Ruturaj Gaikwad: ధోనీ నుంచి నేర్చుకున్నా.. కెప్టెన్సీలో నా స్టైల్‌ నాదే: రుతురాజ్‌ గైక్వాడ్‌

ఆసియా క్రీడల్లో (Asian Games) రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) నేతృత్వంలోని యువ టీమ్‌ఇండియా.. మంగళవారం నేపాల్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ ఆడనుంది. ఈ సందర్భంగా కెప్టెన్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. కెప్టెన్సీలో తనకు సొంత స్టైల్‌ ఉందని అన్నాడు.

Published : 02 Oct 2023 16:57 IST

హాంగ్‌జౌ: టీమ్‌ఇండియా (Team India) మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) నుంచి తాను ఎంతగానో నేర్చుకున్నానని, అయినప్పటికీ కెప్టెన్సీలో తన స్టైల్‌ తనదేనని అంటున్నాడు యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad). చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత జట్టుకు గైక్వాడ్‌ సారథ్యం వహిస్తున్నాడు. అతడి నేతృత్వంలోని యువ భారత్‌.. మంగళవారం (అక్టోబరు 3) నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఆడనుంది. ఈ సందర్భంగా తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ గైక్వాడ్‌ మీడియాతో మాట్లాడాడు.

‘‘ధోనీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. కానీ ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఓ స్టైల్‌ ఉంటుంది. ఆయన (ధోనిని ఉద్దేశిస్తూ) స్టైల్‌, ఆయన వ్యక్తిత్వం విభిన్నం. నా వ్యక్తిత్వం వేరే. అందుకే, ధోనీలా కన్పించకుండా నాకు నేనుగా ఉండేందుకు ప్రయత్నిస్తా. కానీ, కొన్ని విషయాలను ఆయన నుంచి తీసుకోవాల్సిందే. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి..? మ్యాచ్‌ సమయంలో కొందరు ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి?వంటివి ఆయన నుంచి నేర్చుకోవాలి. అయితే, నా స్టైల్‌లోనే కెప్టెన్సీని నిర్వర్తించాలని కోరుకుంటున్నా. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేలా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తాను’’ అని గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) చెప్పాడు. ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టులో గైక్వాడ్‌ కీలక ఆటగాడిగా ఎదిగాడు. అనంతరం టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకుని.. ఇప్పుడు ఆసియా క్రీడల్లో జట్టు నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు.

ప్రపంచకప్‌లో గిల్‌ పేరిట కనీసం రెండు శతకాలు..: ఆకాశ్‌ చోప్రా

ఇక, ఈ టోర్నీలో భారత మహిళా క్రికెటర్ల జట్టు స్వర్ణం సాధించడంపై గైక్వాడ్‌ స్పందిస్తూ.. ‘‘వారిలాగే మేం కూడా పసిడి నెగ్గి పోడియంపై సగర్వంగా నిలబడాలనుకుంటున్నాం’’ అని అన్నాడు. ఈ సందర్భంగా భారత జట్టు కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా భిన్నమైన అనుభవం. చైనా వచ్చి క్రికెట్‌ ఆడుతామని ఎన్నడూ ఊహించలేదు. ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తప్పకుండా విజేతగా నిలుస్తామని ఆశిస్తున్నా’’ అని తెలిపాడు.

ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో భారత మహిళా జట్టు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక, గైక్వాడ్‌ సారథ్యంలోని యువ జట్టు.. రేపు నేపాల్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ ఆడనుంది. ఈ టోర్నీలో నేపాల్‌.. ఇటీవల గ్రూప్‌ దశలో అనూహ్య ప్రదర్శనతో మాల్దీవులపై అద్భుతమైన విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని