Crime News: పుష్పా సుబ్రహ్మణ్యమే.. ఆనంద సుబ్రమణియన్‌?

షేర్ల క్రయవిక్రయాల్లో కళ్లు చెదిరే లాభాలిప్పిస్తామంటూ మదుపరులను మోసం చేసిన అనుగ్రహ్‌ స్టాక్‌ అండ్‌ బ్రోకింగ్‌ సంస్థ కేసులో నిందితుల్లో ఒకరైన పుష్పా సుబ్రహ్మణ్యం.. నేషనల్‌

Updated : 13 Mar 2022 08:40 IST

అనుగ్రహ్‌ బ్రోకింగ్‌ సంస్థ కేసులో ఎన్‌ఎస్‌ఈ అధికారుల ప్రమేయం

ఈనాడు, హైదరాబాద్‌: షేర్ల క్రయవిక్రయాల్లో కళ్లు చెదిరే లాభాలిప్పిస్తామంటూ మదుపరులను మోసం చేసిన అనుగ్రహ్‌ స్టాక్‌ అండ్‌ బ్రోకింగ్‌ సంస్థ కేసులో నిందితుల్లో ఒకరైన పుష్పా సుబ్రహ్మణ్యం.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి(ఎన్‌ఎస్‌ఈ)లో విధులు నిర్వహించిన మాజీ గ్రూప్‌ ఆపరేటింగ్‌ అధికారి ఆనంద సుబ్రమణియన్‌ ఒక్కరేనా? అని పోలీస్‌ ఉన్నతాధికారులు, సీబీఐ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థ హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో బాధితులను ముంచేసింది. చిక్కడపల్లికి చెందిన ప్రకాశ్‌ తనతో రూ.1.87 కోట్లు మదుపు చేయించి డీమ్యాట్‌ ఖాతాలు ఖాళీ చేశారంటూ నెలకిందట ఓబాధితుడు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందులో ప్రధాన నిందితుడిగా అనుగ్రహ్‌ స్టాక్‌ అండ్‌ బ్రోకింగ్‌ యజమాని పరేష్‌ ఖరియాతో పాటు సహ నిందితులుగా ఎన్‌ఎస్‌ఈ ఉన్నతాధికారులను చేర్చారు. ఇందులో పుష్పా సుబ్రహ్మణం పేరుంది. ఆనంద్‌ సుబ్రమణియన్‌ పేరును బాధితులు పొరపాటుగా అలా చెప్పారా? నిజంగా పుష్పా సుబ్రహ్మణం పేరుతో ఎన్‌ఎస్‌ఈలో ఉన్నతాధికారులున్నారా? అన్నకోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఎన్‌ఎస్‌ఈ అధికారుల అండదండలు

మదుపరులకు చెందిన రూ.1600 కోట్ల సొమ్ము, వారి షేర్లను కాజేసిన అనుగ్రహ్‌ స్టాక్‌ అండ్‌ బ్రోకింగ్‌ సంస్థకు ఎన్‌ఎస్‌ఈలోని ఉన్నతాధికారులు సహాయ సహకారాలు అందించారు. వారి ప్రమేయంతోనే పరేశ్‌ ఖరియా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ముంబయిలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది జనవరిలో ముంబయి పోలీసులు పరేష్‌ ఖరియాను అరెస్ట్‌ చేశారు. అప్పటికే హైదరాబాద్‌లోనూ ఫిర్యాదులు అందడంతో 2021 ఫిబ్రవరిలో సైబరాబాద్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఇక్కడకు తీసుకొచ్చారు. మరోవైపు ఈ సంస్థ తరఫున తేజ్‌మండీ.కామ్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులు కలాప్‌షా, అనిల్‌ గాంధీ నెలరోజుల్లో 15 శాతం పెట్టుబడి వెనక్కు వస్తుందంటూ ప్రచారం చేశారు. దీంతో ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోని అనేకమంది రూ.వందల కోట్లు మదుపు చేశారు. సెబీ అధికారులు 2021 మార్చిలో అనుగ్రహ్‌ స్టాక్‌ అండ్‌ బ్రోకింగ్‌ కార్యకలాపాల్లో మళ్లించిన నగదును స్వాధీనం చేసుకోవాలని ఎన్‌ఎస్‌ఈని ఆదేశించారు. కానీ సంస్థ మదుపరులకు న్యాయం జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని