Updated : 26 Jun 2022 06:08 IST

ఉద్యోగాల గని.. డేటా సైన్స్‌

ఆ రంగంలో ఉద్యోగావకాశాలు అధికం

నైపుణ్య ప్రావీణ్యంలో భారత్‌ వెనకబాటు

ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగు

కోర్సెరా గ్లోబల్‌ స్కిల్‌ రిపోర్ట్‌-2022లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రపంచానికి మానవ వనరులను అందిస్తున్న భారత్‌.. డేటా సైన్స్‌ నైపుణ్యంలో మాత్రం బాగా వెనకబడిపోయింది. అభివృద్ధికి, ఉద్యోగాలకు భారీ అవకాశాలున్న ఈ రంగంపై దృష్టి పెడితే భారతీయ యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ప్రపంచ నైపుణ్య నివేదిక-2022 సూచించింది. డిజిటల్‌ ఎకానమీలో అత్యధిక ఉద్యోగావకాశాలను కల్పించే మూడు నైపుణ్య విభాగాలు-బిజినెస్‌, టెక్నాలజీ, డేటా సైన్స్‌లలో పరిస్థితిని నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోల్చుకుంటే టెక్నాలజీలో ఈసారి భారత్‌ నాలుగు స్థానాలను మెరుగుపర్చుకోగా.. వ్యాపారం, డేటా సైన్స్‌లో దిగజారినట్టు తెలిపింది. నైపుణ్యంలో దేశం మొత్తం ఒకే స్థాయిలో లేదని, ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఆన్‌లైన్‌ కోర్సులను అందించే ప్రతిష్ఠాత్మక కోర్సెరా సంస్థ ఈ గ్లోబల్‌ స్కిల్‌ రిపోర్ట్‌-2022ను ఇటీవల విడుదల చేసింది. ఈ సంస్థలో గత ఏడాది కాలంలో 100కిపైగా దేశాల నుంచి 10 కోట్ల మంది వరకు వివిధ నైపుణ్యాలను నేర్చుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి.. వాటిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా నైపుణ్యాల స్థాయులను వెల్లడించింది.

భారత్‌కు 68వ స్థానం...

మొత్తం మీద నైపుణ్యంలో భారత్‌ 68వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే ఈసారి 4 స్థానాలు దిగజారింది. డేటా సైన్స్‌లో భారత్‌ ప్రావీణ్యం 2021లో 38 శాతం ఉండగా.. 2022లో అది 26 శాతానికి తగ్గింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పడిపోయింది. ఆసియాలో 19వ స్థానంలో నిలిచింది. అయితే టెక్నాలజీ ప్రావీణ్య స్థాయులు 38 నుంచి 46 శాతానికి పెరగడం విశేషం. ఇందులో ఆరు స్థానాలను మెరుగుపర్చుకున్నట్లు నివేదిక వెల్లడించింది. భారత్‌లో నైపుణ్యం విషయంలో పశ్చిమ బెంగాల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌ది కావడం విశేషం.

ఏడాదిలో 47 శాతం పెరిగిన కొలువులు

నైపుణ్యాలను భారత్‌ నిరంతరం మెరుగుపరుచుకోవాలని నివేదిక సూచించింది. ముఖ్యంగా మార్కెట్‌ దృష్ట్యా బహుళ జాతి కంపెనీలు దక్షిణాసియా వైపు చూస్తున్నాయని, అందుకే డేటా సైన్స్‌లో నైపుణ్యాల స్థాయులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశంలో 2020-2021 మధ్య కాలంలో డేటా సైన్స్‌ కొలువులు 47.10 శాతం పెరిగాయని తెలిపింది. ఈ రంగంలో 26 శాతం ప్రావీణ్యం కారణంగా కంపెనీలు ప్రతిభావంతులైన మానవ వనరులు లేక ఇబ్బంది పడతాయని పేర్కొంది.


రెండేళ్లలో మెరికలు వస్తారు

బీటెక్‌లో మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ అంశాలను పదేళ్ల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాం. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యలో రెండేళ్ల క్రితమే బీటెక్‌ డేటా సైన్స్‌, బీకాం అనలిటిక్స్‌ లాంటివి ప్రవేశపెట్టారు. మరో రెండేళ్లలో డేటా సైన్స్‌లో ప్రతిభావంతులు బయటకొస్తారు. పశ్చిమ బెంగాల్‌లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎస్‌ఐ) ఉండటం వల్ల డేటా సైన్స్‌లో అక్కడి విద్యార్థులు మెరుగ్గా ఉన్నారు.

- ఆచార్య కామాక్షిప్రసాద్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, జేఎన్‌టీయూహెచ్‌


భవిష్యత్తు అవసరాలకు నైపుణ్యాలను పెంచుకోవాలి

భవిష్యత్తు అవసరాలు మారుతున్నందున దానికి తగ్గట్టుగా ఇంజినీరింగ్‌, కామర్స్‌ విద్యను మార్చుకొని నైపుణ్యాలను పెంచుకోవాలి. అందుకు కంపెనీలు, కళాశాలలు కలిసి పనిచేయాలి. మైక్రోసాఫ్ట్‌ ‘ఎంగేజ్‌’ లాంటి కార్యక్రమాలతో ఇప్పటికే కొన్ని సంస్థలు ఆ దిశగా పనిచేస్తున్నాయి. మేమూ ఈ అంశంపై అవగాహన పెంచుతున్నాం.

- వెంకట్‌ కాంచనపల్లి, సీఈవో, సన్‌టెక్‌ కార్ప్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ శిక్షణ సంస్థ 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని