iPhone 14 Pro Max: ఈ ఐఫోన్ ధర ₹12లక్షలు.. అంత స్పెషల్‌ ఏంటంటే?

రష్యాకు చెందిన కేవియర్‌ కంపెనీ డిజైన్ చేసిన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ధర వింటే మాత్రం షాకవ్వాల్సిందే. మరి, ఈ ఫోన్‌కు ఇంత ధర ఎందుకు? ఇందులోని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

Published : 16 Oct 2022 10:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ కంపెనీ గత నెలలో ఐఫోన్ 14 సిరీస్‌ను నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది. ఐఫోన్ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో తీసుకొచ్చినట్లు యాపిల్‌ కంపెనీ చెబుతున్నప్పటికీ, ఐఫోన్‌ 13, ఐఫోన్ 14కు ఫీచర్ల పరంగా పెద్ద మార్పులు లేవనీ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్‌ 14 ప్రారంభ ధర ₹ 79,900 కాగా, గరిష్ఠంగా ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ ధర రూ. 1,39,900గా కంపెనీ నిర్ణయించింది. ఫోన్‌ విడుదలైనప్పుడు..  ధరపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  తాజాగా, రష్యాకు చెందిన కేవియర్‌ (Caviar) సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 14 ప్రో సిరీస్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర వింటే మాత్రం షాకవ్వాల్సిందే. కేవియర్‌ టూర్బిలియన్‌ కార్బన్‌ గోల్డ్‌ యాపిల్‌ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ (Caviar Tourbillion Carbon Gold Apple iPhone 14 Pro Max) పేరుతో తీసుకొస్తున్న ఈ మోడల్ ధర 14,150 డాలర్లు. భారత కరెన్సీలో సుమారు ₹ 12 లక్షలు. మరి, ఈ ఫోన్‌కు ఇంత ధర ఎందుకు? ఇందులోని ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం...

ఫోన్ ప్రత్యేకతలు

ఇందులో ప్రధాన ఆకర్షణ  డిజైన్‌. ఫోన్ కేస్‌ను కార్బన్‌ ఉపయోగించి త్రీడీ ప్రింట్‌తో రూపొందించారు. ఫోన్ వెనుక భాగంగా రోలెక్స్‌ కంపెనీ ప్రత్యేకంగా తయారుచేసిన క్లాసికల్‌ టూర్బిలియన్‌ వాచ్‌ను అమర్చారు. దీంతోపాటు బంగారు రంగులో డిజైన్‌ చేసిన వాచ్‌ డయల్‌ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని కేవియర్‌ కంపెనీ చెబుతోంది. వాచ్‌ మెకానిజమ్‌లో గొప్పదిగా చెప్పుకొనే టూర్బిలియన్‌ మెకానిజమ్‌ను ఇందులో ఉపయోగించారు. అంతేకాకుండా  వాచ్‌ లోపలి భాగాల కదలికలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఈ వేరియంట్‌లో 39 ఫోన్లను మాత్రమే డిజైన్ చేసినట్లు కేవియర్ కంపెనీ తెలిపింది.  వీటిని కేవియర్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. సాధారణ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో ఉన్న ఫీచర్లే ఇందులోనూ ఉంటాయి. 

ఐఫోన్ 14 మ్యాక్స్‌ 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1టీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ఏ15 బయోనిక్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 48 ఎంపీ, 12 ఎంపీ కెమెరాలున్నాయి. 6.7 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని