తక్కెడశిల జానికి యువ పురస్కారం

ప్రముఖ విమర్శకుడు తక్కెడశిల జాని, ప్రముఖ రచయిత డీకే చదువులబాబులను కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలు వరించాయి. వివిధ భాషల్లోని చిరు కథలు, కవిత్వం, నాటకాలు, నవలలు, విమర్శ గ్రంథాలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలు-2023ను శుక్రవారం ప్రకటించింది.

Published : 24 Jun 2023 05:28 IST

డీకే చదువుల బాబుకు బాల పురస్కారం

ఈనాడు, దిల్లీ: ప్రముఖ విమర్శకుడు తక్కెడశిల జాని, ప్రముఖ రచయిత డీకే చదువులబాబులను కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలు వరించాయి. వివిధ భాషల్లోని చిరు కథలు, కవిత్వం, నాటకాలు, నవలలు, విమర్శ గ్రంథాలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలు-2023ను శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన బాల సాహిత్యానికి సంబంధించి 22 మందికి, యువ పురస్కారాలకు 20 మందిని ఎంపిక చేసింది. ఇందులో తెలుగుకు సంబంధించి యువ పురస్కారాన్ని తక్కెడశిల జాని రచించిన విమర్శన గ్రంథం ‘వివేచని’, బాల పురస్కారాన్ని డీకే చదువుల బాబు చిరుకథల పుస్తకం ‘వజ్రాల వాన’ దక్కించుకున్నాయి. వీరిద్దరూ వైయస్సార్‌ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. ఈ అవార్డుల కింద రచయితలకు రూ.50 వేల చొప్పున నగదు, తామ్ర పత్రం, జ్ఞాపిక అందజేస్తారు.

ఇద్దరిదీ ఒకే జిల్లా

  • చదువులబాబు వైయస్సార్‌ జిల్లా పెద్ద ముడియం మండలం పెద్ద పసుపుల గ్రామంలో 1967, జూన్‌ 1న జన్మించారు. తల్లిదండ్రులు దస్తగిరమ్మ, ఖాసీం సాహెబ్‌. ప్రస్తుతం కమలాపురం మండలం పెద్దచెప్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా ఆయన ఎన్నో చిరు కథలు, నవలలు రాశారు. 2003లోనే ‘బాలల కథలు’ సంపుటిని వెలువరించారు. 
  • తక్కెడశిల జాని వైయస్సార్‌ జిల్లా పులివెందులలో 1991 జూన్‌ 8న జన్మించారు. తల్లిదండ్రులు తక్కెడశిల ఆశ, చాంద్‌ బాషా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన జాని పలు దీర్ఘ కావ్యాలు, కథా సంపుటాలు, నవలలు, సాహిత్య విమర్శ గ్రంథాలు వెలువరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని