RRR - Kashmir: కశ్మీర్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం

కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జీ-20 కల్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు ఈనెల 14-17 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరగనున్నాయి.

Updated : 14 May 2023 07:50 IST

జీ-20లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఫిల్మ్‌ టూరిజంపై చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జీ-20 కల్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు ఈనెల 14-17 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరగనున్నాయి. ఆ తర్వాత 22-24 వరకు కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ-20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం జరగనుంది. దీనికి జీ-20లోని అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్‌ వంటి సభ్యదేశాలతో పాటు బంగ్లాదేశ్‌, సింగపూర్‌ తదితర తొమ్మిది అతిథిదేశాల ప్రతినిధులు సహా ఆహ్వానం పొందిన సంస్థలు, బృందాలు హాజరుకానున్నాయి. శ్రీనగర్‌లో జరిగే ఫిల్మ్‌ టూరిజం సమావేశానికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రబృందానికి ఆహ్వానం అందింది. ఆర్టికల్‌ 370 రద్దయిన తర్వాత కశ్మీర్‌లో జరగనున్న తొలి అంతర్జాతీయ కార్యక్రమంగా జీ-20 సమావేశం నిలవనుంది. దేశంలో సినిమా టూరిజాన్ని, షూటింగ్‌లను ప్రోత్సహించడం.. విదేశీ చిత్రాల షూటింగ్‌లు మన దేశంలో జరిగేలా చూడడం..విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర పర్యాటకశాఖ సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహిస్తోంది. దేశ, విదేశీ ప్రతినిధులను, అతిథులను శ్రీనగర్‌తో పాటు, గుల్మార్గ్‌ తీసుకెళ్లి అక్కడి సుందర ప్రదేశాలను చూపించనున్నట్లు సమాచారం. భువనేశ్వర్‌లో జరిగే సమావేశంలో సంస్కృతి-సంప్రదాయలు, పండుగలు, వారసత్వ సంరక్షణ అంశాలపై చర్చించనున్నారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని