. బౌలింగ్‌లోనూ ఆ జట్టుకు తిరుగులేదు. పేస్‌తో చెలరేగుతున్న షమి, స్పిన్‌తో చుట్టేస్తున్న రషీద్‌ ఖాన్‌.. చెరో 24 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వెటరన్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ కూడా వైవిధ్యమైన బౌలింగ్‌తో చివరి ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో అఫ్గాన్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ కూడా ఆకట్టుకుంటున్నాడు.


తిరుగులేని కింగ్స్‌

12వ సారి ప్లేఆఫ్స్‌కు చేరి పదో ఫైనల్‌పై గురిపెట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఓపెనర్లు రుతురాజ్‌, కాన్వే కీలకం. మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ మరోసారి శుభారంభాన్నివ్వాలని చెన్నై కోరుకుంటోంది. 14 మ్యాచ్‌ల్లో కాన్వే 585 పరుగులు చేయగా.. రుతురాజ్‌ 504 పరుగులు సాధించాడు. రహానె, శివమ్‌ దూబె ఆ జట్టు బ్యాటింగ్‌్ ఆర్డర్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. జడేజా ఆల్‌రౌండర్‌ పాత్రకు తగిన న్యాయం చేస్తూనే ఉన్నాడు. మరోవైపు ధోని అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్‌ ఝుళిపిస్తున్నాడు. తుషార్‌ దేశ్‌పాండే, పతిరన లాంటి యువ పేసర్లతో సీఎస్కే బౌలింగ్‌లో ఉత్తమ ప్రదర్శన చేస్తోంది. తుషార్‌ 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీశాడు. 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టిన పతిరన చివరి ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. దీపక్‌ చాహర్‌, మొయిన్‌ అలీ, తీక్షణ కూడా రాణిస్తున్నారు. ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అనే ఊహాగానాల మధ్య ధోనీని కనీసం మరో రెండు మ్యాచ్‌ల్లో చూసే అవకాశం అభిమానులకు దక్కింది.


చెపాక్‌ పిచ్‌

ఈ సీజన్‌లో చెపాక్‌ పిచ్‌పై చెన్నై ఓ స్పష్టమైన అంచనాకు రాలేకపోతోంది. కొన్ని మ్యాచ్‌ల్లో నెమ్మదిగా స్పందించిన పిచ్‌.. మరికొన్ని మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఈ సారి చెన్నైలో 4 మ్యాచ్‌లు గెలిచిన సీఎస్కే.. 3 మ్యాచ్‌లు ఓడింది. మరోవైపు చెపాక్‌లో గుజరాత్‌కు ఇదే తొలి మ్యాచ్‌. మందకొడిగా ఉండే అవకాశమున్న పిచ్‌ బ్యాటర్లకు సవాలు విసురుతుందని భావిస్తున్నారు. స్పిన్నర్లు సత్తాచాటే ఆస్కారముంది.


3
ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్‌ గెలిచింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని