Sakshi Malik: రెజ్లింగ్‌ను మళ్లీ కొనసాగించలేను : సాక్షి మాలిక్‌

రెజ్లింగ్‌ పోటీల్లో మళ్లీ పాల్గొనే అవకాశం లేదని ఒలింపిక్స్‌ కాంస్య విజేత సాక్షి మాలిక్‌ (Sakshi Malik) పేర్కొన్నారు.

Published : 04 Mar 2024 20:43 IST

దిల్లీ: రెజ్లింగ్‌ పోటీల్లో మళ్లీ పాల్గొనే అంశంపై వస్తోన్న వార్తలను ఒలింపిక్స్‌ కాంస్య విజేత సాక్షి మాలిక్‌ (Sakshi Malik) తోసిపుచ్చారు. రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా చేస్తోన్న నిరసనలు మానసిక వేదనకు గురిచేశాయన్నారు. గతేడాది డిసెంబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమె.. మళ్లీ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదన్నారు.

‘ఏడాదికి పైగా గడిచింది. మానసికంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. మా పోరాటం విజయవంతమయ్యేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నాం. అందుకే రెజ్లింగ్‌ను మళ్లీ కొనసాగించలేను. నేను దేశం కోసం కాంస్యం సాధించాను. కానీ, జూనియర్లు స్వర్ణం, రజత పతకాలు సాధించాలని కోరుకుంటున్నా. దేశంలోని ప్రతీ అమ్మాయి తన కలను సాకారం చేసుకోవడాన్ని చూడటం నాకెంతో ఇష్టం’ అని మీటూ (#MeeToo) ఉద్యమ ప్రభావంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో సాక్షి మాలిక్‌ పేర్కొన్నారు. కుస్తీ పోటీల్లో కొనసాగాలని ఎంతోమంది విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. బ్రిజ్‌ భూషణ్‌ వంటి వాళ్ల నడుమ రెజ్లింగ్‌ను కొనసాగించలేనని చెప్పారు.

పద్మశ్రీ వెనక్కి.. ఆటకు వీడ్కోలు.. అసలు రెజ్లింగ్‌లో ఏం జరుగుతోంది?

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌ను తొలగించడంతోపాటు ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ సాక్షి మాలిక్‌తో సహా బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌లు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌ భూషణ్‌ను తొలగించడం.. కొత్త అధ్యక్షుడిగా సంజయ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. దీన్ని నిరసిస్తూ గతేడాది డిసెంబర్‌లో సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని