10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు: మంత్రి సబిత

రాష్ట్రంలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Updated : 09 Feb 2023 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్సు బకాయిల వసూలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. మండలిలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘‘మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.7,289.54 కోట్లతో మూడు విడతల్లో 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నాం. తొలి దశలో 9,123 పాఠశాలల్లో జూన్‌కల్లా పనులను పూర్తి చేస్తాం. రెండు, మూడు విడతల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణంపై దృష్టి సారిస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు.

గిరిజన వర్సిటీపై కేంద్రం చిన్నచూపు: మంత్రి సత్యవతి రాథోడ్‌

రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్రం చిన్నచూపు చూస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్‌ మండలిలో తెలిపారు. ‘‘ములుగులో వర్సిటీ ఏర్పాటుకు 335.04 ఎకరాల అనువైన స్థలాన్ని ఎంపిక చేసి.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి మూడేళ్లయినా పట్టించుకోవడం లేదు.  రాష్ట్రంలో కొత్త గిరిజన పంచాయతీ భవన నిర్మాణాలకు రూ.600 కోట్లు కేటాయించాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. వరి సహా అన్ని పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘‘ప్రస్తుతం నకిలీ విత్తనాల బెడద చాలావరకు తప్పింది.  ఏపీ, కర్ణాటక, గుజరాత్‌ల నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 16 మంది నకిలీ విత్తనాల తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగించాం.  విత్తనాల్ని పరీక్షించేందుకు వరంగల్‌, కరీంనగర్‌ల్లో ప్రయోగశాలల్ని ఏర్పాటు చేశాం.  ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాం. ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.  విత్తనాలను రాయితీపై అందిస్తున్నాం. రాష్ట్రంలో అయిదు జిల్లాల్లో మినహా అన్నిచోట్ల ఆయిల్‌పాం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశాం. వనపర్తి జిల్లాలో త్వరలోనే వేరుసెనగ పరిశోధన కేంద్రం పనులను ప్రారంభిస్తాం.  వ్యవసాయ ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో నిలవడం, ధాన్యం సేకరణలో నాలుగో స్థానంలో ఉండటం గర్వకారణం’’ అని మంత్రి పేర్కొన్నారు.

ఇప్పుడు నెలకే రూ.971 కోట్ల పింఛన్లు: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఏటా రూ.861 కోట్ల పింఛన్లు పంపిణీ జరిగేదని.. ఇప్పుడు నెలకే రూ.971 కోట్లు పంపిణీ చేస్తున్నామని  మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. ‘‘అర్హుల వయోపరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడానికి ముందు 68,232 దరఖాస్తులు అందాయి. తగ్గించిన తర్వాత మీసేవ ద్వారా 8,11,817 దరఖాస్తులు వచ్చాయి. కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులతోపాటు డయాలసిస్‌ చేయించుకుంటున్నవారికి, ఒంటరి మహిళలకూ పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్రం సుమారు 6.66 లక్షల మందికి రూ.200 చొప్పున పింఛన్లు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 44 లక్షల మందికి రూ.2016 నుంచి రూ.3016 వరకూ అందిస్తోంది. పింఛన్ల కోసమే రూ.12 వేల కోట్లు కేటాయించాం’’ అని వివరించారు.

దేశంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడ?: కవిత

దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం అందులో ఒక్కటి కూడా భర్తీ చేసేందుకు ప్రయత్నించడం లేదని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలోని యువతకు రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. బుధవారం శాసనమండలిలో ఆమె మాట్లాడారు.  వివిధ రంగాలపై ప్రభుత్వం చేసిన ఖర్చు కారణంగానే తెలంగాణలో ఐటీ, ఐటీయేతర రంగాల్లో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. పాత పథకాలను కొనసాగించాలన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. అలా చేస్తే అవి కుంభకోణాలుగా మారతాయని వ్యాఖ్యానించారు.  జిల్లా పరిషత్‌ సమావేశాల్లో మాట్లాడాల్సిన ఏఎన్‌ఎంల వంటి అంశాలపై శాసనమండలిలో మాట్లాడటం దౌర్భాగ్యం అన్నారు. ఈ వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ అనుచిత పదాలు ఏమైనా ఉంటే తాను చూస్తానని అనడంతో సంవాదం సద్దుమణిగింది.

రూ.20 వేల కోట్ల రుణమాఫీకి రూ.6 వేల కోట్లా?: జీవన్‌రెడ్డి

ధరణి సమస్యల పరిష్కారానికి జిల్లాకో రెవెన్యూ బోర్డు ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘‘రైతుబంధు గొప్పదే కానీ ఇతర రైతు సంక్షేమ పథకాల్ని నిలిపివేయడం సరికాదు. వ్యవసాయ రంగంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీల్ని తిరిగి కొనసాగించాలి. రూ.లక్షలోపు రుణమాఫీ చేయాలంటే సుమారు రూ.20వేల కోట్లు అవసరం కానీ ఈసారి బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించడంలో అర్థమేంటి? డెయిరీ, షీప్‌ఫామ్‌లకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు అందించాలి. వీఆర్‌ఏలను క్రమబద్ధీకరిస్తామని కేటీఆర్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని ఆయన కోరారు.

పాఠశాల విద్యకు నిధులు పెంచాలి: నర్సిరెడ్డి

రైతుబంధు, ఇతర పథకాలకు నిధులు సర్దుబాటు చేసి పాఠశాల విద్యకు పెంచాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. ప్రతి పీహెచ్‌సీకి ముగ్గురు వైద్యులు, ఆరుగురు నర్సులను నియమించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆటంకం కలిగిస్తుందన్న విమర్శల్లో వాస్తవం ఉందన్నారు. ఎమ్మెల్సీలు సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రి, ఫారుక్‌హుస్సేన్‌, ప్రభాకర్‌, జనార్దన్‌రెడ్డి, కోటిరెడ్డి, బండా ప్రకాశ్‌ కూడా మాట్లాడారు.

కొత్తవారు వచ్చాకే ఉన్నవారిని పంపండి: గుత్తా

నల్గొండ జిల్లా డిండి, చందంపేట, నేరేడుగొమ్మ మండలాల్లోని ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలతో వెళితే అక్కడ సమస్య ఏర్పడుతుందని, కొత్త ఉపాధ్యాయులు వచ్చాకే వీరిని పంపాలని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందుకు అంగీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని