మెత్తని భూతం!

ఏనుగు దంతానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చింది! జీవజాతుల సంరక్షణకు వరంగా పేరొందింది. 20వ శతాబ్దం ద్వితీయార్థానికే చిహ్నంగా భాసిల్లింది!! అవును.. ఇలా ప్లాస్టిక్‌ ప్రస్థానం ఒక వరంగానే మొదలైంది. సౌకర్యానికి మారుపేరుగా నిలిచింది.

Published : 06 Jul 2022 00:39 IST

ఏనుగు దంతానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చింది! జీవజాతుల సంరక్షణకు వరంగా పేరొందింది. 20వ శతాబ్దం ద్వితీయార్థానికే చిహ్నంగా భాసిల్లింది!! అవును.. ఇలా ప్లాస్టిక్‌ ప్రస్థానం ఒక వరంగానే మొదలైంది. సౌకర్యానికి మారుపేరుగా నిలిచింది. ఇందుగలదందులేదనే చందంగా ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడదే పర్యావరణానికి పెను భూతంగా పరిణమించింది. దీని నిర్మూలన 21వ శతాబ్దానికే సవాలు విసురుతోంది. వాడకాన్ని ఆపితే తప్ప కొలిక్కిరాని పరిస్థితికి చేరుకుంది. కాబట్టే ఇటీవల ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, వినియోగాన్ని మనదేశం నిషేధించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ పుట్టుపూర్వోత్తరాలను ఓసారి పరిశీలిద్దాం.

ప్లాస్టిక్‌ లేకపోతే జీవితం ఎలా ఉండేది? దీన్ని కనుగొనకపోయి ఉంటే మన పరిసరాలు, సమాజం ఎలా ఉండేవి? ఎప్పుడైనా ఊహించారా? ఇంట్లో స్విచ్చులు, దువ్వెనలు, కుర్చీలు, బల్లలు.. ఆ మాటకొస్తే పొద్దున లేవగానే పళ్లు తోముకునే బ్రష్షుల దగ్గర్నుంచి రిమోట్‌ కంట్రోళ్లు, మిక్సీలు, గ్రైండర్ల వంటి పరికరాల వరకూ అన్నీ పాస్టిక్‌తో తయారైనవే మరి. ఇంట్లోనే కాదు బయటా ఇదే పరిస్థితి. ఎటు చూస్తే అటు పాస్టిక్‌ వస్తువులు దర్శనమిస్తుంటాయి. అందుకే ప్లాస్టిక్‌ లేని రోజుల్లో ఎలా జీవించేవారో అని తరచూ ఆశ్చర్యపోతుంటాం కూడా. ప్లాస్టిక్‌ అంటే ఆకారం లేదా రూపం మార్చుకోవటానికి అనువైనదని అర్థం. ప్లాస్టిక్‌లో ప్రధానమైనవి పాలిమర్లు. ఇవి చాలా పొడవైన అణువులతో కూడిన పదార్థాలు. వీటిల్లో వేలాది భాగాలతో కూడిన కార్బన్‌ అణువుల గొలుసులు ఉంటాయి. ఇవన్నీ ప్రధాన భాగంతో అనుసంధానమై ఉంటాయి. ఇవే ప్లాస్టిక్‌కు ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. మృదుత్వం, సాగే గుణం మాత్రమే కాదు.. తక్కువ సాంద్రత, తక్కువ విద్యుత్‌ వాహకత్వం, పారదర్శకత్వం, గట్టిదనం వంటి ప్రత్యేక గుణాలూ దీని సొంతం. కాబట్టే వేడి, ఒత్తిడి ప్రభావంతో దీన్ని పొరలు, పోచలు, పళ్లాలు, గొట్టాలు, పెట్టెలు, బాటిళ్ల వంటి ఎన్నో రకాలుగా మలచుకోవటం సాధ్యమవుతోంది. ప్లాస్టిక్‌ ప్రస్థానం మొదట్లో నెమ్మదిగానే మొదలైంది. తర్వాతే ఊపందుకుంది.

సేంద్రియ పదార్థం నుంచి..
తొలిసారిగా అలెగ్జాండర్‌ పార్కెస్‌ కృత్రిమ ప్లాస్టిక్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన 1862లో లండన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో దీన్ని ప్రదర్శించారు. సెల్యులోజ్‌ నుంచి సంగ్రహించిన సేంద్రియ పదార్థంతో తయారుచేసిన దీనికి ఆయన పెట్టిన పేరు పార్కెజైన్‌. వేడి చేసినప్పుడు ఆకారం మారటం, చల్లారిన తర్వాత ఆ ఆకారం అలాగే ఉండటం అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే తయారీకి ఎక్కువ ఖర్చు కావటం, పగిలిపోవటం, త్వరగా మండిపోవటం వల్ల వాణిజ్యపరంగా అంతగా ఆదరణ పొందలేదు. అప్పట్లో బిలియర్డ్‌ ఆటలో వాడే బంతులను ఏనుగు దంతంతో తయారుచేసేవారు. ఏనుగు దంతాలకు కొరత ఏర్పడటం వల్ల వీటికి ప్రత్యామ్నాయం కోసం ఒక కంపెనీ పోటీ నిర్వహించింది. అప్పుడు అమెరికాకు చెందిన జాన్‌ వెస్లీ హయత్‌.. పార్కెజైన్‌ను మెరుగుపరచి సెల్యులాయిడ్‌ అనే కొత్త పదార్థాన్ని రూపొందించారు. నైట్రిక్‌ ఆక్సైడ్‌, పత్తితో కూడిన పైరాక్సిలిన్‌ మిశ్రమాన్ని కర్పూరంతో కలిపి దీన్ని తయారుచేశారు. పోటీలో గెలవనప్పటికీ అమెరికాలో తొలి ప్లాస్టిక్‌ను రూపొందించిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. సెల్యులాయిడ్‌తో తాబేలు డిప్ప, కొమ్ములు, ఏనుగు దంతం వంటి సహజ పదార్థాలను పోలినవాటిని తయారుచేసే వీలుండటం ఎంతగానో ఆకర్షించింది. పర్యావరణానికీ మేలు చేసేదిగా.. ఏనుగులను, తాబేళ్లను సంరక్షించే వరంగానూ పేరు పొందింది. ఈ సెల్యులాయిడ్‌ను చదునుగా చేసి పట్టీల మాదిరిగా మలచే అవకాశం ఉండటం ఫొటోగ్రఫీ పితామహుడు జార్జ్‌ ఈస్ట్‌మన్‌ను ఆకట్టుకుంది. దీన్ని ఆయన సినిమా ఫిల్మ్‌గా ఉపయోగించుకోవటం మొదలెట్టారు.

ప్లాస్టిక్‌ అంటే?
సేంద్రియ పాలిమర్లనే మనం ప్లాస్టిక్‌గా పిలుచుకుంటున్నాం. ఈ పాలిమర్లు కృత్రిమమైనవి కావొచ్చు, సహజమైనవి కావొచ్చు. ప్లాస్టిక్‌ పదార్థాలన్నీ పాలిమర్లే. అలాగని పాలిమర్లన్నీ ప్లాస్టిక్‌ కావు. పాలిమర్‌ బోలెడన్ని మోనోమర్లతో కూడుకొని ఉంటుంది. పాలీ అంటే చాలా, మెర్‌ అంటే పునరావృత్త విభాగం, మోనో అంటే ఒకటి అని అర్థం. మోనోమర్‌లో ఒకే పునరావృత్త విభాగం ఉంటుంది. ఇవన్నీ కలగలసి పాలిమర్‌గా రూపొందుతాయి. అంటే దారానికి పూసలు గుచ్చినట్టుగా మోనోమర్ల గొలుసులతో పాలిమర్లు ఏర్పడతాయన్నమాట. ప్లాస్టిక్‌ పదార్థాల్లో కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌, నైట్రోజన్‌, సల్ఫర్‌, క్లోరిన్‌ వంటి వివిధ మూలకాలుంటాయి. వీటిని సిలికాన్‌ అణువులతోనూ ఉత్పత్తి చేయొచ్చు (సిలికాన్‌). సిలికాన్‌ బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌, కంటి లెన్స్‌ తయారీలో వాడే సిలికాన్‌ హైడ్రోజన్‌ ఇలాంటివే.

ఎలా తయారవుతుంది?
జీవ ఆధారితం, కృత్రిమం.. ఇలా ప్లాస్టిక్‌ రెండు రకాలుగా ఉంటుంది. కృత్రిమ ప్లాస్టిక్స్‌ను ముడి చమురు, సహజ వాయువుల, బొగ్గు నుంచి సంగ్రహిస్తుంటారు. పిండి పదార్థాలు, గంజి, వంట నూనెలు, బ్యాక్టీరియా వంటి పునర్వినియోగ పదార్థాలతో తయారయ్యేవి జీవ ఆధారిత ప్లాస్టిక్స్‌. ప్రస్తుతం వాడకంలో ఉన్న ప్లాస్టిక్‌ పదార్థాలు చాలావరకు ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల నుంచి వచ్చినవే. ఉదాహరణకు- ముడి చమురునే తీసుకుందాం. దీన్ని శుద్ధి చేసి పెట్రోలు ఉత్పత్తులను సంగ్రహించే ప్రక్రియలో భాగంగా మోనోమర్ల వంటి వివిధ రసాయనాలు పుట్టుకొస్తుంటాయి. పాలిమర్లలో ప్రధానమైనవి ఈ మోనోమర్లే. ముడి చమురును ఫర్నేస్‌లో వేడి చేశాక వడకట్టే కేంద్రానికి పంపిస్తారు. అక్కడది తేలికైన అంశాలుగా విడిపోతుంది. వీటిల్లో ఒకటి నాఫ్తా (రసాయనాలు). పెద్దమొత్తంలో ప్లాస్టిక్‌ను తయారు చేయటానికిదే కీలకం. దీన్ని విడగొట్టి పాలిమరీకరణ ప్రక్రియ ద్వారా భార అణువులతో కూడిన హైడ్రోకార్బన్లుగా (పాలిమర్లు) మారుస్తారు. దీంతో మోనోమర్లు రసాయన గొలుసులతో అనుసంధానమవుతాయి. తర్వాత వీటిని వివిధ మిశ్రమాలతో కలిపి ప్లాస్టిక్‌గా తయారుచేస్తారు.

మన శరీరంలోకీ..
ఉపయోగాల మాటెలా ఉన్నా ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెను ముప్పుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 30 కోట్ల టన్నుల పాస్టిక్‌ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని అంచనా. ఇవన్నీ చాలావరకు చెత్తకుప్పల్లోకి, అక్కడ్నుంచి కాలువలు, నదుల ద్వారా సముద్రాల్లోకి చేరుకుంటున్నాయి. కొన్ని వ్యర్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తుంటే, బరువుగా ఉన్నవి మునిగిపోతున్నాయి. మిగతావి సముద్ర జలాల మీద తేలియాడుతూ వస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు చిన్న చిన్న ముక్కలుగా.. అంటే 5 మి.మీ. కన్నా తక్కువ సైజులో ఉన్న వ్యర్థాలు సముద్ర జలాల్లో పెరిగిపోతున్నాయి. వీటిని సముద్రంలోని చేపల వంటివి తినటం, ఈ జీవులు మన ఆహారంలోకి చేరటం పెద్ద ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇవి కణజాలాన్ని దెబ్బతీయటం, ఆహారాన్ని శరీరం గ్రహించుకోనీయకుండా చేయటం, విషతుల్యాలను వెదజల్లటం వంటి అనర్థాలను తెచ్చిపెడతాయి. మనం ఏటా 11వేల ప్లాస్టిక్‌ ముక్కలను తింటున్నామని ఒక అధ్యయనం పేర్కొంటోంది.

తొలి పూర్తి కృత్రిమ ప్లాస్టిక్‌
మొట్టమొదటి పూర్తిస్థాయి కృత్రిమ ప్లాస్టిక్‌.. అంటే సహజ పదార్థాల అణువులేవీ లేని ప్లాస్టిక్‌ను 1907లో లియో బేక్‌లాండ్‌ తయారుచేశారు. దీనిపేరు బేక్‌లైట్‌. సహజ విద్యుత్‌ నిరోధకమైన లక్కకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీర్చిదిద్దారు. విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడింది. బేక్‌లైట్‌ మంచి విద్యుత్‌ నిరోధకం మాత్రమే కాదు.. ఎక్కువకాలం మన్నుతుంది. సెల్యులాయిడ్‌ మాదిరిగా కాకుండా వేడిని బాగా తట్టుకుంటుంది. అందుకే పెద్దఎత్తున ఉత్పత్తి చేయటానికి మార్గం వేసింది. అనంతరం పాలీక్లోరైడ్‌ వినైల్‌, సెలోఫేన్‌ వంటి కొత్త కొత్త ప్లాస్టిక్స్‌ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆట వస్తువులు, ఇంటి ఉపకరణాల దగ్గర్నుంచి ప్యాకేజీల రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. రెండో ప్రపంచయుద్ధం ప్లాసిక్‌ పరిశ్రమ విస్తరణకు ఊపునిచ్చిందని చెప్పుకోవచ్చు. సహజ వనరుల సంరక్షణ కోసం కృత్రిమ పదార్థాల తయారీకి ప్రాధాన్యం లభించింది. ఈ క్రమంలోనే వాలస్‌ క్యారోథర్స్‌ 1935లో కృత్రిమ పట్టు రూపంలో నైలాన్‌ను సృష్టించారు. యుద్ధ సమయంలో ప్యారాచూట్లు, తాళ్లు, హెల్మెట్‌ లైనర్ల వంటి ఎన్నో వస్తువుల తయారీకిది ఉపయోగపడింది. విమాన కిటికీల అద్దాలకు ప్లెక్సిగ్లాస్‌ ప్రత్యామ్నాయంగా మారటం గమనార్హం. థర్మోసెట్‌ పాలిస్టర్‌ రెజిన్లను సైన్యం కోసం తయారు చేసినా అనంతరం పడవల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. డాక్రాన్‌ అనే పాలిస్టర్‌ వస్త్రం 50ల్లో మార్కెట్‌లోకి వచ్చింది. 1953లో లెక్సాన్‌ అనే ప్లాస్టిక్‌ పుట్టుకొచ్చింది. చంద్రుడి మీద నడిచిన నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ ధరించిన హెల్మెట్‌ దీంతో తయారైందే. ద్రవ క్రిస్టిలిన్‌ పదార్థాలతో వడికిన దారాలతో బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లనూ రూపొందించారు. మొట్టమొదటి ప్లాస్టిక్‌ బాటిళ్లు 1968లో దర్శనమిచ్చాయి. ఇలా రోజురోజుకీ వినూత్న ప్లాస్టిక్స్‌ పుట్టుకొస్తూనే ఉన్నాయి. శరవేగంగా విస్తరిస్తూనే ఉన్నాయి.


రకరకాలు

మనకు ప్లాస్టిక్‌ అంతా ఒకేలా కనిపిస్తుంది గానీ ఇందులో చాలా రకాలున్నాయి.
* పాలీఎథిలీన్‌ టెరెఫ్తాలేట్‌ (పెట్‌): ఇది పారదర్శకంగా ఉంటుంది. బాటిళ్ల వంటివి తయారయ్యేది దీన్నుంచే. వేడికి గురికానంతవరకు దీన్ని సురక్షితమైనదనే అనుకోవచ్చు. దీనిలోని యాంటిమొనీ ట్రైఆక్సైడ్‌ తేలికగా పానీయంలోకి చేరుకుంటుంది. అందుకే కారులో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను పెట్టొద్దని చెబుతుంటారు. పెట్‌ రకం ప్లాస్టిక్‌ రంధ్రాలతో కూడుకొని ఉంటుంది. వీటిల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంది. అందువల్ల ఒకసారి వాడి పారేసే ఇలాంటి బాటిళ్లను ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. వీటిని తేలికగా పునర్వియోగం చేసుకోవచ్చు.
* హైడెన్సిటీ పాలీఎథిలీన్‌ (హెచ్‌డీపీఈ): గట్టిగా, పారదర్శకంగా ఉండే ఇది జగ్గులు, పాల సీసాలు, ఆట వస్తువుల వంటి వాటికి తయారీకి ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి పెద్దగా హాని చేయదు.
* పాలీవినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ): పీవీసీ పైపుల గురించి తెలిసిందే. ఇవే కాదు.. నీటి మీద తేలే ఆట వస్తువులు, ఫ్లోరింగ్‌, కార్‌ ఇంటీరియర్స్‌, వృక్ష లెదర్ల వంటి వాటి తయారీలోనూ దీన్ని వాడుతుంటారు. మెత్తగా, బాగా వంగేలా ఉండటానికి ఇందులో థాలేట్ల వంటివి కలుపుతారు. ఇవి హార్మోన్లను అస్తవ్యవస్తం చేస్తాయి. శరీర సహజ సమాచార వ్యవస్థను అడ్డుకుంటాయి.
* లోడెన్సిటీ పాలీఎథిలీన్‌ (ఎల్‌డీపీఈ): బ్యాగులు, ప్లాస్టిక్‌ పొరలు.. కాఫీ కప్పుల వంటివి నీటికి తడవకుండా లోపల పరచే పలుచటి పొరల వంటి వాటి తయారీకి దీన్ని వినియోగిస్తారు. పెట్రోలియంతో తయారయ్యే ఇది పారదర్శకంగా ఉంటుంది. దీంతో తలెత్తే అనర్థాల గురించి పెద్దగా తెలియదు గానీ పునర్వియోగం చేయటం చాలా కష్టం.
* పాలీప్రొపైలేన్‌ (పీపీ): పెరుగు, ఛీజ్‌, వెన్న అమ్మే పెట్టెలు.. లంచ్‌బాక్సులు, మందుల బాటిళ్ల వంటివి దీంతో తయారవుతాయి. గట్టిగా, బలంగా ఉండే ఇవి వేడిని తట్టుకుంటాయి. మైక్రోఓవెన్లలోనూ వాడుకోవచ్చు. అలాగని ఆరోగ్యానికి హాని చేయవని అనుకోవద్దు. ప్లాస్టిక్‌ పెట్టెల్లో కన్నా పళ్లాల్లో ఆహారాన్ని వేడి చేయటం ఉత్తమం.
* పాలీస్టెరీన్‌ (పీఎస్‌): దీన్ని సాధారణంగా స్టైరోఫోమ్‌గా పిలుచుకుంటుంటారు. వాడి పారేసే వంటపాత్రలు, కాఫీ కప్పుల మూతలు, గుడ్ల పెట్టెలు, డీవీడీ కేసులు, ట్రేల వంటి పలు ఉత్పత్తులకు ఇది ఉపయోగ పడుతుంది. తేలికగా ముక్కలై కాలువలు, నదుల్లో కలుస్తుంది.  స్టైరీన్‌, బెంజీన్‌ వంటి విషతుల్యాలెన్నో ఉంటాయి. ఇవి క్యాన్సర్లు, నాడీ సమస్యల వంటి ముప్పులకు దారితీస్తాయి.
* పాలీకార్బొనేట్‌ (పీసీ): ఇది అన్నిరకాల ప్లాస్టిక్స్‌తో కూడిన మిశ్రమం.
* బయోప్లాస్టిక్‌: ఇవి నేలలో కుళ్లిపోగలవు. అయితే కొన్ని మాత్రం పరిశ్రమల్లో నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేస్తేనే కుళ్లిపోతాయి.


వరం.. శాపం!

ప్లాస్టిక్‌ ఒకరకంగా వరం. మరోరకంగా శాపం. మన జీవన గమనంలో ప్లాస్టిక్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినప్పటికీ.. పర్యావరణపరంగా, ఆరోగ్యపరంగా బోలెడన్ని అనర్థాలకు కారణమవుతోంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే భావి తరాలకు మనమే చేజేతులా కీడు తలపెట్టినట్టే. ప్లాస్టిక్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేయటం ఆరంభించినప్పట్నుంచీ మనం 630 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను పారేసి ఉంటామని అంచనా. వీటిల్లో కేవలం 60 కోట్ల టన్నులు మాత్రమే పునర్వియోగానికి నోచుకున్నాయి. మిగతాదంతా చెత్తకుప్పల్లోకి చేరుకొని, పర్యావరణానికి హాని కలిగిస్తోందన్నమాటే. నిజానికి ప్లాస్టిక్‌ పర్యావరణంలో క్షీణించేదే అయినా ఇందుకు చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకు పెట్‌ ప్లాస్టిక్‌ క్షీణించటానికి నాలుగు తరాలు పడుతుంది. ఎందుకంటే దీనిలోని రసాయనాలను బ్యాక్టీరియా విడగొట్టలేదు. మనం వాడే కొన్ని ప్లాస్టిక్‌ వస్తువులు క్షీణించటానికి ఎంత కాలం పడుతుందో చూద్దామా!
* ప్లాస్టిక్‌ బ్యాగు - 20 ఏళ్లు
*కాఫీ కప్పు - 30 ఏళ్లు
*ప్లాస్టిక్‌ స్ట్రా - 200 ఏళ్లు
* ప్లాస్టిక్‌ నీళ్ల బాటిల్‌ - 450 ఏళ్లు
* ప్లాస్టిక్‌ కప్‌ - 450 ఏళ్లు
* డిస్‌పోజబుల్‌ డైపర్‌ - 500 ఏళ్లు
* ప్లాస్టిక్‌ టూత్‌బ్రష్‌ - 500 ఏళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని