రాష్ట్రంలో భారీ వర్షాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణంలో సుమారు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Published : 07 Oct 2022 04:54 IST

ధారూర్‌లో వాగులో కొట్టుకుపోయిన కారు

ఖమ్మం జిల్లాలో ఒకరి మృతి

నేడు పలు జిల్లాల్లో వానలు

ఈనాడు, హైదరాబాద్‌-ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌-న్యూస్‌టుడే బృందం: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణంలో సుమారు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కొడంగల్‌ పెద్దచెరువు కాలువ తెగిపోయి నీరంతా పట్టణంలోని బాలాజీనగర్‌ ఇళ్లలోకి చేరింది. కాలనీవాసులు అవస్థలు ఎదుర్కొన్నారు. ధారూర్‌ మండలం నాగారం సమీపంలో వాగు ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు శివకుమార్‌, మౌనిక సురక్షితంగా బయటపడ్డారు. వరద ఉద్ధృతికి కారు వారితోపాటే కొంతదూరం కొట్టుకుపోయి చెట్టుకు తట్టుకుంది. శివకుమార్‌ కారు నుంచి చెట్టుపైకి ఎక్కి సెల్‌ఫోన్‌ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. స్థానికులతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్న వారు తాడు సహాయంతో దంపతులను రక్షించారు.  ఖమ్మం గ్రామీణ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన గొల్లపూడి చరణ్‌ (20) బుధవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని సాగర్‌ కాల్వలో గల్లంతయ్యాడు. గురువారం రాత్రి ఆయన మృతదేహం లభ్యమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పెద్ద చెరువులోని నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరి పలు కాలనీలు జలమయమయ్యాయి. గురువారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో 12.2 సెంటీమీటర్లు, తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో 11.7 సెం.మీ. వర్షపాతం నమోదయింది. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని