Google PlayStore: యాప్‌ డౌన్‌లోడ్ చేసే ముందు వీటిని చెక్ చేస్తున్నారా?

ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్‌ యూజర్‌ నుంచి సేకరించే సమాచారానికి సంబంధించి గూగుల్ డేటా సేఫ్టీ అనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది... 

Published : 19 Jul 2022 10:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. బ్యాంకింగ్‌, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌, టికెట్ బుకింగ్‌తోపాటు ఎన్నో రకాల సేవలు యాప్‌ల ద్వారా పొందవచ్చు. యూజర్‌ అవసరాలకు అనుగుణంగా కంపెనీలు సైతం యాప్‌లను తీసుకొస్తున్నాయి. కొత్తగా ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేప్పుడు, దాని సేవలను ఉపయోగించాలనే తొందర్లో అన్ని రకాల అనుమతులు ఇచ్చేస్తాం. యాప్‌ మన నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తుంది? దాన్ని ఎవరితో పంచుకుంటుంది అనేది పట్టించుకోం. దీనివల్ల యూజర్‌కు సంబంధించిన విలువైన సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ (Google) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్లేస్టోర్‌ (PlayStore)లోని యాప్‌ డెవలపర్స్‌కు  డేటా సేఫ్టీ (Data Safety) పేరుతో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 

ఏంటీ డేటా సేఫ్టీ..?

ఈ నిబంధన ప్రకారం యాప్‌ డెవలపర్స్ యూజర్‌ నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనేది తప్పక తెలియజేయాలి. యాప్‌ డెవలపర్స్ సమర్పించిన వివరాలను గూగుల్ పరిశీలించి యూజర్‌కు తెలిసేలా ప్లేస్టోర్‌లో ఉంచుతుంది. ఉదాహరణకు మీరు ప్లేస్టోర్‌ నుంచి ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుంటుంటే.. కిందకు స్క్రోల్ చేస్తే డేటా సేఫ్టీ సెక్షన్‌ కనిపిస్తుంది. అందులో డేటా షేర్డ్‌ (Data Shared), డేటా కలెక్టెడ్‌ (Data Collected) ఆప్షన్స్‌లో మీ నుంచి సేకరిస్తున్న సమాచారం, షేరింగ్‌ వివరాలు ఉంటాయి. ఈ సమాచారంతో యూజర్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారు. ఒకవేళ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డేటా సేఫ్టీలో పేర్కొన్న దానికి భిన్నంగా అదనపు సమాచారం సేకరిస్తున్నట్లు గుర్తిస్తే, గూగుల్‌కు ఫిర్యాదు చేస్తే సదరు యాప్‌ డెవలపర్స్‌పై చర్యలు తీసుకుంటుంది. జులై 20 నాటికి ప్లేస్టోర్‌లోని ప్రతి యాప్‌ డెవలపర్‌ తప్పనిసరిగా డేటా సేఫ్టీ పత్రాన్ని సమర్పించాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనను పాటించని యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తామని తెలిపింది.

ఇటీవలి కాలంలో థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా మాల్‌వేర్ దాడులు పెరుగుతున్నాయి. కొన్ని యాప్‌ల డెవలపర్స్‌ యూజర్స్‌కు సంబంధించిన విలువైన సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాప్‌లకు సంబంధించిన పూర్తి సమాచారం యూజర్‌కు తెలియజేస్తే, వారికి అందించే సేవల్లో మరింత పారదర్శకత ఉంటుందని గూగుల్ భావిస్తోంది. యాపిల్ కంపెనీ ఇప్పటికే ఈ తరహా  నిబంధనను యాప్‌స్టోర్‌లో అమలు చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని