Jangaon: ఈ తప్పుడు పనులేంది నాన్నా!: జనగామ ఎమ్మెల్యేను నిలదీసిన కుమార్తె

‘జనగామకు రాజువని చెబుతుంటావు కదా.. నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ ఈ తప్పుడు పనులేంది నాన్నా’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి సోమవారం బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.

Updated : 20 Jun 2023 07:41 IST

జనగామటౌన్‌, న్యూస్‌టుడే: ‘జనగామకు రాజువని చెబుతుంటావు కదా.. నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ ఈ తప్పుడు పనులేంది నాన్నా’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి సోమవారం బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామ శివారు వడ్లకొండలో సోమవారం నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోతుండగా.. ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డి, అల్లుడు అక్కడికి చేరుకున్నారు. యాదగిరిరెడ్డి వద్దకు భవానీరెడ్డి వచ్చి.. చేర్యాల పట్టణంలో 1200 గజాల భూమిని తన పేరిట ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేశావని నిలదీశారు. చేర్యాలలో తాను ఎలాంటి భూమిని కొనుగోలు చేయలేదన్నారు. రిజిస్ట్రేషన్‌ రోజు ఒక్క పత్రంపైనే సంతకం చేశానని, అది కూడా కార్యాలయం వద్ద తనను బెదిరించి పెట్టించారని ఆరోపించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు చేర్యాల పోలీస్‌ స్టేషన్‌లో యాదగిరిరెడ్డిపై కేసు పెడతానన్నారు.

ఆయన చేస్తున్న తప్పులకు తాను కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బదులిస్తూ.. ‘ఫోర్జరీ సంతకం అంటున్నావు కదా.. అదంతా ప్రభుత్వం చూసుకుంటుందమ్మా. ఇప్పటికే నాపై ఓ కేసు పెట్టావు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థులు తనపై కుమార్తెను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. జనగామలో గతంలో కలెక్టరే తనపై ఆరోపణలు చేసినా ఎవరూ ఏమీ చేయలేకపోయారన్నారు. తనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకం ఉందని పేర్కొన్నారు. గత నెల 9న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ లీజు ఒప్పందానికి సంబంధించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఎమ్మెల్యేపై తుల్జా భవానీరెడ్డి ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని