Instagram: ఇన్‌స్టాలో కొత్త రూల్‌.. సెల్ఫీ వీడియో, సోషల్‌ వోచింగ్‌తో వయసు ధ్రువీకరణ!

కొద్ది రోజుల క్రితం యూజర్లు తప్పనిసరిగా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాల్సిందే అనే నిబంధనను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చింది. తాజాగా దీనికి సంబంధించి మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

Updated : 27 Jun 2022 20:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్ల వ్యక్తిగత గోప్యతను మరింత మెరుగుపరుస్తూ, పిల్లల యాప్‌ వినియోగంలో మరింత పారదర్శకత ఉండేలా ఇన్‌స్టాగ్రామ్‌  ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం యూజర్లు తప్పనిసరిగా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాల్సిందే అనే నిబంధనను తీసుకొచ్చింది. తాజాగా దీనికి సంబంధించి  మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. యూజర్లు ఎవరైనా తమ పుట్టిన తేదీ వివరాలను అప్‌డేట్ చేయాలంటే తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డుతోపాటు, సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలోని ఎంపిక చేసిన యూజర్ల ద్వారా పరీక్షిస్తున్నారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లోని యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. 

ఎందుకీ ఫీచర్‌..?

వయసు ధ్రువీకరణ కోసం సెల్ఫీ వీడియో నిబంధన వెనుక ముఖ్యమైన కారణం ఉందని చెబుతోంది ఇన్‌స్టాగ్రామ్‌. ఈ పద్ధతి వల్ల పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం మరింత పారదర్శకంగా ఉండటంతోపాటు, అనవసరపు ప్రకటనలు, అపరిచత వ్యక్తుల పరిచయాలు, అశ్లీల కంటెంట్‌ వారి దరిచేరకుండా అడ్డుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌ చెబుతోంది. అయితే ఈ వయసు ధ్రువీకరణ కోసం రెండు పద్ధతులను ఇన్‌స్టాగ్రామ్‌ సూచిస్తోంది. అందులో మొదటిది సెల్ఫీ వీడియో (Selfie Video), రెండోది సోషల్‌ వోచింగ్‌ (Social Vouching). 

సెల్ఫీ వీడియోతో ఏం చేస్తారు..?

ఇన్‌స్టాగ్రామ్‌లో వయసు ధ్రువీకరణ సెక్షన్‌ ఓపెన్ చేసిన వెంటనే అందులో మూడు ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిలో టేక్‌ సెల్ఫీ వీడియో ఆప్షన్‌ ఎంచుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో సూచించిన విధంగా వీడియోను రికార్డు చేయాలి. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌కు సబ్‌మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలా సబ్‌మిట్‌ చేసిన వీడియోలను వెరిఫై చేసేందుకు యోటీ (Yoti) అనే వయసు ధ్రువీకరణ చేసే  సంస్థతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ పనిచేస్తుంది. వీడియో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి రిజల్ట్ వచ్చిన కొద్ది నిమిషాలకు వీడియో డిలీట్ అయిపోతుంది. ఈ ప్రక్రియం మొత్తం పూర్తవడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. 

సోషల్‌ వోచింగ్ ఎలా చేయాలి..?

సోషల్‌ వోచింగ్‌ ప్రక్రియలో యూజర్‌ వయసును మరో ముగ్గురు యూజర్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీ మ్యూచువల్‌ ఫాలోవర్స్‌ ఎవరైనా ఈ పని చేయొచ్చు. అయితే వారి కనీస వయసు తప్పనిసరిగా 18 ఏళ్లు ఉండాలి. మీకు సోషల్ వోచింగ్ చేసే సమయంలో మరెవరికి వారు వోచింగ్ చేయకూడదు. అలా మిమ్మల్ని సోషల్ వోచింగ్ చేయాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకున్న తర్వాత వారికి రిక్వెస్ట్ వెళుతుంది. రిక్వెస్ట్‌ అందుకున్న మూడు రోజుల లోపల వారు వోచింగ్ చేయాల్సి ఉంటుంది. 

అలా పైన పేర్కొన్న పద్ధతుల్లో వయసు ధ్రువీకరణ పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యూజర్లు వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు సబ్‌మిట్ చేసిన తర్వాత 30 రోజులకు వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. యూజర్లు సబ్‌మిట్ చేసే గుర్తింపు కార్డు వివరాలు తమ సర్వర్‌లో భద్రంగా స్టోర్‌ అవుతాయని ఇన్‌స్టాగ్రామ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని