Rinku Singh: భారత జట్టుకు ఎంపిక.. ఆ రోజును వారికే అంకితమిస్తా: రింకు సింగ్‌

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో రింకు సింగ్‌ (Rinku Singh) పేరు మారుమోగిపోయింది. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అదే క్రమంలో భారత్‌ జట్టులోకి పిలుపు అందుకున్నాడు.

Updated : 16 Jul 2023 11:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియా (Team India) జట్టులోకి వచ్చిన ఆటగాడు రింకు సింగ్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున సూపర్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో ఆసియా క్రీడలకు ప్రకటించిన జట్టులోకి రింకు సింగ్‌ (Rinku Singh) వచ్చి చేరాడు. రుతురాజ్‌ గైక్వాడ్ సారథ్యంలో భారత్ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనా వేదికగా ఆసియా క్రీడలు జరుగుతాయి. దీని కోసం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. తనకు వచ్చిన అవకాశంపై రింకు సింగ్‌ తాజాగా స్పందించాడు. భారత జట్టు జెర్సీ ధరించడం తన చిరకాల వాంఛ అని.. త్వరలోనే తీరనుండటం ఆనందంగా ఉందన్నాడు.

‘‘నేను మానసికంగా చాలా గట్టోడిని. కానీ, భారత జట్టులో చోటు దక్కిందనే వార్త వినగానే భావోద్వేగానికి గురయ్యా. తొలిసారి టీమ్‌ఇండియా జెర్సీని ధరిస్తే.. కన్నీళ్లను ఆపలేననిపిస్తోంది. దీని కోసం చాలా ఏళ్లు కష్టపడి శ్రమించా. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగా.  భారత జట్టుకు ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. భవిష్యత్తు గురించి మరి ఎక్కువగా ఆలోచించడం లేదు. కానీ, నాకు వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోను. అయితే అనవసరంగా ఒత్తిడిని పెంచుకోవడం మంచిది కాదు. 

వేలంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు

భారత జెర్సీని ధరించడంపై.. నా కంటే నా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులే మరింత ఆనందంగా ఉంటారు. కొన్నేళ్లుగా ఈ క్షణం కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నా కష్టాలు ఏంటో ప్రత్యక్షంగా చూశారు. నాకు మద్దతుగా నిలిచారు. నా కష్టసుఖాల్లో వారి పాత్ర చాలా కీలకం. నేను ఏ రోజైతే భారత జెర్సీని ధరిస్తానో.. ఆ రోజును వారికి అంకితమిస్తా’’ అని రింకు సింగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని