నాణ్యతకు తెలంగాణ పెద్దపీట

సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) అమలు కోసం పంపిణీచేసే వివిధ వస్తువులను తెలంగాణలో నాణ్యత కొలమానాల ఆధారంగా సేకరిస్తున్నట్లు నీతిఆయోగ్‌ పేర్కొంది. దీంతో నాసిరకం వస్తువుల సేకరణ తగ్గిపోయిందని.. ఫిర్యాదులు కూడా

Published : 01 Jul 2022 03:23 IST

పారదర్శకంగా ‘ఐసీడీఎస్‌’ కొనుగోళ్లు

సరకులు పక్కదారి పట్టకుండా ఆధార్‌తో అనుసంధానం

వెల్లడించిన నీతిఆయోగ్‌

ఈనాడు, దిల్లీ : సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) అమలు కోసం పంపిణీచేసే వివిధ వస్తువులను తెలంగాణలో నాణ్యత కొలమానాల ఆధారంగా సేకరిస్తున్నట్లు నీతిఆయోగ్‌ పేర్కొంది. దీంతో నాసిరకం వస్తువుల సేకరణ తగ్గిపోయిందని.. ఫిర్యాదులు కూడా తగ్గాయని చెప్పింది. ఆర్థికనష్టంతో పాటు, అనారోగ్య ముప్పు తప్పుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలంగాణ పోర్టల్‌ ద్వారా పారదర్శక పద్ధతిలో ఆన్‌లైన్‌ ద్వారా పాలు, కందిపప్పు, గుడ్లు, నూనె, బాలామృతాలను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఆయిల్‌ ఫెడరేషన్‌ అండ్‌ ఫుడ్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. అలాగే బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ నుంచి ఈపాస్‌ ద్వారా గ్రామాల్లోని చౌకధరల దుకాణాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. సమీకృత శిశు అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్రోడీకరించి నీతిఆయోగ్‌, వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం గురువారం ‘టేక్‌ హోం రేషన్‌’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ సుమన్‌ కె.బేరి, సభ్యుడు వీకేపాల్‌, సీఈవో అమితాబ్‌కాంత్‌లు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

సహకార సమాఖ్యల నుంచే పాలు

ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాలు కొనుగోలుచేసి గర్భిణులు, బాలింతలకు నెలలో 30 రోజుల పాటు రోజుకు 200 మిల్లీలీటర్లు అందిస్తున్నట్లు తెలిపింది. పాలలో ఉండాల్సిన పోషకాల గురించి ముందే నిర్దేశించి ఆన్‌లైన్‌ టెండరింగ్‌ విధానం ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. ఈ టెండర్‌ ప్రక్రియలో కేవలం సహకార సమాఖ్యలు మాత్రమే పాల్గొనాలనే నిబంధన వల్ల నేరుగా రైతులు ప్రయోజనం పొందుతున్నట్లు పేర్కొంది.

* ఈటెండరింగ్‌ ద్వారా కోడిగుడ్ల కొనుగోలులో కూడా పారదర్శక పద్ధతులను అనుసరిస్తున్నట్లు తెలిపింది. జిల్లా కొనుగోళ్ల కమిటీ ఏడాది కాలపరిమితితో టెండర్‌ జారీచేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ధ్రువీకరణపత్రంతో కోళ్లఫారాలు నిర్వహిస్తున్న రైతులు, నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కింద నమోదైన సంస్థలు మాత్రమే ఈ టెండర్‌ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులన్న నిబంధన విధించినట్లు గుర్తుచేసింది. కందిపప్పులాంటి పప్పుదినుసుల సేకరణకు కూడా టెండర్‌ పద్ధతిని అనుసరిస్తున్నట్లు తెలిపింది.

* అంగన్వాడీలకు పంపిణీచేసే సరకులు పక్కదారి పట్టకుండా ఆధార్‌తో అనుసంధానమైన ఐటీ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు నీతిఆయోగ్‌ పేర్కొంది. తెలంగాణ స్టేట్‌ కమోడిటీస్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం యాప్‌ ద్వారా ఈ వస్తువులను అంగన్వాడీ సెంటర్లకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ ద్వారా రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ సెంటర్ల ఓపెనింగ్‌, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌లను చూడటానికి వీలవుతోందని, దీనివల్ల ఏ సెంటర్‌కు ఎంత సరకు కావాలన్నది కచ్చితంగా అంచనావేయగలుగుతున్నట్లు తెలిపింది.

* రవాణాకు ఆర్టీసీసేవలను ఉపయోగించుకుంటోందని, ఎలాంటి లీకేజీ లేకుండా సరకు నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు చేరుతోందని తెలిపింది.

* 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు అదనపు పోషకాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బాలామృతంతో పాటు బాలామృతం ప్లస్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. దీనిద్వారా గోధుమలు, శనగలు, పాలపొడి, నూనె, చక్కెర అందిస్తున్నట్లు పేర్కొంది.

* బాలామృతాన్ని ఇది వరకు 2.5 కేజీల ప్యాకెట్ల రూపంలో ఇస్తుండగా దీన్ని వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు 1.25 కేజీల రూపంలోకి మార్చిందని, అందువల్ల దీని వాడకం మరింత సులభతరంగా మారినట్లు ఈ నివేదిక వివరించింది. 

* తెలంగాణ ఫుడ్స్‌ ఆధ్వర్యంలో ఉన్న పోషకాహార మండలి ఏటా రెండుసార్లు సమావేశమై ఐసీడీఎస్‌ ద్వారా అందించే ఆహారవస్తువుల నాణ్యతను పరీక్షిస్తున్నట్లు నీతిఆయోగ్‌ నివేదిక తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని