తప్పు ప్రశ్నలకు మార్కులు ఇవ్వడం అభ్యర్థులకు మేలు చేయడమే

ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడం సహజమేనని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌

Published : 15 Aug 2022 06:25 IST

పోలీసు నియామక మండలి

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడం సహజమేనని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 7న నిర్వహించిన ఎస్సై తత్సమాన ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లిన దృష్ట్యా అభ్యర్థులకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రంలో వచ్చిన తప్పులపై ఆదివారం ఆయన వివరణ ఇస్తూ ప్రకటన జారీ చేశారు. ‘‘తప్పుగా నిర్ణయించిన ప్రశ్నలకు మార్కులు ఇచ్చే నియమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి నియామక సంస్థ ఎంతోకాలంగా పాటిస్తోంది. ఇదేమీ కొత్త కాదు. ప్రశ్నపత్రాల తయారీ అనేక దశల్లో, అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని ప్రశ్నలు అర్థం కాకపోవడం, అస్పష్టంగా ఉండటం, అనువాద దోషాల కారణంగా తప్పులు దొర్లడం, ఇచ్చిన జవాబుల్లో సరైనది లేకపోవడం, ఒకదానికి మించి ఎక్కువ జవాబులు ఉండటం వంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. తప్పు ప్రశ్నలకు మార్కులు ఇవ్వడం వెనుక నియామక మండలి ఉద్దేశం.. అభ్యర్థులకు మేలు చేయడమే. సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దు. అనుమానాల నివృత్తికి అభ్యర్థులు వెబ్‌సైట్‌ను చూడాలి’’ అని శ్రీనివాసరావు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని