యాదాద్రి, వర్గల్‌ దేవాలయాలకు ఫుడ్‌ సేఫ్టీ జాతీయ గుర్తింపు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, వర్గల్‌ శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జాతీయ సర్టిఫికెట్‌ బ్లిస్‌ ఫుల్‌ హైజీన్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌ (భోగ్‌) గుర్తింపు లభించింది.

Updated : 29 Mar 2023 04:55 IST

ఈనాడు, హైదరాబాద్‌, యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, వర్గల్‌ శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జాతీయ సర్టిఫికెట్‌ బ్లిస్‌ ఫుల్‌ హైజీన్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌ (భోగ్‌) గుర్తింపు లభించింది. దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా తెలంగాణలోని యాదాద్రి, సిద్దిపేట జిల్లా వర్గల్‌ దేవాలయాలకు ఈ గుర్తింపు దక్కింది. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్‌ బృందం కొద్ది రోజుల క్రితం యాదాద్రి, వర్గల్‌ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలపై పరిశీలించింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం భోగ్‌ గుర్తింపునకు రిఫర్‌ చేసింది. ఈ ధ్రువపత్రం సాధించేందుకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ విభాగం కృషి చేసింది. ప్రోగ్రాం ప్రత్యేక నోడల్‌ అధికారిగా అదనపు ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి ఆధ్వర్యంలోని బృందం ఈ రెండు దేవాలయాల్లో నైవేద్యం, అన్నప్రసాదాలు తయారు చేసే క్రమంలో అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలు, శుభ్రత విషయంలో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని