ఆధారాలతో నేడు విచారణకు రండి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరోసారి సిట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని శనివారం ఉదయం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10 మైత్రినివాస్‌లో బండి సంజయ్‌కి స్వయంగా అందజేశారు.

Updated : 26 Mar 2023 05:18 IST

సంజయ్‌కి మళ్లీ నోటీసులు జారీ చేసిన సిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరోసారి సిట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని శనివారం ఉదయం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10 మైత్రినివాస్‌లో బండి సంజయ్‌కి స్వయంగా అందజేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఈ నెల 21న ఆయన పలు ఆరోపణలు చేశారు. జగిత్యాలలోని ఒక మండలానికి చెందిన 50 మందికి పైగా, చిన్నగ్రామంలో ఆరుగురు గ్రూప్‌-1 అర్హత సాధించినట్లు ఆరోపించారని నోటీసుల్లో తెలిపారు. వారంతా భారాస నేతల కుమారులు, బంధువులు, వారి వద్ద పనిచేసే వాళ్లేనని... నలుగురు సర్పంచుల కుమారులు, సింగిల్‌విండో ఛైర్మన్‌ కుమారుడితోపాటు జడ్పీటీసీ బాడీగార్డు కుమారుడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు... ఇలా వీరంతా ప్రతిభ లేనప్పటికీ పరీక్షలో అర్హత సాధించినట్లు చెప్పారని, వాటికి సంబంధించిన ఆధారాలతో దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు కోరారు. ఈ నెల 26న(ఆదివారం) ఉదయం 11 గంటలకు హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌ ఎం.గంగాధర్‌ ఎదుట హాజరు కావాలన్నారు. సిట్‌ విచారణకు హాజరు కావాలా, వద్దా.. అనే అంశంపై తమ న్యాయ  బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని బండి సంజయ్‌ మీడియాకు తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నట్టు స్పష్టంచేశారు. లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని