Ravi Shastri: ఆటగాళ్లు మానసికంగా.. శారీరకంగా అలిసిపోయారు: రవిశాస్త్రి

టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు నిరాశపర్చింది. టోర్నీలో సెమీస్‌కి కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదురు కాగా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. అయినా.. సెమీస్‌కు చేరుకోలేకపోయింది. తాజాగా

Published : 09 Nov 2021 01:30 IST

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు నిరాశపర్చింది. టోర్నీలో సెమీస్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదురు కాగా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. అయినా.. సెమీస్‌కు చేరుకోలేకపోయింది. తాజాగా నమీబియాతో భారత జట్టు చివరి నామమాత్రపు మ్యాచ్‌ ఆడుతోంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు భారత జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి.. టోర్నీలో టీమిండియా సెమీస్‌కు చేరుకోకపోవడానికి కారణాలను తాజాగా వెల్లడించారు. బయోబబుల్‌లో ఉండటం.. ఐపీఎల్‌ ఆడిన వెంటనే ఈ మెగా టోర్నీలోకి దిగడంతో భారత క్రికెటర్లు అలసిపోయారని, అందువల్లనే మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై లీగ్‌ దశలోనే వెనుదిరగాల్సి వచ్చిందని తెలిపారు. 

‘‘భారత జట్టు గత ఆరు నెలలుగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బయో బబుల్‌లో ఉంటోంది. నేను మానసికంగా మాత్రమే అలసిపోయా. ఆటగాళ్లు మానసికంగా.. శారీరకంగా కూడా అలిసిపోయారు. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ టోర్నీల మధ్య ఇంకాస్త ఎక్కువ వ్యవధి ఉంటే బాగుండేది. మా వైఫల్యానికి దీన్ని కారణంగా చూపట్లేదు.. ఓటమికి భయపడట్లేదు. గెలవాలని చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఓటములు ఎదురవుతాయి. నేను ఈ పదవి (ప్రధాన కోచ్‌) చేపట్టినప్పుడు టీమిండియాలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నా. కచ్చితంగా మార్పులు తీసుకొచ్చాననే భావిస్తున్నా. గత ఐదేళ్లలో భారత ఆటగాళ్లు అన్ని దేశాల్లో.. అన్ని రకాల ఫార్మాట్లలో రాణించిన తీరు చూస్తే.. క్రికెట్‌ చరిత్రలో ఇది ఒక గొప్ప జట్టుగా నిలుస్తుంది’’ అని రవిశాస్త్రి అన్నారు. ఈ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే రవిశాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి నుంచి దిగిపోనున్నారు. ఆయన స్థానంలో బీసీసీఐ రాహుల్‌ ద్రవిడ్‌ను ఎంపిక చేసింది. టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు