ఏఎంవీఐ పోస్టులపై సందిగ్ధం

రాష్ట్రంలో 113 సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. అర్హతలపై ఫిర్యాదులతో ఉద్యోగ ప్రకటన రద్దయి నెలలు గడుస్తున్నా రవాణాశాఖ నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు.

Published : 26 Nov 2022 04:40 IST

నెలలు గడుస్తున్నా అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోని రవాణాశాఖ
ఆశావహుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 113 సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. అర్హతలపై ఫిర్యాదులతో ఉద్యోగ ప్రకటన రద్దయి నెలలు గడుస్తున్నా రవాణాశాఖ నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. మహిళా అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ సూచించినా స్పందనలేదు. ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మెకానికల్‌ ఇంజినీర్లు.. ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెవీమోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సుపై వివాదం

రాష్ట్రంలోని మల్టీజోన్‌ 1, 2లో కలిపి 113 ఏఎంవీఐ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ జులై 27న ప్రకటన జారీచేసింది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 5 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేసింది. మొత్తం పోస్టుల్లో మల్టీజోన్‌ 1లో 19, 2లో 22 పోస్టులు కలిపి 41 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. రవాణా శాఖ చేసిన ప్రతిపాదనల మేరకు ఉద్యోగ ప్రకటనలో మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన అర్హత లేదా మూడేళ్ల ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాను విద్యార్హతగా టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. విద్యార్హతలతో పాటు అభ్యర్థులందరికీ ‘ప్రకటన తేదీ నాటికి’ హెవీమోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలని తెలిపింది. దీనిపై మహిళా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముందుగా చెప్పకుండా మార్చారని ఆరోపించారు.

ఏఎంవీఐ పోస్టుల భర్తీకి 2015లో ఇచ్చిన నోటిఫికేషన్లో.. మహిళా అభ్యర్థులు ప్రకటన తేదీ నాటికి లైట్‌మోటారు వాహన లైసెన్సు కలిగి ఉండాలని, సర్వీసులో చేరిన రెండేళ్లలోగా హెవీ మోటారు వాహన లైసెన్సు సాధించాలనేది నిబంధన. కాగా.. ప్రస్తుతం ‘ప్రకటన తేదీ నాటికి’ హెవీమోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలనడంపై మహిళా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని రవాణాశాఖ, టీఎస్‌పీఎస్సీని అభ్యర్థులు కోరారు. దీంతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నిర్ణయాన్ని నిలిపివేసి, విద్యార్హతలపై వివరణ ఇవ్వాలని రవాణాశాఖకు లేఖ రాసింది. ఈ లేఖపై ఎలాంటి వివరణ రాకపోవడంతో టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరులో నోటిఫికేషన్‌ రద్దుచేసింది.

మహిళా అభ్యర్థుల విద్యార్హతలు గత ఏడాదే మార్చిన రవాణాశాఖ, ఆ ఉత్తర్వులను (జీవో నం 7, 2021) వెబ్‌సైట్లో బహిరంగ పరచకుండా రహస్యంగా పెట్టడంతో సమస్య నెలకొందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అప్పుడే ఆయా వివరాలు అందుబాటులో పెడితే అభ్యంతరాలు వెలువడేవి కాదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని