IPL 2024: అలాంటి వాగ్వాదం సరైంది కాదు.. క్రికెట్ విషయంలో వారిద్దరూ ఒకటే: నవీనుల్ హక్‌

మైదానంలో ఆటగాళ్లు ఒకరినొకరు మాటామాటా అనుకోవడం సహజమే. కొన్నిసార్లు అది వివాదాస్పదం కావడం గమనార్హం.

Published : 04 Mar 2024 14:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది రికార్డుల జోరుతోపాటు వాగ్వాదంతో ఐపీఎల్‌ సీజన్‌ హైలైట్‌గా నిలిచింది. ఇద్దరూ స్టార్లే కావడం.. ఎవరూ వెనుకడుగు వేయకపోవడంతో వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. చివరికి సహచరులు అడ్డుకోవడంతో ఆ సమస్య అక్కడితో ముగిసింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. వారిద్దరూ విరాట్ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ మ్యాచ్‌ (RCB vs LSG) సందర్భంగా తొలుత నవీనుల్‌ హక్‌తో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. మధ్యలోకి గౌతమ్‌ గంభీర్ రావడంతో వివాదం ముదిరింది. గతేడాది జరిగిన ఆ ఘటనను అఫ్గాన్‌ ప్లేయర్ నవీనుల్ హక్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశాడు. 

‘‘బెంగళూరులో ఆర్‌సీబీతో తలపడ్డాం. వివాదానికి అక్కడే బీజం పడింది. ఆ మ్యాచ్‌లో మేం చివరి బంతికి విజయం సాధించాం. ఆ సమయంలో అవేశ్‌ ఖాన్ తన హెల్మెట్‌ను విసిరి సంబరాలు చేసుకున్నాడు. ఇది విరాట్‌కు నచ్చినట్లు లేదు. ఆ తర్వాత మేం లఖ్‌నవూకు వచ్చేశాం. అక్కడ మళ్లీ ఆ జట్టుతో మ్యాచ్‌ ఆడాం. నేను తొమ్మిదో డౌన్‌ లేదా పదో డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చా. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. అయితే, వారి నుంచి స్లెడ్జింగ్‌ వస్తుందని ఊహించలేదు. అది జరిగిపోయింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కరచాలనం వద్ద కూడా ఇదే పరిస్థితి. మరీ ముఖ్యంగా విరాట్, సిరాజ్‌ నుంచి మాటల యుద్ధం మొదలైంది.

గత మ్యాచ్‌లో మేం గెలిచిన తర్వాత.. అందరూ నిశ్శబ్దంగా ఉండాలని గంభీర్‌ సైగలు చేయడం ఆర్‌సీబీకి నచ్చినట్లు లేదు. చివరి బంతికి సింగిల్‌ అవసరమై ఒక్క వికెట్‌ ఉన్న నేపథ్యంలో మేం గెలిచాం. రనౌట్‌ చేయడంలో వారు విఫలమయ్యారు. అదే లఖ్‌నవూలో వాగ్వాదం పెరగడానికి కారణమైంది. ఇక్కడ స్వల్ప స్కోరును ఛేదించడంలో మేం తడబడ్డాం.  క్రీడా స్ఫూర్తి ప్రకారం.. ఇలాంటి వివాదం క్రికెట్‌కు మంచిది కాదు. అయితే, క్రికెట్ పట్ల గంభీర్ ఎంతటి అభిమానం చూపిస్తాడో.. విరాట్ కోహ్లీ కూడా అలాగే ఉంటాడు’’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని