Commonwealth Games : లాన్‌బౌల్స్‌ అంటే..

కామన్వెల్త్‌ క్రీడల మహిళల లాన్‌బౌల్‌ ఫోర్‌ విభాగంలో భారత్‌ మొట్టమొదటి సారి పసిడి నెగ్గడంతో ఇప్పుడందరూ ఈ ఆట గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఆట ఎలా..

Published : 03 Aug 2022 09:55 IST

కామన్వెల్త్‌ క్రీడల మహిళల లాన్‌బౌల్‌ ఫోర్‌ విభాగంలో భారత్‌ మొట్టమొదటి సారి పసిడి నెగ్గడంతో ఇప్పుడందరూ ఈ ఆట గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఆట ఎలా ఆడతారో తెలుసా..? మైదానం మధ్యలో ఒక లక్ష్యాన్ని (చిన్న బంతిని) ఏర్పాటు చేస్తారు. దీన్ని ‘ది జాక్‌’ అని పిలుస్తారు. నిర్దేశిత దూరం నుంచి ప్లేయర్లు తమకు ఇచ్చిన పెద్ద బంతుల (బౌల్స్‌)ను ఈ లక్ష్యానికి దగ్గరగా నేల మీద నుంచి విసరాల్సి ఉంటుంది. లక్ష్యానికి దగ్గరగా ఏ ప్లేయర్‌ బంతి ఉంటుందో వాళ్లకు పాయింట్లు ఇస్తారు. ఇలా నిర్దేశిత రౌండ్లు (ఎండ్‌) ముగిసే సరికి ఎవరికి ఎక్కువ పాయింట్లు లభిస్తే వాళ్లు గెలిచినట్లు. దీన్ని ముఖ్యంగా సింగిల్స్‌, డబుల్స్‌, ట్రిపుల్స్‌, ఫోర్స్‌ విభాగాల్లో ఆడతారు. సింగిల్స్‌లో ఇద్దరు ప్రత్యర్థులు తలపడతారు. అందులో ఒక ఎండ్‌లో ఒక్కో ప్లేయర్‌కు రెండు బౌల్స్‌ విసిరే అవకాశం ఉంటుంది. ముందుగా 21 పాయింట్లు సాధించిన క్రీడాకారులు విజేతలుగా నిలుస్తారు.

ఇలాగే డబుల్స్‌, ట్రిపుల్స్‌లో ప్లేయర్ల సంఖ్యను బట్టి ఎండ్స్‌, బౌల్స్‌ విసిరే సంఖ్య ఉంటుంది. ఫోర్స్‌ ఫార్మాట్లో ఒక ఎండ్‌లో ఒక జట్టు నుంచి ఎనిమిది త్రోలు విసురుతారు. ఇలా వృత్తాకారంగా 18 ఎండ్స్‌ పూర్తి చేస్తే మ్యాచ్‌ ముగుస్తుంది. అప్పటికీ అత్యధిక పాయింట్లు సాధించిన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. ఉదాహరణకు ఒక ఎండ్‌లో ‘బి’ జట్టుతో పోలిస్తే ‘ఎ’ జట్టు విసిరిన వాటిలో లక్ష్యానికి దగ్గరగా రెండు బంతులుంటే అప్పుడా జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. ఒకటి ఉంటే ఒక పాయింటు దక్కుతుంది. 1930లో కామన్వెల్త్‌ క్రీడల ఆరంభం నుంచే ఈ ఆట ఇందులో భాగంగా ఉంది. ఇప్పటివరకూ ఈ ఆటలో ఇంగ్లాండ్‌ (51) అత్యధిక పతకాలు గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (50), దక్షిణాఫ్రికా (44) ఉన్నాయి. 2010 నుంచి ఈ క్రీడల లాన్‌బౌల్స్‌లో భారత్‌ ప్రాతినిథ్యం వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు