మెదడులో కల్పిత జ్ఞాపకాలు!

మట్టిలో విత్తనాలు నాటినట్టు మెదడులో జ్ఞాపకాలు నాటొచ్చా? అదీ కల్పిత జ్ఞాపకాలను! అసాధ్యమేమీ కాదని నిరూపించారు బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు. ఇలా 52 మందిలో నాలుగు జ్ఞాపకాలను ప్రవేశపెట్టటంలో విజయం సాధించారు. వీటిల్లో రెండు నిజమైనవైతే, రెండు కల్పిత జ్ఞాపకాలు. ఇంతకీ కల్పిత జ్ఞాపకాలంటే?

Updated : 16 Jun 2021 08:16 IST

మట్టిలో విత్తనాలు నాటినట్టు మెదడులో జ్ఞాపకాలు నాటొచ్చా? అదీ కల్పిత జ్ఞాపకాలను! అసాధ్యమేమీ కాదని నిరూపించారు బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు. ఇలా 52 మందిలో నాలుగు జ్ఞాపకాలను ప్రవేశపెట్టటంలో విజయం సాధించారు. వీటిల్లో రెండు నిజమైనవైతే, రెండు కల్పిత జ్ఞాపకాలు. ఇంతకీ కల్పిత జ్ఞాపకాలంటే? ఎన్నడూ జరగనివి. కానీ జరగటానికి ఆస్కారమున్నవి. ఉదాహరణకు- తప్పిపోవటం, పారిపోవటం, ప్రమాదానికి గురికావటం వంటివి. అధ్యయనంలో పాల్గొన్నవారి తల్లిదండ్రులు సహకరించటంతోనే ఇది సాధ్యమైంది. ఆయా జ్ఞాపకాలకు సంబంధించిన సంఘటనలు నిజంగానే జరిగాయని తమ పిల్లలను గట్టిగా ఒప్పించగలిగారు. దీంతో అవి నిజమేనని 40% మంది నమ్మటం విశేషం. అంటే జరగని సంఘటనలనూ జరిగినట్టు నమ్మించటమే కాదు, అవి మెదడులో స్థిరపడేటట్టూ శాస్త్రవేత్తలు చేయగలిగారు. అనంతరం అవన్నీ కల్పిత జ్ఞాపకాలని అసలు విషయాన్ని బయటపెట్టారు. కుటుంబ సభ్యుల కథనాలతో, ఫొటోలతో గానీ గుర్తుకుతెచ్చుకోవాలంటూ పదే పదే అడగటంతో గానీ మెదడులో ఇలాంటి సంఘటనలను జొప్పించే అవకాశముందని వారికి వివరించారు. దీంతో నిజమేనని నమ్మిన జ్ఞాపకాలను 74% మంది నిరాకరించారు. జరగనివి జరిగినట్టు చెప్పటమెందుకు? జ్ఞాపకాలుగా మెదడులో జొప్పించటమెందుకు? తిరిగి అవన్నీ కల్పితమని వివరించటమెందుకు? ఇంత కష్టం ఎందుకనేగా మీ సందేహం. కోర్టుల్లో కల్పిత, తప్పుడు జ్ఞాపకాలను సాక్ష్యాలుగా పేర్కొంటే తీర్పులు తారుమారైపోతాయి కదా. అందుకని జ్ఞాపకాలు ఎలా రూపొందుతాయో, వీటిని గుర్తించటమెలాగో, మార్చటమెలాగో తెలుసుకుంటే పలు విధాలుగా తోడ్పడగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం, మానసిక పరిశోధనల వంటి వాటికీ ఉపయోగపడగలవని నిపుణులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని