Android 13 Features: ఆండ్రాయిడ్ 13 గురించి 13 కొత్త అంశాలు...

ఆండ్రాయిడ్ 13 డెవలపర్స్‌ వెర్షన్‌ను గూగుల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో ఈ కొత్త ఓఎస్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. మరి ఈ ఓఎస్‌లో రానున్న కొత్ ఫీచర్లేంటో చూద్దాం. 

Updated : 17 Feb 2022 13:53 IST

Androind 13 features: సాంకేతికత ఏదైనా యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటేనే యూజర్స్‌కు నచ్చుతుంది. అందుకు ఉదాహరణే ఆండ్రాయిడ్ ఓఎస్‌ (Android OS). గూగుల్‌ ఎప్పటికప్పుడు ఓఎస్‌ను అప్‌డేట్ చేస్తూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. గతేడాది విడుదల చేసిన ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాకముందే గూగుల్ (Google) మరో కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్ ఓఎస్‌ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఆండ్రాయిడ్‌ 13 డెవలపర్స్ వెర్షన్‌ను విడుదల చేసింది. మరి ఈ ఓఎస్‌లో ఎలాంటి ఫీచర్లు యూజర్లకు (Android users) అందుబాటులోకి రానున్నాయో చూద్దాం.   


1️⃣ ఆండ్రాయిడ్‌ 13లో డిజైన్‌ పరంగా నోటిఫికేషన్‌ సెంటర్‌ బటన్స్‌ (టోగుల్స్‌)లో గూగుల్ కొన్ని మార్పులు చేసింది. ఇందులో కొత్తగా వన్‌హ్యాండ్ మోడ్ పరిచయం చేయనుంది. దీంతో యూజర్స్ సులువుగా నోటిఫికేషన్స్‌ను చూసేందుకు ఫోన్‌ స్క్రీన్‌ను పైకి, కిందకి జరపవచ్చు. అలానే కలర్‌ కరెక్షన్‌ కోసం షార్ట్‌కట్ బటన్‌ను కూడా టోగుల్స్‌లో ఇస్తున్నారు. క్యూఆర్‌ కోడ్ స్కానింగ్‌ను ఒక్క క్లిక్‌తో యాక్సెస్ చేసేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ టోగుల్‌ను కూడా ఇస్తున్నారు. 


2️⃣ పాత ఓఎస్‌కు భిన్నంగా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ మీడియా ప్లేయర్‌లో షఫుల్‌, రిపీట్ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో యూజర్స్‌కు ఆడియో/వీడియో ప్లేయర్లు మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మారతాయి. అలానే సౌండ్ అవుట్‌పుట్‌ కోసం ఏ డివైజ్‌ ఉపయోగిస్తున్నామో అందులో చూపిస్తుంది. ఉదాహరణకు మీరు బ్లూటూత్ హెడ్‌సెట్ వాడుతుంటే దాని ఐకాన్‌ మీడియా ప్లేయర్‌లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సౌండ్‌ను పెంచడం, తగ్గించడం వంటివి చేయొచ్చు. 


3️⃣ ఎంతో కాలంగా యూజర్స్ ఎదురుచూస్తున్న పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ (Picture-In-Picture) ఫీచర్‌ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ 13లో అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్స్‌ యూట్యూబ్ వీడియోలు చూస్తూ మరో యాప్‌ను ఉపయోగించవచ్చు. గతంలో యూట్యూబ్‌ వీడియో చూస్తూ మరో యాప్‌ ఓపెన్ చేస్తే వీడియో ఆగిపోయేది. తాజా ఫీచర్‌తో యూట్యూబ్‌ నుంచి బయటికి వచ్చి, మరో యాప్‌ ఓపెన్ చేసినా.. చిన్న స్క్రీన్‌లో మీరు చూస్తున్న వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. 


4️⃣ మెనూలో యాప్‌లను సులువుగా వెతికేందుకు ఆండ్రాయిడ్‌ 13లో కీబోర్డ్ ఆప్షన్‌ ఇస్తున్నారు. అదేంటీ! ఇది పాత ఆప్షనే కదా అనుకోవచ్చు. పాతదాన్నే గూగుల్‌ కొత్తగా తీసుకొస్తోంది. గత ఓఎస్‌లలో యాప్‌ మెనూ పైభాగంలో సెర్చ్‌ బార్‌పై క్లిక్ చేస్తే కీబోర్డు వచ్చేది. ఆండ్రాయిడ్ 13లో మాత్రం సెర్చ్‌ బార్ పక్కనే ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేస్తే ఆల్వేస్‌ షో కీబోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కీబోర్డ్‌ ప్రత్యక్షమవుతుంది.


5️⃣ పాత ఓఎస్‌లలో వాల్‌పేపర్ మార్చాలంటే సెట్టింగ్స్‌లో డిస్‌ప్లేలోకి వెళ్లాల్సిందే. అయితే ఆండ్రాయిడ్‌ 13లో ఫోన్‌ హోమ్‌ స్క్రీన్‌పై క్లిక్‌ చేస్తే క్విక్ వాల్ పేపర్‌ పికర్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో వాల్‌పేపర్‌ ఎంపిక చేసుకునే ఆప్షన్‌తోపాటు విడ్జెట్స్‌, హోమ్‌ స్క్రీన్‌ సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. దీంతో యూజర్ తనకు నచ్చిన వాల్‌పేపర్‌ను సులువుగా మార్చుకోవచ్చు.


6️⃣ ఆండ్రాయిడ్ 13లో థర్డ్ పార్టీ యాప్‌లకు యూజర్‌ తనకు నచ్చిన కలర్‌ థీమ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకోవచ్చు. ఇందుకోసం థీమ్డ్ ఐకాన్స్‌ పేరుతో ప్రత్యేక ఆప్షన్ ఇస్తున్నారు. అంతేకాకుండా డార్క్‌మోడ్‌ థీమ్‌ను కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు.


7️⃣ ఆండ్రాయిడ్ 13లో గెస్ట్‌ మోడ్‌లో అవసరమైన యాప్‌లకు అనుమతిచ్చేలా కొత్త ఫీచర్‌ రానుంది. దీని కోసం మల్టిపుల్ యూజర్‌ ఆప్షన్‌లోకి వెళ్లి గెస్ట్‌ యూజర్‌పై క్లిక్‌ చేస్తే ఏయే యాప్‌లకు అనుమతివ్వాలని అడుగుతుంది. అందులో గెస్ట్‌ యూజర్‌కు అవసరమైన యాప్‌ను ఎనేబుల్ చేస్తే గెస్ట్‌ యూజర్‌ ఖాతాలో సదరు యాప్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి గెస్ట్ యూజర్‌ తన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌ను ఉపయోగించవచ్చు.


8️⃣ ఫోన్‌లో ఏదైనా థర్డ్‌ పార్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీడియా ఫైల్స్‌, సాధారణ ఫైల్స్‌ను యాక్సెస్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతుంది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే యాప్‌ను ఉపయోగించలేం. అలా ఫైల్స్‌ అన్నింటికీ యాక్సెస్ ఇవ్వడంవల్ల యూజర్‌ డేటా యాప్‌ డెవలపర్స్‌కు చేరిపోవచ్చు. దీనికి చెక్ పెడుతూ ఆండ్రాయిడ్ 13లో యూజర్‌ అనుమతించిన ఫొటోలు/వీడియోలు/ఫైల్స్‌ను మాత్రమే యాప్‌లు యాక్సెస్‌ చేసేలా కొత్త ఫీచర్‌ రానుంది.


9️⃣ కొన్ని యాప్‌లు ప్రాంతీయ భాషల్లో ఉంటాయి. ఉదాహరణకు తెలుగులో ఉన్న యాప్‌ను ఇతర భాషల వాళ్లు ఉపయోగించలేరు. ఈ సమస్యకు ఆండ్రాయిడ్ 13లో గూగుల్ పరిష్కారం చూపనుంది. పర్‌-యాప్‌ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. యూజర్స్‌ ఏ భాషలో ఉన్న యాప్‌కైనా తమకు వచ్చిన భాషను ఎంచుకుని ఉపయోగించవచ్చు.


1️⃣0️⃣ యాపిల్ ఐఓఎస్‌ తరహాలోనే ఆండ్రాయిడ్ 13లో క్విక్ ట్యాప్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఫోన్‌ వెనుకవైపు రెండు సార్లు టచ్‌ చేస్తే ఫోన్‌ ఫ్లాష్‌ లైట్ వెలుగుతుంది. ఫోన్‌ లాక్‌ చేసినా కూడా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. 


1️⃣1️⃣ ఫోన్‌ నావిగేషన్‌ బటన్స్‌ ఉపయోగించేప్పుడు కొన్నిసార్లు మెనూ యాక్సెస్ బటన్‌పై డబుల్‌ క్లిక్ చేయడం వల్ల గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. అవసరంలేకున్నా ఇది ఓపెన్ అవడం యూజర్లకు కొంత చికాకు కలిగిస్తుంది. ఆండ్రాయిడ్ 13లో నావిగేషన్‌ బటన్‌పై క్లిక్ చేసినా డిజిటల్‌ అసిస్టెంట్ సేవలు రాకుండా వాటిని డిసేబుల్ చేయొచ్చు.


1️⃣2️⃣ సౌండ్‌ కంట్రోల్స్‌ను సులువుగా యాక్సెస్‌ చేసేందుకు ఆండ్రాయిడ్‌ 13లో స్వల్ప మార్పులు చేశారు. ఫోన్‌ సైడ్‌లో ఉండే సౌండ్‌ కంట్రోల్‌ బటన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌ మీద కుడివైపు సౌండ్‌ నావిగేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వైబ్రేషన్‌, సైలెంట్‌ మోడ్‌, సౌండ్ కంట్రోల్స్‌ కనిపిస్తాయి. 


1️⃣3️⃣ వీటితోపాటు ప్రైవసీ డాష్‌ బోర్డ్‌, కొత్త టాస్క్‌బార్‌ ఫీచర్లు ఆండ్రాయిడ్ 13లో అందుబాటులోకి రానున్నాయి. ప్రైవసీ డాష్‌బోర్డ్‌తో గత వారంలో ఉపయోగించిన డేటా సమాచారం మొత్తాన్ని చూపిస్తుంది. కొత్త టాస్క్‌బార్‌లో ఆరు యాప్‌లను యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నాలుగు యాప్‌లను మాత్రమే టాస్క్‌బార్‌ సపోర్ట్ చేస్తుంది.


Note: గూగుల్ రూపొందించే ఆండ్రాయిడ్ ఓస్‌ను తమకు అనుగుణంగా మార్పులు చేసుకుని మొబైల్ కంపెనీలు తమ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొస్తాయి. అలా శాంసంగ్‌, రెడ్‌మీ వంటి కంపెనీలు ఆండ్రాయిడ్ 13లో రాబోయే కొన్ని ఫీచర్లను ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని