BR Ambedkar: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా..

హైదరాబాద్‌ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. శుక్రవారం(14వ తేదీ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Updated : 13 Apr 2023 11:01 IST

దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం
భూమి నుంచి 175 అడుగుల ఎత్తు స్మారకం
పీఠం 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు
రేపు ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌
బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరణ
అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు

హైదరాబాద్‌ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. శుక్రవారం(14వ తేదీ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మహావిగ్రహ విశేషాలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ స్మారకం ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా రవాణా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

125వ జయంతి సందర్భంగా ప్రకటన

అంబేడ్కర్‌ 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ తరహాలో నిర్మించి పర్యాటక, విజ్ఞాన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది. ఈ మేరకు రూ.146.50కోట్ల నిధులు కేటాయించింది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. నిర్మాణ పనులకు ఎస్సీ సంక్షేమశాఖ నిధులు అందించగా, నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. ఆ శాఖ ఈఎన్‌సీ ఈ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేయాలని అప్పట్లో నిర్ణయించినప్పటికీ..అధ్యయనం, నిర్మాణశైలి తదితర పనుల నేపథ్యంలో జాప్యం జరిగింది.


దిల్లీలో తయారీ.. ఇక్కడికి తరలింపు

కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. స్తూపాన్ని నిర్మించిన తరువాత విగ్రహ భాగాలను దిల్లీలో సిద్ధంచేసి హైదరాబాద్‌కు తరలించారు. భారీ క్రేన్‌ల సహాయంతో వాటిని క్రమపద్ధతిలో అమర్చారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా తయారీలో పటిష్ఠ లోహ సామగ్రిని వినియోగించారు. విగ్రహం పాదాల వద్దకు చేరుకునేందుకు వీలుగా మెట్లమార్గం, ర్యాంపుతోపాటు 15 మంది ఎక్కగల సామర్థ్యంతో రెండు లిఫ్టులు ఏర్పాటుచేశారు.


విజ్ఞానం..విశేషాల సమాహారంగా..

విగ్రహం కింద, పీఠం లోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది. ఇక్కడే మ్యూజియం, అంబేడ్కర్‌ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటుకానుంది. భవనం లోపల ఆడియో విజువల్‌ రూమ్స్‌ ఉన్నాయి. ఈ గ్యాలరీ కోసం ఆ మహనీయుని జీవిత విశేషాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను సమీకరించేందుకు ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ మ్యూజియంతోపాటు గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయడంలో నిమగ్నమైంది. గ్రంథాలయంలో అంబేడ్కర్‌ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి ఏయే పుస్తకాలు అందుబాటులోకి తేవాలనే అంశంపై త్వరలో నిర్ణయం జరగనుంది. మూడు నెలల్లోగా ఈ ఏర్పాట్లు పూర్తికానున్నాయి. స్మారకం వెలుపల పచ్చదనం కోసం 2.93 ఎకరాల ఖాళీ స్థలం ఉంటుంది. స్మృతివనంలో రాక్‌గార్డెన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, వాటర్‌ ఫౌంటేన్‌, శాండ్‌ స్టోన్‌ ఉన్నాయి. స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపే అవకాశం ఉంటుంది.


బౌద్ధ గురువుల ప్రార్థనలు.. హెలికాప్టర్‌తో పూలవర్షాలు

విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. జీహెచ్‌ఎంసీ, రోడ్లు భవనాలు, రవాణా, విద్యుత్తు శాఖల అధికారుల సమన్వయంతో అతిథులకు సౌకర్యాలు కల్పిస్తోంది. రెండు లక్షల మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీటు ప్యాకెట్లు సిద్ధంచేస్తోంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా పీఠం లోపల ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌కు అవసరమైన కసరత్తు పూర్తయింది. విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం కేసీఆర్‌ తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. సీఎంను దాదాపు 30 మంది బౌద్ధగురువులు ప్రార్థనలతో అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత స్తూపం లోపల ఉన్న లిఫ్టులో ముఖ్యమంత్రి అంబేడ్కర్‌ విగ్రహం పాదాల వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. అక్కడ 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. విగ్రహావిష్కరణ తరువాత హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపిస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆహూతులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.


స్మారకం  రూపుదిద్దుకుందిలా..


అసమానమైన వ్యక్తిత్వానికి ప్రతీక
- మల్లేపల్లి లక్ష్మయ్య, ఛైర్మన్‌, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌

అంబేడ్కర్‌ స్మారకం అపూర్వకట్టడమే కాదు. జాతికి గర్వకారణమైన చిహ్నం. ఆ మహనీయుడు దేశానికి చేసిన కృషి, సాధించిన విజయాలు చాలా ఉన్నతమైనవి. 125 అడుగుల విగ్రహం మూర్తీభవించిన అసమానమైన ఆయన వ్యక్తిత్వానికి ప్రతీక.


భావితరాలకు ఆత్మవిశ్వాసం
- ఘంటా చక్రపాణి, అకడమిక్‌ డైరెక్టర్‌, అంబేడ్కర్‌ వర్సిటీ

అంబేడ్కర్‌ ఓ చైతన్య స్ఫూర్తి. ఈ విగ్రహం భావితరాలకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. 1930 నుంచి హైదరాబాద్‌ సంస్థానంతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. హైదరాబాద్‌ను ఆయన రెండో ఇల్లుగా భావించేవారు. రౌండ్‌టేబుల్‌ సమావేశాలకు ఫెలోషిప్‌ ఇచ్చి మూడేళ్లపాటు ఆయన లండన్‌లో ఉండేందుకు నిజాం నవాబు సహకరించారు.


ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని