WhatsApp: వాట్సాప్‌ కొత్త ఫీచర్లు.. టైమ్‌ లిమిట్‌ లేదు.. ఆ చాట్స్‌ ఎప్పుడైనా చదవచ్చు..ఇంకా!

వాట్సాప్‌ కొత్తగా మరిన్ని యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ను పరిచయం చేయనుంది. మరి ఆ ఫీచర్లేంటి.. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

Published : 23 Mar 2022 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన వాట్సాప్ మెసేజింగ్‌ యాప్‌ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. గ్రూప్‌ కాలింగ్, వాట్సాప్‌ పేమెంట్స్‌, డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌, వాయిస్‌ మెసేజ్‌, మల్టీ-డివైజ్‌ సపోర్ట్‌, ఫొటో ఎడిట్‌, వ్యూ వన్స్‌ వంటి ఎన్నో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. మరి వాట్సాప్‌ తీసుకొస్తున్న ఆ కొత్త ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..!


నో టైమ్‌ లిమిట్‌ (No Time Limit To Delete Messages)

ఇతరులకు పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులున్నా లేదా మార్పులు చేయాలన్నా సదరు మెసేజ్‌ను వెంటనే తొలగించేందుకు వీలుగా డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ (Delete For Everyone) అనే ఫీచర్‌ ఉంది. దీంతో మనం పంపిన మెసేజ్‌ను 1 గంట 8 నిమిషాలు 16 సెకన్ల వరకు తమ చాట్‌ పేజీతోపాటు అవతలి వ్యక్తి చాట్‌ పేజీ నుంచి డిలీట్ చేయొచ్చు. కొద్ది వారాల క్రితం ఈ టైమ్‌ లిమిట్‌ను రెండు రోజుల 12 గంటలకు పెంచుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. తర్వలో ఈ టైమ్‌ లిమిట్‌ను తొలగించనున్నట్లు సమాచారం. అంటే యూజర్‌ పంపిన మెసేజ్‌ను ఎలాంటి టైమ్‌ లిమిట్‌ లేకుండా ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చన్నమాట. 


ఏడాదికోసారి టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ (Terms of Services)

వాట్సాప్‌ టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీస్‌లో కూడా మార్పులు చేయనుంది. ఈ మేరకు టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీస్‌లో మార్పులు చేసిన ప్రతిసారీ యూజర్‌కు తెలిసేలా ఆ సెక్షన్‌ పక్కన చిన్న గ్రీన్‌ డాట్ కనిపిస్తుంది. అలానే టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ గురించి ఏడాదికోసారి యూజర్‌కు గుర్తుచేసేందుకు ఇయర్లీ రిమైండర్‌ ఆఫ్‌ అవర్‌ టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ (Yearly Reminder of Our Terms of Services) పేరుతో కొత్త ఆప్షన్‌ తీసుకురానుందని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. 


రీడ్ లేటర్‌ (Read Later)

వాట్సాప్‌ ఆర్కైవ్‌ ఫీచర్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ఆర్కైవ్‌ పేరును రీడ్ లేటర్‌గా మార్చనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్కైవ్‌ చేసిన చాట్ పేజ్‌ అన్నింటికంటే కిందకు వెళ్లిపోయేది. ఏదైనా కొత్త మెసేజ్‌ వస్తే తిరిగి చాట్‌ పేజ్‌లో పైన కనిపించేది. ఈ ఫీచర్‌లో కూడా వాట్సాప్ మార్పులు చేసింది. ఆర్కైవ్‌ చేసిన చాట్ పేజీలలో కొత్త మెసేజ్‌లు వచ్చిన యూజర్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా అవి ప్రత్యేక ఫోల్డర్‌లో ఉండిపోతాయి. దీంతో యూజర్స్‌ తమకు నచ్చినప్పుడు ఆర్కైవ్‌ ఫోల్డర్‌ ఓపెన్ చేసి అందులోని మెసేజ్‌లను చూసుకోవచ్చు. 


గ్రూప్‌ పోల్స్‌ (Group Polls)

ఇతర మెసేజింగ్ యాప్‌లకు దీటుగా వాట్సాప్‌ కూడా గ్రూప్‌ పోల్స్‌ ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేయనుంది. దీంతో యూజర్స్‌ తమకు నచ్చిన అంశం గురించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోల్‌ను క్రియేట్ చేయొచ్చు. వాట్సాప్‌ గ్రూప్‌లో పోల్ నిర్వహించాలనుకున్న యూజర్‌ ప్రశ్నతోపాటు యూజర్స్‌ ఓటు వేసేందుకు వీలుగా సమాధానాలను ఇవ్వాల్సి ఉంటుంది. గ్రూప్‌లో ఉన్న సభ్యులు మాత్రమే ఈ పోల్‌లో పాల్గొనగలరు. అయితే ఈ పోల్‌ నిర్వహణలో గ్రూప్‌ అడ్మిన్లకు ఎలాంటి అధికారాలు ఉంటాయనే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.  


కమ్యూనిటీస్‌ (Communities) 

వాట్సాప్‌లోని గ్రూప్స్‌కు భిన్నంగా కమ్యూనిటీ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. గ్రూప్‌ అడ్మిన్‌ తరహాలోనే కమ్యూనిటీలను నిర్వహించే వారిని కమ్యూనిటీ మేనేజర్స్‌ అని పిలుస్తారు. అలానే కమ్యూనిటీస్‌లోనే వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి ఎండ్‌-టు-ఎండ్ భద్రత ఉంటుంది. వాట్సాప్‌ గ్రూప్స్‌లోలానే కమ్యూనిటీస్‌లో కూడా ఇతరులను ఇన్వైట్‌ లింక్‌, క్యూఆర్‌ కోడ్‌ లేదా మాన్యువల్‌గా ఆహ్వానించవచ్చు. అయితే, కమ్యూనిటీలోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూప్‌లకు మెసేజ్‌ పంపలేరు. అలానే ఇతర సభ్యులతో సంభాషించాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీ అడ్మిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.


మెసేజ్‌ రియాక్షన్స్‌ (Message Reations)

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫొటోలతో మెసేజ్‌ రూపొందించినట్లుగానే వాట్సాప్‌లో కూడా ఫొటోలతో మెసేజ్‌ పంపేందుకు వీలుగా మెసేజ్‌ రియాక్షన్స్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌లో వేర్వేరు ఎమోజీలు ఉంటాయి. వాటిలో యూజర్‌ తనకు నచ్చిన ఎమోజీతో మెసేజ్‌లకు రిప్లై ఇవ్వవచ్చు. ఈ ఫీచర్‌ వ్యక్తిగత చాట్‌ యూజర్లతో పాటు గ్రూప్స్‌ యూజర్స్‌కు కూడా అందుబాటులో ఉంటుంది. 


హైడ్ లాస్ట్‌ సీన్‌ (Hide Last Seen From Specific Contacts) 

వాట్సాప్‌లో మనం చివరిగా ఎప్పడు చూశామనేది ఇతరులకు తెలియకుండా ఉండేందుకు హైడ్‌ లాస్ట్‌  సీన్‌ ఫీచర్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఎనేబుల్ చేస్తే వాట్సాప్‌ చాట్ పేజీలో ఉన్న యూజర్స్‌ అందరికీ చివరగా ఎప్పుడు చూశామనేది తెలియదు. అలాకాకుండా ఎవరో ఒకరు లేదా ఇద్దరు యూజర్స్‌కు తెలియకుండా మిగిలిన వారికి తెలిసేలా లాస్ట్‌ సీన్‌ ఆప్షన్‌లో వాట్సాప్ మార్పులు చేయనుంది. దీంతో మీ లాస్ట్‌సీన్‌ చూడకూడదనుకునే కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేసి మిగిలిన వారు చూసేలా డిసేబుల్ చేయొచ్చు. 


గ్రూప్‌ అడ్మిన్స్‌కు కొత్త ఫీచర్‌ (Group Admins)

కొన్ని సందర్భాల్లో గ్రూప్‌లోని సభ్యులు షేర్‌ చేసే పోస్టులు గ్రూప్‌ అడ్మిన్‌లను చిక్కుల్లో పడేస్తుంటాయి. దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే సదరు మెసేజ్‌ను గ్రూప్‌ నుంచి డిలీట్ చేయగలడు. దీనికి చెక్‌ పెడుతూ గ్రూప్‌ అడ్మిన్‌ల కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో గ్రూప్‌లో షేర్‌ చేసే పోస్టులను అడ్మిన్‌లు డిలీట్ చేయొచ్చు. అభ్యంతరకరమైన మెసేజ్‌లను గ్రూప్‌ అడ్మిన్‌ డిలీట్ చేస్తే.. గ్రూప్‌ చాట్ పేజీలో ‘గ్రూప్‌ అడ్మిన్‌ దాన్ని తొలగించారు’ అనే మెసేజ్‌ కనిపిస్తుంది. గ్రూప్‌కు ఒకరికి మించి ఎక్కువమంది అడ్మిన్‌లుగా ఉన్నా.. ఈ ఫీచర్‌తో వారందరూ మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చు. 


డాక్యుమెంట్‌ ప్రివ్యూ (Document Preview)

వాట్సాప్‌లో ఫొటో, వీడియోలను ఇతరులకు షేర్ చేసేముందు ప్రివ్యూ ఫీచర్‌తో వాటిని జాగ్రత్తగా పరిశీలించి తర్వాత పంపుతాం. ఇక మీదట వాట్సాప్‌లో పంపే పీడీఎఫ్‌ లేదా వర్డ్‌ డాక్యుమెంట్స్‌ను కూడా ఫొటో, వీడియోలను తరహాలోనే ప్రివ్యూలో చూడొచ్చు. ఇవేకాకుండా వాయిస్‌ కాలింగ్‌కు కొత్త ఇంటర్‌ఫేస్‌, చాట్‌ పేజ్‌ ఆప్షన్స్‌లో ఉండే సెర్చ్‌బార్‌ను వీడియో కాలింగ్ ఐకాన్ పక్కకు మార్చడం, బ్రాడ్‌కాస్ట్‌ లిస్ట్‌, న్యూ గ్రూప్‌ ఆప్షన్లను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి న్యూ చాట్‌ సెక్షన్‌లోకి మారనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని