Tamilisai Soundarajan: దేశాధినేతలనూ కలవొచ్చు.. సీఎంను కలవలేం

భారతదేశానికి వచ్చే దేశాధినేతలను సైతం కలుసుకునే అవకాశం ఉంటుంది కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేమని, ఇదో దురదృష్టకరమైన పరిస్థితి అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

Updated : 04 May 2023 11:36 IST

దేశాలు దగ్గర కావచ్చు.. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మాత్రం కాలేవు
సంక్షేమం అన్ని వర్గాలకు అందాలి.. ఒకటి రెండు కుటుంబాలకు కాదు
సీ20 సమావేశంలో గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు
గచ్చిబౌలి - న్యూస్‌టుడే

భారతదేశానికి వచ్చే దేశాధినేతలను సైతం కలుసుకునే అవకాశం ఉంటుంది కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేమని, ఇదో దురదృష్టకరమైన పరిస్థితి అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. కొన్ని దేశాలు దగ్గర కావచ్చుకానీ రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మాత్రం కాలేవన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో సేవా ఇంటర్నేషనల్‌, సేవా భారతి సంయుక్త ఆధ్వర్యంలో ‘సీ-20 సమాజశాల’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగించారు. ‘ఇటీవల పెద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదు’ అని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రైనా, గవర్నరైనా, మంత్రులైనా ఓపెన్‌ మైండ్‌తో ఉండాలని, తమ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం, దేశం కోసం పనిచేయాలని సూచించారు. ‘కొందరు ముందుగా ప్రజలకు మంచి చేసిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడతారు. కానీ కొందరు కేవలం మాటలు చెబుతారే తప్ప ఏమీ చేయరంటూ’ విమర్శించారు. ప్రభుత్వాలు ఏం చేసినా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే చేయాలి తప్ప సొంత కుటుంబాల వృద్ధి కోసం కాకూడదన్నారు. ‘రాష్ట్రాన్ని పాలించే వారు ప్రజల కోసం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అహంకారాన్ని పక్కనపెట్టి విశాల దృక్పథంతో పరస్పరం చర్చించుకోవాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి.

సవాళ్లను అధిగమించాలంటే ముందు కమ్యూనికేషన్‌ బాగా ఉండాలి. కరోనా వంటి విపత్కర పరిస్థితిని భారతదేశం ఎంతో సమర్థంగా ఎదుర్కొని, ప్రపంచానికి మార్గనిర్దేశం చేసింది. వైద్యం, పర్యావరణం, ఆర్థికం ఇలా ప్రపంచం ఎదుర్కొనే ఏ సమస్యకైనా భారత్‌ పరిష్కారం చూపే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా టీకా ఉత్పత్తి అయితే అది మనకు అందడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది. నేడు భారత్‌ ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించే స్థాయిలో ఉంది. సంక్షేమం అనేది అన్ని వర్గాల ప్రజలకు అందాలి. కేవలం ఒకటి రెండు కుటుంబాలకు కాదు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకునే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జీ-20 సమావేశాల నేపథ్యంలో ప్రజల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు సీ-20, వై-20 సమావేశాలు నిర్వహించడం అభినందనీయం’ అని గవర్నర్‌ అన్నారు. కార్యక్రమంలో సీ-20 సమావేశ సమన్వయకర్త డి.ఎం.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని