మార్చిలో మొబైల్స్ ‘ఉప్పెన’!

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు ఇప్పుడిప్పుడే తగ్గిపోతున్నాయి. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు తెరుచుకున్నాయి....

Updated : 24 Feb 2021 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు తెరుచుకున్నాయి. పలు జాగ్రత్తలు తీసుకుంటూనే జనసంచారం సాగుతోంది. మరి ఇలాంటి సమయంలో వినియోగదారుల కోసం విపణిలోకి స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు అన్ని సంస్థలూ పోటీ పడటం సహజమే. కొత్త టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వరుసకట్టి రాబోతున్నాయి. మిడ్‌ రేంజ్‌ నుంచి హైఎండ్‌ ధరల్లో వచ్చే అలాంటి మొబైల్స్‌ గురించి తెలుసుకుందాం..

వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లో...

మరి కొన్ని వారాల్లో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వన్‌ప్లస్‌ సమయాత్తమైంది. వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రొ, వన్‌ప్లస్‌ 9 లైట్‌ వేరియంట్లలో వచ్చేస్తాయని పేర్కొంది. దీనిపై మార్చి తొలి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ ఫోన్లకు సంబంధించి ఫీచర్ల గురించి పలు వార్తలు వస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు ఇవేనా..

* ప్రాసెసర్‌: క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888

* డిస్‌ప్లే: 6.55 అంగుళాలు

* ర్యామ్‌: 8 జీబీ/12 జీబీ

* కెమెరా: 48 ఎంపీ ప్రైమరీ/ సెల్ఫీ కెమెరా ఎంతనేది తెలియాల్సి ఉంది

*  బ్యాటరీ: 5000 mAh

* ధర: రూ.40,000 (అంచనా)


మార్చి తొలి వారంలో ఫస్ట్‌ సేల్‌...

రియల్‌మీ మరో రెండు రోజుల్లో తన కొత్త మొబైల్‌కు సంబంధించి ప్రకటన వెలువరించనుంది. నార్జో 30 ప్రో, నార్జో 30A స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోకి తక్కువ ధరకే 5G ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. మార్చి 4న తొలి సేల్‌ జరపనున్న నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డైమెన్సిటీ 800U ప్రాసెసర్‌తో రానుందని సమాచారం. అలానే నార్జో 30 A స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. 


స్వల్ప వ్యవధిలో విపణిలోకి..

షావోమీ తన ఉత్పత్తులను వెనువెంటనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెడ్‌మీ K40 సిరీస్‌తోపాటు 6జీబీ ర్యామ్‌తో రెడ్‌మీ 9 పవర్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 25న నిర్వహించే కార్యక్రమంలో రెడ్‌మీ K40 సిరీస్‌ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ ఫోన్లను అంతర్జాతీయంగా విడుదల చేయాలని షావోమీ భావిస్తోంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 లేదా స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రెడ్‌మీ 9 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ గత డిసెంబర్‌లోనే భారత మార్కెట్లోకి వచ్చింది. అయితే అదనపు ఫీచర్లతో 6జీబీ ర్యామ్‌తో రెడ్‌మీ 9 పవర్‌ను తీసుకొచ్చేసింది. 6జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజీ కెపాసిటీతో రూ.12,999 ధరలో లభిస్తుంది. పోకో M3 మొబైల్‌కు పోటీగా రెడ్‌మీ 9 పవర్‌ (6జీబీ ర్యామ్‌) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

రెడ్‌మీ 9 పవర్‌ (6జీబీ ర్యామ్‌) ఫీచర్లు..

* ప్రాసెసర్‌: క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662

* డిస్‌ప్లే: 16.58 సెం.మీ (6.53 అంగుళాలు)

* కెమెరా: 48 ఎంపీ +8 ఎంపీ+ 2 ఎంపీ మాక్రో/8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

* బ్యాటరీ: 6000 mAh

* ధర: రూ.12,999


చైనాలో రాబోతోంది.. భారత్‌లోకి ఎప్పుడో..?

గేమింగ్ ఫోన్లకు ఆసుస్‌ పెట్టింది పేరు. తన కొత్త మొబైల్‌ను చైనా మార్కెట్లోకి మార్చి 10న విడుదల చేయనుంది. ఆసుస్‌ ROG 5 స్మార్ట్‌ఫోన్‌ను  భారత్‌లోకి ఎప్పుడు తీసుకురానుందో ఆసుస్‌ వెల్లడించలేదు. అయితే ఆసుస్‌కు పోటీగా నుబియా సంస్థ రెడ్‌ మ్యాజిక్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను అక్కడి మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. 6.78 అంగుళాల డిస్‌ప్లేతో గేమింగ్‌ ఫోన్‌ రావొచ్చని టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌, 6000 mAh బ్యాటరీతో పనిచేస్తుందని వెల్లడించాయి.  ఆండ్రాయిడ్‌ 11 వెర్షన్‌తో 65W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో స్మార్ట్‌ఫోన్‌ వస్తుందని పేర్కొన్నాయి. 16 GB ర్యామ్‌తో తీసుకొస్తుందని తెలుస్తోంది. 64 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌, గేమింగ్‌ కోసం అదనపు బటన్‌ సౌకర్యం ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి. స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉండొచ్చనేది తెలియరాలేదు. 


మార్చి 3న వివో స్మార్ట్‌ఫోన్‌.. అయితే..

S సిరీస్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు వివో సిద్ధమైంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1100 SoC ప్రాసెసర్‌తో మార్చి 3న వివో S9 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. అలానే మీడియా టెక్‌ డైమెన్సిటీ 820 ప్రాసెసర్‌తో వివో S9e మొబైల్‌ను తీసుకురానుందని నిపుణులు తెలిపారు. అయితే వచ్చే నెలలో చైనాలోనే విడుదల కానుండగా.. భారత్‌లోకి త్వరలో రానుందని వివో పేర్కొంది. తమ మొబైల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా జపాన్‌కు చెందిన ప్రముఖ గాయని లిసాను ఎంపిక చేసుకుంది. 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 1100 చిప్‌సెట్‌తో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా వివో S9 నిలుస్తోందని టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. ఫోన్‌ ధర ఎంత ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

వివో S9 స్పెసిఫికషన్స్‌ ఇవేనా (అంచనా)..

* ప్రాసెసర్‌: మీడియాటెక్‌ డెమెన్సిటీ 1100 ఆక్టాకోర్

* రేర్‌ కెమెరా: 64+8+2 ఎంపీ

* ఫ్రంట్‌ కెమెరా: 44 ఎంపీ+8 ఎంపీ

* డిస్‌ప్లే: 16.36 సెం.మీ (6.44 అంగుళాలు)

* ర్యామ్‌: 8 GB

* బ్యాటరీ: 4000 mAh

* విడుదల: మార్చి 9 (ప్రకటించాల్సి ఉంది)

* ధర: రూ.29,990 (అంచనా)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని