విద్వేష సునామీని అడ్డుకుందాం

విద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయని కాంగ్రెస్‌ సహా 13 ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. దేశ పౌరుల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు... దుస్తులు, ఆహారం, విశ్వాసాలు, పండగలు,

Updated : 17 Apr 2022 09:28 IST

మతోన్మాదం, అసహనం, అసత్యం... దేశాన్ని చుట్టుముడుతున్నాయి
భయం, మోసం, బెదిరింపులే ఈ ప్రభుత్వానికి మూలస్తంభాలు
సోనియా సహా 13 విపక్ష పార్టీల నేతల ఆగ్రహం.. ప్రజలకు ఉమ్మడి లేఖ
దిల్లీ

విలువైన వనరులను దేశ భవిష్యత్తు, యువత అభివృద్ధికి ఖర్చు చేయడం మాని.. గత సంఘటనలకూ, చరిత్రకూ ఊహాగానాలను జోడించడం ద్వారా ప్రస్తుత పరిణామాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు అనుగుణమైన భావజాలం లేనివారిని అణచివేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వారిపై ప్రయోగిస్తున్నారు. ‘కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ అని చెప్పుకొనే ఈ సర్కారుకు భయం, మోసం, బెదిరింపులే మూలస్తంభాలుగా మారిపోయాయి

- సోనియా గాంధీ


విద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయని కాంగ్రెస్‌ సహా 13 ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. దేశ పౌరుల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు... దుస్తులు, ఆహారం, విశ్వాసాలు, పండగలు, భాష ఇలా ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా మండిపడ్డారు. వీటిని కొనసాగనివ్వకూడదని, ఈ విద్వేష సునామీని దీటుగా అడ్డుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోనియాగాంధీ... ‘ఎ వైరస్‌ రేజెస్‌’ పేరుతో ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యేక కథనం రాశారు. మరోవైపు- ఇటీవల చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతహింసపై 13 విపక్ష పార్టీల నేతలు కూడా తీవ్ర ఆందోళన, అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారంటూ నిలదీశారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడాలంటూ ప్రజలకు వారు సంయుక్తంగా విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ... తమిళనాడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్‌, హేమంత్‌ సోరెన్‌ తదితరులు శనివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘‘మతోన్మాదాన్ని, విద్వేషాలను ఇక ఎంతమాత్రం కొనసాగనివ్వకూడదు. దేశ ప్రజలుగా మనం వీటిని చూస్తూ ఊరుకోకూడదు. లేకుంటే... ఇక మరమ్మతు చేయడానికి వీలుకానంతగా సమాజంపై ప్రభావం పడుతుంది. నకిలీ జాతీయవాద బలిపీఠంపై శాంతి, బహుళత్వాన్ని బలివ్వకూడదు. మునుపటి తరాలు ఎంతో శ్రమించి నిర్మించినవన్నీ నేలకూలడానికి ముందే... ఈ విద్వేషపు సునామీని దీటుగా అడ్డుకోవాలి. దేశ విభజన ఇలా శాశ్వతంగా ఉండిపోవాల్సిందేనా! ఇలాంటి పరిణామాలే తమకు మేలు చేస్తాయంటూ ప్రజలు భావించాలని ప్రస్తుత ప్రభుత్వం కోరుకుంటోంది’’ అని సోనియా మండిపడ్డారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన గీతాంజలి నుంచి పలు పంక్తులను ఊటంకించిన సోనియాగాంధీ... ‘‘మనసు ఎక్కడ నిర్భీతిగా ఉంటుందో’’ అన్న వచనాలు నేటి పరిస్థితులకు ఎంతో సరిపోల్చదగ్గవని పేర్కొన్నారు. కర్ణాటకలో హిజాబ్‌ వివాదం, రామనవమి సందర్భంగా దేశంలో తలెత్తిన ఘర్షణలు, జేఎన్‌యూలో మాంసాహారంపై గొడవలు వంటి అంశాలనూ సోనియా తన కథనంలో పరోక్షంగా ప్రస్తావించారు.

ఆ విద్వేషాలకు మూల్యం చెల్లించాల్సి వస్తోంది: రాహుల్‌

సోనియాగాంధీ కథనాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా భాజపా నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాప్తి చేస్తున్న విద్వేషానికి ప్రతిఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మిళిత జీవనం, కలిసి పండుగలు జరుపుకోవడం భారతదేశ నిజమైన సంస్కృతి అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. దీన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలన్నారు.

మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు?

దేశంలో ఇటీవల చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతపర హింసపై 13 విపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి, సామరస్యతలతో మెలగాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. ఆహారం, దుస్తులు, విశ్వాసాలు, పండుగలు, భాషను సైతం సమాజాన్ని విడగొట్టేందుకు ఉపయోగిస్తున్నారంటూ భాజపాకు చురకలు అంటించారు. మతోన్మాదుల వ్యాఖ్యలు, ఉన్మాద చర్యలకు వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.‘‘శతాబ్దాలుగా భారతదేశం నిర్వచిస్తూ వస్తున్న సామాజిక సామరస్య బంధాలను బలోపేతం చేయడానికి కలిసికట్టుగా కృషి చేస్తాం. సామాజిక విభజనను పెంచి పోషించేందుకు కారణమవుతున్న విషపూరిత భావజాలాన్ని పూర్తి నిబద్ధతతో ఎందుర్కొంటాం. మతపర పక్షపాతాన్ని ఎగదోసేందుకు చేస్తున్న కుట్రలను, దుష్ట పన్నాగాలను తిప్పికొట్టాలనీ... సమాజంలో శాంతిని కొనసాగించాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’’అని నేతలు పేర్కొన్నారు.

వారివి శవ రాజకీయాలు: భాజపా

దేశంలోని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు శవాలపై రాబందు రాజకీయాలు చేస్తున్నాయని, సమాజంలో నెలకొన్న సామరస్యతను చెడగొట్టడంపై మాత్రమే వాటికి ఆసక్తని భాజపా మండిపడింది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటనను ఖండిస్తూ శనివారం రాత్రి ఓ ప్రకటన జారీచేసింది. భాజపా అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా.. ‘మోదీపై ప్రతిపక్ష పార్టీల దాడిని ఆకాశంపై బురద చల్లడం’తో పోల్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని