ఉపాధి హామీపై పిడుగు

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులను రూ.89,400 కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు తగ్గించడంతో అది తెలంగాణపై ప్రభావం చూపనుంది.

Published : 02 Feb 2023 03:50 IST

నిధుల కేటాయింపును తగ్గించిన కేంద్రం
రాష్ట్రంపై తీవ్ర ప్రభావం
ఇక పనులకు కటకటే

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులను రూ.89,400 కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు తగ్గించడంతో అది తెలంగాణపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన కూలీలకు సరిపడా పనులు దొరకట్లేదు. కేంద్ర తాజా నిర్ణయంతో మరింత మంది ఉపాధిని కోల్పోనున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని 12,771 గ్రామాల్లో ఇది అమలవుతోంది. 2018-19 కాలంలో ఏకంగా 106 శాతం పనులు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలల గడువు ఉండగా... జనవరి నెలాఖరు నాటికి 10.5 కోట్ల పనిదినాలను కల్పించింది. కూలీలు ఇంకా పనులను కోరుతున్నారు. అయితే నిధులు తక్కువగా కేటాయించడం వల్ల రాష్ట్రంలో నమోదైన వారిలో 35 శాతం మందికే ఉపాధి లభిస్తోంది.

పెంచాలని రాష్ట్రం కోరినా...

పథకం డిమాండ్‌కు తగ్గట్లు కేటాయింపులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి కేంద్రాన్ని కోరుతోంది. కానీ, కేటాయింపుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. 2018-19లో రాష్ట్రం రూ.2,900 కోట్లకు పైగా వినియోగించి ఇంకా పెంచాలని కోరగా.. 2019-20లో రూ.712 కోట్లు తగ్గించింది. 2020-21లో దేశవ్యాప్తంగా కేటాయింపులు పెరగడంతో తెలంగాణకు రూ.4,163 కోట్లు నిర్దేశించింది. రాష్ట్రం పెంచాలని కోరగా పెంచకుండా 2021-22లో రూ.4,119 కోట్లకు పరిమితం చేసింది. 2022-23లో ఇంకా రూ.1,621 కోట్లను తగ్గించింది. ఈ ఏడాది కేటాయింపుల్లో ఇంకా రూ.800 కోట్ల మేరకు సామగ్రి కోటా (మెటీరియల్‌ కాంపొనెంట్‌) కింద కేంద్రం నుంచి రావాలి. అవి ఇవ్వకపోగా.. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రైతువేదికల నిర్మాణానికి వెచ్చించిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.అయిదువేల కోట్లు కేటాయించాలని, పనిదినాల సంఖ్యను 12 కోట్లకుపైగా పెంచాలని కేంద్రాన్ని కోరింది. కానీ, తాజా బడ్జెట్‌లో కేంద్రం దేశవ్యాప్తంగా ఈ పథకం కేటాయింపులను నిరుటి కంటే రూ.29,400 కోట్ల మేరకు తగ్గించింది. ఈ క్రమంలో రాష్ట్రానికి మరో రూ.వెయ్యి కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని, పనులు తగ్గడంతో పాటు గ్రామీణుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ప్రభుత్వవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని