IPL 2024: విదేశీ ప్లేయర్ల తీరు అనైతికం.. బీసీసీఐ కలగజేసుకోవాలన్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు!

ఐపీఎల్ సీజన్‌ (IPL 2024)  నుంచి ఒక్కో విదేశీ ప్లేయర్ దూరం కావడంపై ఫ్రాంచైజీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బీసీసీఐ ఏదొక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Published : 14 Mar 2024 17:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో ఎనిమిది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కొందరు విదేశీ ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరం కావడంపై ఫ్రాంచైజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బెన్ స్టోక్స్, జోరూట్, మార్క్‌వుడ్, హారీ బ్రూక్ తదితరులు ఈ సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఈ విషయంలో బీసీసీఐ కలగజేసుకుని చర్యలు తీసుకోవాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. హారీ బ్రూక్‌ తన నాయనమ్మ చనిపోవడంతో ఈ సీజన్‌లో ఆడలేనని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో అతడి స్థానంలో మరొకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి దిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురైంది. 

‘‘ఒకసారి ఐపీఎల్‌ వేలంలో పేరును రిజిస్టర్ చేసుకుంటే.. కమిట్‌మెంట్‌ను గౌరవించాలి. లేకపోతే అది అనైతికం అవుతుంది. బీసీసీఐ ఈ సమస్యపై తక్షణమే స్పందించాలి’’ అని ఫ్రాంచైజీలు విజ్ఞప్తి చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. మార్చి 22 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్‌ మొదలుకానుంది. తొలి   15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఎన్నికలు జరిగే దానిని బట్టి మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్సీబీ శిబిరానికి కోహ్లీ వచ్చేస్తాడు

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు తన తొలి మ్యాచ్‌ సీఎస్కేతో తలపడనుంది. ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లు ఒక్కొక్కరూ ట్రైనింగ్‌ క్యాంప్‌నకు చేరుకుంటున్నారు. కెప్టెన్ డు ప్లెసిస్‌ సాధనను ముమ్మరం చేశాడు. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా త్వరలోనే శిబిరానికి వస్తాడని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. రెండోసారి కోహ్లీ తండ్రి కావడంతో మైదానంలోకి దిగలేదు. టీ20 ప్రపంచ కప్‌ నేపథ్యంలో.. ఐపీఎల్‌లో రాణిస్తే కోహ్లీని ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని